– ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: ఫామ్ ఆదివారం నాడు నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమం వార్షిక శిలువ ఊరేగింపునకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రతీ ఏడాది గుడ్‌ప్రైడ్‌కు ముందు వచ్చే ఆదివారం నాడు ఓల్డ్ ఢిల్లీలోని సెయింట్ మేరీ చర్చి నుంచి గోలే డాక్ ఖానా వరకూ ఈ ఊరేగింపు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఈ ఏడాది పోలీసులు అనుమతి నిరాకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు సాకు చూపుతూ ఊరేగింపునకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పని దినాలు, రద్దీ సమయాల్లో కూడా క్రమం తప్పకుండా పోలీసులు వివిధ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తిరస్కరించడం వింతగా అనిపిస్తుందని సీపీఐ(ఎం) పేర్కొంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటారు కాబట్టి, ఇప్పటి వరకూ ప్రతీ ఏడాది అత్యంత క్రమశిక్షణ, శాంతియుతంగా, అధికారులతో పూర్తి సహకారంతో నిర్వహించిన ఈ వేడుకకు ఈ ఏడాది ఎందుకు అనుమతి నిరాకరించారో కేంద్ర హోం మంత్రే సమాధానం ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. అలాగే, అనుమతి నిరాకరించడం ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ యొక్క నిరంకుశ, మైనార్టీ వ్యతిరేక వైఖరికి మరో ఉదాహరణ అని సీపీఐ(ఎం) విమర్శించింది. అన్ని మతాలను సమానంగా చూసేలా, అన్ని మతాలకు ఇచ్చిన రాజ్యాంగ స్వేచ్ఛను నిలబెట్టేలా భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.
వార్షిక శిలువ ఊరేగింపునకు ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ
- Advertisement -