– అకాలవర్షాలతో దెబ్బతింటున్న పంట
– గిట్టుబాటు ధర లేక ప్రయివేటు వైపు మొగ్గు
– క్రమేణా ధర తగ్గిస్తున్న ప్రయివేటు వ్యాపారులు
– మక్కకూ రూ.500 బోనస్‌ఇవ్వాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
”నేను రెండు ఎకరాల మొక్కజొన్న పంట వేశాను. ఎకరానికి రూ.30వేల చొప్పున రూ.60వేల పెట్టుబడి పెట్టా. మొన్నటి ఈదురుగాలులు, వానకు పంటంతా నేలవాలింది. మిషన్‌తో ఆ పంట కోత వీలుకాదు అంటున్నా రు. కాబట్టి మనుషులను పెట్టి చేపించాలి. పంట తీయాలం టే మొత్తం 150 మంది కూలీలు కావాలి. ఒక్కో కూలీకి రూ.400 చొప్పున మొత్తం రూ.60వేల అదనపు ఖర్చు వస్తుంది. మళ్లీ కంకి నుంచి గింజలు వేరు చేసేందుకు రూ.8వేలు మిషన్‌కు ఇవ్వాలి.” ఇది తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని తాతా సత్యనారాయణ పరిస్థి తి. ఇతనే కాదు, మొక్కజొన్న వేసిన ప్రతి రైతుదీ ఇదే పరిస్థి తి. మొక్కజొన్న రైతులు దిక్కులేని స్థితికి చేరుతున్నారు. గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత బాగున్న పంటను ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నా.. ఇటీవల కురిసిన ఈదురుగాలులు, అకాలవర్షాలు, వడగళ్ల వానకు మొక్కజొన్న పంట నేలవాలుతోంది. కల్లాల్లో ఆరబోసిన కంకులు, మొక్కజొన్న గింజలు కూడా ఈ వర్షాలకు నాణ్యత కోల్పోతున్నాయి. ఇదే అదనుగా దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. నాణ్యత బాగోలేదనే పేరుతో ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తడిసిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. ధరల్లో భారీగా కోత పెడుతున్నారు. కేంద్రం నిర్ధారించిన క్వింటాకు రూ.2,225 మద్దతు ధరకు.. ధాన్యం తరహాలో రూ.500 బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేస్తోంది. అకాల వర్షాలతో ఒక్కో ఎకరానికి రూ.30వేల వరకు అదనపు ఖర్చు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది.
గణనీయంగా పెరిగిన సాగు..
రాష్ట్రంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. యాసంగిలో గతేడాది 6.64 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి రెండు లక్షల ఎకరాలు అధికంగా 8.83 లక్షల ఎకరాల్లో సేద్యం చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగైంది. మొక్కజొన్న ఎకరానికి 25-30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తోంది. ఇందుకు రూ.30వేల వరకూ ఖర్చవుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 22.91 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది. గతేడాది రాష్ట్రంలో 309 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి కేవలం 2.67 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను మాత్రమే కొనుగోలు చేశారు. ధర తక్కువగా ఉండటం.. నిబంధనలు క్లిష్టంగా ఉండటంతో ఈ ఏడాది కూడా మార్క్‌ఫెడ్ కేంద్రాల వైపు రైతులు ఆసక్తి చూపటం లేదు.
మార్క్‌ఫెడ్ ని’బంధనాల’తో ప్రయివేటు వైపు…
మార్క్‌ఫెడ్ నిబంధనల నేపథ్యంలో రైతులు ప్రయివేటు వైపు మొగ్గుచూపుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రం ప్రాథమిక సహకార సంఘం పరిధిలో మాత్రమే మార్క్‌ఫెడ్ ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని నెలకొల్పి కూడా పది రోజులకు పైగా అవుతున్నా ఒక్కరిద్దరు రైతులు మాత్రమే దీనిలో విక్రయించారు. కారణం మార్క్‌ఫెడ్ కేంద్రంలో అమ్మితే 16శాతం లోపు తేమ ఉంటే క్వింటాకు రూ.2,225 ధర చెల్లిస్తున్నారు. దీనిలో రూ.60-70 వరకు హమాలీ ఖర్చు వేస్తున్నారు. అంటే రైతుకు క్వింటాకు వచ్చేది రూ.2,155 మాత్రమే. అదే ప్రయివేటుగా క్వింటా రూ.2,100 ధర పెడుతున్నారు. అయితే రైతులు మార్క్‌ఫెడ్ వైపు ఆసక్తి చూపించటం లేదని.. క్రమేణా ప్రయివేటు వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో కోళ్ల పరిశ్రమల నుంచి మొక్కజొన్నలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపా రులు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఒక్క చింతకాని మండ లం నుంచే రోజుకు 20-30 లారీలు ఆ రాష్ట్రానికి వెళ్తున్నా యి. రైలు సౌకర్యం కూడా ఉండటంతో వ్యాగాన్‌లు కూడా భారీగానే వెళ్తున్నా.. అకాల వర్షాల నేపథ్యంలో ధర తగ్గించే యోచనలో ప్రయివేటు వ్యాపారులు ఉన్నారు. ఓవైపు వర్షాల తో క్వింటాకు రూ.500 వరకు ఖర్చు పెరుగుతుండగా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు రూ.500 బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేస్తోంది.
మక్కలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలి
అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరానికి రూ.3వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది. కాబట్టి ధాన్యం తరహాలో మొక్కజొన్నకు కూడా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలి. అప్పుడే మార్క్‌ఫెడ్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయిస్తారు. లేదంటే రైతు కష్టం దళారుల పాలవుతుంది. వారి క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం నష్టనివారణ చర్యలు తీసుకోవాలి.
-బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
మక్క రైతుకు దిక్కేది?
- Advertisement -
RELATED ARTICLES