– అమెరికా అధ్యక్షుడు ట్రంప్
– ఒత్తిళ్లకు తలొగ్గటం సరికాదు : ఆర్థిక నిపుణులు
శ్వేతసౌధం: భారత్ సుంకాలు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఓవల్ ఆఫీస్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. అయితే ఏ ఉత్పత్తులపై తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై భారత్, అమెరికా అధికారులు ఈనెల 23న వాషింగ్టన్‌లో చర్చలు ప్రారంభించారు. భారత్‌తో ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరుచు కుంటాయని, ఇరు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయని ఇప్పటికే అమెరికా పేర్కొంది. టారిఫ్, టారిఫేతర అడ్డంకులను అమెరికా తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన షరతుల(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్)కు ఇరు దేశాలు తుదిరూపునిచ్చాయి కూడా. 90 రోజుల పాటు టారిఫ్ అమలుకు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు రోజుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. భారత్ తరఫు బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి.. ప్రతి సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా ఓ ఒప్పందానికి రావాలని ఇరు దేశాల అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా తమ వస్తువులకు కొత్త మార్కెట్లకు ప్రవేశం లభించడంతో పాటు ఇరు దేశాల్లోని కార్మికులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని అమెరికా ఆశిస్తుంది. దీంతో భారత్‌లో అమెరికా ఉత్పత్తులు, కంపెనీలు వేగంగా విస్తరించనున్నాయని స్పష్టమవుతోంది. అదే జరిగితే ఇక్కడి కంపెనీలు, శ్రామికవర్గం తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్రంప్ వాణిజ్య మత్తులో పడొద్దని చైనా అధ్యక్షుడు హెచ్చరిస్తున్నా.. భారత్ ట్రంప్ ఒత్తిళ్లకు రాజీపడటం తగదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని భారాలు ప్రజలపై పడతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ సుంకాలు తగ్గిస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES