కొత్త వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దాన్ని ముస్లింల ప్రయోజనాల కోసమే తీసుకువచ్చినట్టు, వ్యతిరేకించే వాళ్లు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నట్టు దుష్ప్రచారం ప్రారంభించింది. ఇందుకోసం ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 5 వరకు దేశవ్యాప్తంగా విస్తతమైన ప్రచార ఉద్యమం సాగించాలని కూడా నిర్ణయించుకుంది.మీడియాలో దీనిపై విస్తారమైన కథనాలు ఇప్పటికే వదులుతుంది. బీజేపీ ముఖ్యమంత్రులైన దేవేంద్ర ఫడ్నవిస్ వంటి వారు బిల్లు చట్టం కాకముందే మహారాష్ట్రలో ఇన్ని వేల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. నిజంగా ఈ చట్టంలో ఏముంది? లాభమా, నష్టమా? నిజంగా రాజకీయ విమర్శ, ఉద్యమం అవసరమా? లాంటి ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులను అత్యవసర ప్రాతిపదికన తీసుకోవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. వక్ఫ్ చట్టంపై పిటిషన్లతో పాటు మతమార్పిడుల చట్టాలకు అనుకూలంగా వ్యతిరేకంగా కూడా కేసుల్లో ఏప్రిల్ 16న విచారణ ప్రారంభిస్తున్నది. ఒక విధంగా ఆరోజుతో ఈ అంశంపై న్యాయ పోరాటాలు కూడా ప్రారంభమవుతా యన్నమాట. కొత్త చట్టం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంది కనుక కేరళ వక్ఫ్‌బోర్డ్ గడువు ముగిసినందున, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొత్త చట్టం మేరకు బోర్డు ఏర్పాటుపై తగు చర్యలకు ఆలోచిస్తున్నది. తాము ఈ చట్టాన్ని అమలు చేయబోమని జార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్‌బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని సూచించినట్టు లీకులిస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌లో అయితే ఇప్పుడున్న అధ్యక్షురాలు, బీజేపీ నియమించబడిన వ్యక్తిగా బలపరు స్తుంటే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక వక్ఫ్‌చట్టం వక్రీకరణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఇప్పుడే తెలిసిపోతున్నది.
అసత్య ప్రచారాలు
1954 వక్ప్‌చట్టాన్ని 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అనుగుణంగా సవరించిందని, 2013లో వాటిని మరింత అనుకూలంగా మార్చిందని బీజేపీ ఆరోపణ. మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేసి తగు సిఫారసులు చేసేందుకై నియమించబడిన జస్టిస్ సచార్ కమిటీ వక్ఫ్ ఆస్తుల మీదిచ్చిన సూచనల స్ఫూర్తిని కాపాడేందుకే తాము 2024 శాసనం తీసుకొచ్చామని కేంద్రనేతలు చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) తయారుచేసిన సమాచారంలో కూడా గత బిల్లు ముస్లింలకు అనుకూలంగా ఉందని ఆరోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భిన్న మతాలతో కూడిన ఈ విశాల దేశంలో మైనార్టీలు అంటే అల్పసంఖ్యాక వర్గాలు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నారు. అది ప్రజాస్వామ్య లక్షణం కూడా. మరి వారి మత వ్యవహారాలకు సంబంధించిన చట్టాలు వారికి అనుకూలంగా కాక వ్యతిరేకంగా ఉండటం ఎలా సాధ్యం? ఏ విధంగా న్యాయం? కేంద్రం చేస్తున్న ఈ ఆరోపణలోనే వారి అసలు వ్యూహం అర్థమవుతుంది. బీజేపీ దీనిపై హడావుడి పడిందంటే లోక్‌సభ, తర్వాత రాజ్యసభలో అర్ధరాత్రి రెండున్నర గంటలకు తీవ్ర వాదోపవాదాల మధ్య ఆమోదింపచేసుకున్నది. ఆ వెంటనే రాష్ట్రపతి గెజిట్ కూడా జారీ చేయడంతో 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. చెప్పాలంటే చాలామంది విద్యాధికులకు కూడా ఇప్పటికీ ఈ వ్యవహారం గురించి పూర్తి స్పష్టత రాలేదు. దానికి చాలా సమయం పట్టవచ్చు. కానీ ఆలోగానే వివాదాలు మాత్రం పెరిగిపోవటం రగిలించడం అనివార్యంగా కనిపిస్తున్నది. ఈ చట్టంలో వ్యూహం ఉద్దేశం కూడా అదే. బుజ్జగింపు రాజకీయాల కోసమే వక్ప్‌చట్టంపై వివాదం సష్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. దీని మీద జరిగిన చర్చ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. నిజంగానే లౌకికతత్వం, మత సామరస్య సంబంధాల పరిరక్షణపై ఈచట్టం తీవ్ర ప్రభావమే చూపిస్తుంది.
అన్నీ తిరకాసులూ రివర్స్‌లే!
వక్ప్‌చట్టం కింద నాలుగు రకాలుగా ఆస్తులు ఏర్పడతాయి. ఒకటి: ఆస్తులను దేవుడికి (అల్లాకు) అప్పగిస్తున్నట్లుగా దానపత్రాలు, దస్తావేజులు తయారు చేయించడం. రెండు: దాతలు నోటిమాటతో ఏదైనా సందర్భంలో ప్రకటించటం. మూడు: వాడుకలో ఆ స్థలం లేదా ఆస్తి దేవుడి సంబంధమైన మతక్రతువులకు వినియోగంలో ఉండటం. నాలుగు: ప్రభుత్వం వక్ప్‌కు ఏదైనా భూమిని ఇవ్వటం. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం వాడుకలో వక్ఫ్ అనే అంశం చెల్లదు. దస్తావేజులు తప్పనిసరిగా ఉండాలనేట్టయితే వందల ఏండ్ల క్రమంలో అనేక వక్ఫ్ ఆస్తులకు దస్తావేజులు లేవు. రాజులతో సహా నోటిమాటతో ఇచ్చినవి అనేకం. ఆ విధంగానే తరాల పర్యంతం వాడుకలో ఉంటున్నాయి. ఇప్పుడు వాటిని వివాదాస్పదం చేయటం చాలా సులభం. బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదం నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి వరకు మనం చూస్తున్నది అదే.
అసలు పేరునే వక్ఫ్ చట్టం అన్నదాన్ని కాస్త ఉమ్మడి నిర్వహణ సాధికారత సమర్థత అభివద్ధి చట్టం అని మార్చారు.దేవాదాయ ధర్మాదాయ చట్టం కింద ఆలయ భూములు వంటివి చూస్తున్నారు. కానీ ఈ రకమైన పరిభాష ఎక్కడా లేదు. వినియోగదారుడు లేదా ధార్మిక సంస్థ దాన్ని వక్ఫ్‌కు అప్పగించినట్లు ప్రకటించవచ్చునని ప్రస్తుత చట్టం చెబుతున్నది.
1)ఇప్పుడు చేసిన మార్పుల ప్రకారం ఐదేండ్లుగా ముస్లిములుగా ఉండి ఆ విశ్వాసాలు పాటిస్తున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్రకటన లేదా దానం ఇతర మతాలవారు చేస్తే చెల్లదని చెప్పడం ద్వారా భిన్న మతాల వారికి అవకాశం లేకుండా పోతున్నది.
2) ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్‌గా స్థిరపడి ఉంటే గతంలో వాటిని అలాగే పరిగణిస్తున్నారు. కొత్త చట్టంలో వక్ఫ్ ఆస్తులుగా వాడుకలో ఉన్నవి అలా కొనసాగవు. దీనిపై వచ్చే విభాగాలను కలెక్టర్ ప్రభుత్వం ముందుంచి పరిష్కరిస్తారు.
3) ఏది వక్ఫ్, ఏది కాదు అన్నది నిర్ణయించే అధికారం గతంలో బోర్డుకు ఉండేది ఇప్పుడు నిబంధనను తొల గించి పూర్తిగా ప్రభుత్వాలకు అప్పగిస్తున్నారు.
4)ఈ ఆస్తులపై సర్వే గతంలో కమిషనరు,్ల అదనపు కమిషనర్లు నిర్వహించేవారు. ఇప్పుడు రెవెన్యూ చట్టాల ప్రకారం వాటి నిర్వహించే అధికారం కలెక్టర్లకు అప్పగించారు.
5)గత చట్టంలో ఇద్దరు మహిళలతో సహా ముస్లింలు మాత్రమే ఈ కమిటీ బోర్డుల్లో సభ్యులుగా నియమితులయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ వ్యక్తులు ముస్లింలు కాకపోయినా ఇందులో సభ్యులు కావచ్చు.ముస్లిం సంస్థల ప్రతినిధులు, ఇస్లామిక్ చట్టాలు పండితులు మాత్రమే ఆ మతానికి చెందిన వారై ఉండాలి. వారిలో ఇద్దరు మహిళలు ఉండాలి.
6) రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో ఎన్నికైన ఇద్దరు ముస్లిం ఎంపీలు ఎమ్మెల్యేలు బార్ కౌన్సిల్ సభ్యులు సభ్యులుగా ఉండాలని గతంలో ఉంది. ఇప్పుడు ఇద్దరు ముస్లిం అధికారులను, షియా సున్నీల నుంచి ఒక్కొక్కరిని బహుళంగా కానీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని ఇద్దరు ముస్లిం మహిళలను తప్పనిసరిగా సభ్యులను చేయాలి.
7) ఇక వక్ఫ్ ట్రిబ్యునల్‌లో ఒక జడ్జి ఆధ్వర్యంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ముస్లిం చట్టాల నిపుణుడు ఉండాలని గత చట్టంలో ఉంటే, ఇప్పుడు ముస్లిం చట్టాల నిపుణుడు అన్నది తొలగించారు. జిల్లా కోర్టు జడ్జి ఛైర్మెన్‌గా ఉండగా ప్రభుత్వం తరపున జాయింట్ సెక్రెటరీ ఉంటారు.
8) ట్రిబ్యునల్ తీర్పులపై గత చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టులు జోక్యం చేసుకోవచ్చు. కొత్త చట్టంలో ఏ వివాదమైనా తొంభై రోజుల లోపల హైకోర్టుకు వెళ్లవచ్చు.
9)పాత చట్టంలో బోర్డు ఆడిటింగ్ పర్యవేక్షణ అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవి. కొత్త చట్టం ప్రకారం కేంద్రానికే అధికారాలు ధారాదత్తం అవుతున్నాయి.అంటే ఉన్న నిబంధనలు మార్చడం, కొత్తవి చేర్చడం ఆదే శాలు ఏవైనా చేయొచ్చు. భిన్న పార్టీలు పాలించే సందర్భంలో ఇది సమాఖ్యతత్వాన్ని దెబ్బతీయడమే గాక సమస్యాత్మకంగా మారుతుంది.
10) షియా సున్నీలు గనక పదిహేను శాతం మించి వుంటే ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయొచ్చని గతంలో వుండేది. ఇప్పుడు ఆగాఖానీ, బోహ్రాలకు కూడా అవిధంగా వేరే బోర్డుల ఏర్పాటుకు అవకాశమిచ్చారు. వాస్తవానికి వారి సంఖ్య అంత ఉండదని, అనవసరంగా చీలికలు తేవడానికే ఈ నిబంధన తెచ్చారని విమర్శలున్నాయి.
సచార్ కమిటీ మాటేంటి?
ఇప్పుడు సచార్ కమిటీ దగ్గరకు వస్తే దాని సిఫార్సులను అమలు చేయడానికి ఈ మార్పులన్నది మరీ అవాస్తవం. ఆ కమిటీ చెప్పిన ఒక్క చిన్న సిఫార్సును కూడా ఇందులో పొందుపరచలేదు. ఉదాహరణకు సచార్ కమిటీ వక్ఫ్‌ఆస్తుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. యూపీఏ ప్రభుత్వం 2014లో దిగిపోయే ముందు 500 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది కూడా. కానీ గత పదేళ్లలో ఈ కార్పొరేషన్ నిర్వీర్యమై ఇప్పుడు మూసివేతకు సిద్ధంగా ఉంది. ముస్లింల్లో భిన్న వర్గాలకు చోటు కల్పించామనే వాదనతో కూడా ఆయా నేతలు ఏకీభవించడం లేదు. బోహ్రా, ఆగాఖానీలు షియా వర్గంలో ఉంటారని, వారిని ప్రత్యేకంగా చూపడం ద్వారా బీజేపీ ముస్లిం సమాజంలో చీలికల కోసం ప్రయత్నిస్తున్నదని కొందరు వాపోతున్నారు. గతంలో వక్ఫ్ బోర్డులకు సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులుగా ఉన్న రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షుడు కే రహమాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ చట్టం వక్ఫ్ బోర్డులను సంస్కరించడానికి కాక దెబ్బతీయటానికే ఉద్దేశించ బడిందని ఆరోపించారు. ఇటీవల మధురైలో ముగిసిన సీపీఐ(ఎం) 24వ మహాసభ కూడా ఈ అంశంపై ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. గతంలో ఉన్న వక్ఫ్ చట్టం సదరు ఆస్తులను నిర్వహించేందుకు ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా ఉండేదని, ఈ కొత్త చట్టం హిందుత్వ ఎజెండాతో ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు పాల్పడుతోందని విమర్శించింది. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఇతర మతస్తులు నిర్వహణలో పాల్గొనరాదని ఉన్నా ఇద్దరు ఇతర మతస్తులను చేర్చాలని నిర్దేశించడం ద్వారా వారి రాజ్యాంగ మత హక్కులకు భంగం కలిగిస్తున్నట్టు పేర్కొన్నది.
అతిశయాల వ్యాప్తి
మరోవైపున దేశంలో వక్ఫ్ ఆస్తులు ఎన్ని, ఎంత విలువ? అన్న అంశంపై తలాతోకలేని లెక్కలు వెలు వడుతున్నాయి. లక్షల కోట్ల విలువ లక్షల ఎకరాలు భూమి ఆ మతస్తులు అన్యాయంగా అనుభవిస్తున్నట్టు దురా భిప్రాయం కలిగించే పెద్ద ప్రయత్నం సాగుతున్నది. ఆక్రమణ దారులు, అవినీతిపరులు ఏ మతానికి చెందిన వారైనా శిక్షార్హులే. కానీ దానికి మతంరంగు పూని, ఈ దేశపు భూమిని మరెవరో దురాక్రమణ దారులు సొం తం చేసుకున్నారన్న భావం కలిగించటం మత విద్వేషాలకే దారితీస్తుంది. ఆస్తులు లెక్కల వివరాలు భిన్నమైన వాస్తవాలు చెప్పుకోవడానికి స్థలాభావం అడ్డొస్తుంది. కానీ కొత్త చట్టం మాత్రం కొత్త వివాదాలకు మార్గం కాకుండా శక్తులు గొంతు ఎత్తవలసి ఉంటుంది. న్యాయవ్యవస్థ సకాలంలో జోక్యం చేసుకోవడమే దీనికి విరు గుడవుతుంది. ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు అలాంటి వివాదాలకు అవకాశం లేకుండా, మైనార్టీల మత హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందేమో చూసేందుకు నిరీక్షిద్దాం.
ఆస్తులు – వాస్తవాలేంటి?
ఇంతకూ దేశంలో 8.8 లక్షల వక్ఫ్ ఆస్తులున్నాయనీ వాటిలో 9.4 లక్షల కోట్ల ఎకరాలు 1.2 లక్షల కోట్ల విలువ కలిగివున్నాయని కేంద్రం చెబుతున్నది. సైన్యం, రైల్వేల తర్వాత వక్ఫ్ ఆస్తులే ఎక్కువని పార్లమెంటులోనే ప్రకటించారు.వాస్తవానికి తిరుపతి వెంకన్న ప్రపంచంలోనే ధనవంతుడైన దేవుడని ఎప్పుడూ వినేవాళ్లకు ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. ఆ సంగతి అలాఉంచితే పై ఆస్తుల్లో సగం అంటే 4.36లక్షల ఆస్తు లకు సరైన పత్రాలు లేవని కేంద్రం అంటోంది.ఇప్పటికే దేశంలో దాదాపు 41 వేల కేసులు నడుస్తున్నాయి. ముస్లింలే వేసిన కేసులు దాదాపు పదివేలున్నాయి. మూడున్నర లక్షల ఎస్టేట్లు వక్ఫ్‌కింద ఉన్నాయని అధికారికంగా లెక్క చెబు తున్నారు.అయితే 2006లో సచార్ కమిటీ చెప్పిన ప్రకారం 4.9లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తుల అధికారిక విలువ రూ.6600 కోట్లుగా గుర్తించారు.వీటిపై కేవలం ఏటా 160 కోట్లు మాత్రమే వస్తున్నందును సమర్థంగా నిర్వ హించాలని సూచించింది. అదే సమయంలో వీటిలో నిరుత్పాదక ఆస్తులనేకం ఉన్నాయని పేర్కొంది. లక్షన్నర ఖబ్రస్థాన్‌లే ఉన్నాయి. మసీదులు మరో లక్షా 20 వేల వరకూ ఉన్నాయి.మదరసాలు,ఈద్గాలు కూడా నడుస్తున్నాయి. కనక కేంద్రం ఒకవైపు నుంచి మాత్రమే చిత్రిస్తున్నట్టు స్పష్టమవుతుంది. మతమేదైనా ఆస్తుల మార్కెట్ విలువ పెరగడం, వాటిని అక్రమార్కులు దుర్వినియోగం చేయడంలో ఆశ్చర్యమేముంటుంది?
తెలకపల్లి రవి
వక్ఫ్‌చట్టంలో వక్రబుద్ధులు!
- Advertisement -
RELATED ARTICLES