Tuesday, April 29, 2025
Homeఎడిట్ పేజివిద్యార్థుల బాధ్యత ప్రభుత్వాలదే!

విద్యార్థుల బాధ్యత ప్రభుత్వాలదే!

విద్యాలయాలు సమగ్ర వ్యక్తిత్వం గల సమాజాన్ని తయారు చేసే కర్మాగారాలు.గురువులు అందులో కార్మికులు, వారి సృజనాత్మక బోధనలో తయారైన ”విద్యార్థులే విశ్వ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు”. కానీ వాస్తవంగా నేడు జరుగుతున్న దేమిటి?మన దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక చెబుతున్నది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో బలవన్మరణాల రేటు ప్రతి ఏటా రెండు శాతం పెరుగు తుండగా.. విద్యార్థుల అఘాయిత్యాలు నాలుగు శాతం చొప్పున పెరుగుతున్నాయి. అంతేకాదు నమోదు కానివీ చాలా ఉంటున్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తే వీటిని చాలావరకు నిలువరించవచ్చు. ఈ మధ్య కాలంలోనే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాశారు విద్యార్థులు. రిజల్ట్స్‌ వచ్చేవరకు వాటి గురించే ఆలోచిస్తూ వారు మదనపడుతున్నారు. కొంతమంది ఆత్మవిశ్వాసంతో ఉంటే మరికొంత మంది దిగులు ఉంటున్నారు. దీన్ని గమనించాల్సింది తల్లిదండ్రులు. అలాగే ఉపాధ్యాయులు కూడా. పరీక్షలు రాసేది విద్యార్థులైతే, వాటి ఫలితాలు, సామర్ధ్యాల స్థాయిని ఎవరూ గుర్తించడం లేదు. అంచనాలు ఎక్కువ పెట్టుకోవడం, అవి కాస్తా అనుకూలంగా రాక ఆందోళన చెందడం మానసిక కుంగుబాటుకు దారితీస్తున్నది. పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిళ్లతో కూడిన చదువుల్ని తట్టుకోలేకపోతున్నరన్నది వాస్తవమని విద్యా నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే వీటికితోడు ఆర్థిక, సామాజిక కారణాలు, వివక్ష లాంటివి కూడా విద్యార్థులను వేధిస్తున్నట్టు తెలుస్తున్నది.ఓ వైపు ఉపాధ్యాయులు, మరోవైపు తల్లిదండ్రులు మార్కుల కోసం ఒత్తిడి తేవడంతో కుంగుబాటుకు గురై విద్యార్థులు నిస్సాహాయ స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నారు.ఇది చాలా తప్పని, బతికేందుకు చాలా అవకాశాలున్నాయన్నది వారికి వివరించాలి.
ఉపాధ్యాయులు కూడా ఇతరులను చూపెడుతూ బాగా చదవాలని, పరీక్షలు బాగా రాయాలని ఒత్తిడి చేయడం సరికాదు. ఎందు కంటే, కొందరు దీన్ని సానుకూలంగా తీసుకుంటే, ఇంకొందరు ప్రతి కూలంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వారు ఎందులో రాణిస్తారో, ఎందులో ఫెయిలవుతున్నారో గమనించి అందులో వారిని ఉత్తీర్ణత అయ్యేలా చూడటమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే పోటీ పరీక్షల కోసం విద్యా సంస్థలు, కోచింగ్‌ కేంద్రాల్లో చేరే వారిలో చాలామంది దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. హఠాత్తుగా కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండటం వల్ల వీరిలో ఒంటరితనం చోటు చేసుకుంటుంది. ఇది కూడా మానసిక కుంగుబాటుకు కారణమవుతున్నది.తల్లిదండ్రులు విడిపోవడం, కుటుంబ తగాదాలు, స్నేహితుల మధ్య విభేదాలు వంటివి కూడా విద్యార్థులపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ఓదార్చడానికి తోడులేని వాతావరణంలో ఇవి ఎక్కువగా అనర్థానికి దారితీస్తున్నాయి. తెలిసి తెలియని వయసులో మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు కుంగతీస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ లాంటి వాటికి బానిసలుగా మారుస్తున్నాయి. ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల భారం వీరిని తీవ్రమైన వేదనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమ తమవుతున్నప్పుడు తోటి విద్యార్థులు సాయం కోసం ప్రయత్నించాలి. తమ సమస్య తెలిస్తే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో వెనుకాడకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారముంటుందన్న సంగతి మరవకూడదు.
విద్యార్థుల్లో సమగ్ర వ్యక్తిత్వం పెంపొందించడమే లక్ష్యంగా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కృషి చేయాలి. హాస్టల్‌ విద్యార్థులకు కౌన్సె లింగ్‌ లాంటి సేవలు, సపోర్టు, మానసిక సమస్యల చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడాలి. మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం లాంటిదేననే సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి. సమస్యగా భావించినప్పుడు చికిత్స తీసుకోవడం ముఖ్యమని వివరించాలి. విద్యార్థుల్లో ఒకరికొకరు తోడుగా ఉండేలా సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి. ఒత్తిడి తగ్గడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి ఆటలు, వ్యాయామం ఎంతగానో తోడ్పడతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, కాబట్టి ఆటలకు వ్యాయామానికి సమయాన్ని కల్పించాలి. అలాగే సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు ఎక్కువ సేపు గడపడంతో ఎక్కడో సైబర్‌ వేధింపులకు లోనవుతారు.గనుక ఈ సైబర్‌ వేధింపులను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కఠినమైన విధానాలు తీసుకురావాలి. సామాజిక మాధ్యమ సైట్లు యాప్‌లను పర్యవేక్షిస్తూ వీటిమీద అవగాహన కల్పించాలి. ప్రపంచాన్ని మార్చగల ”గొప్ప ఆయుధం విద్య”.ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చడంతో, తల్లిదండ్రులు ఫీజులు కట్టి బికారులవుతున్నారు.ఈ ఆత్మహత్యలకు కారకులెవరు? ప్రభుత్వాలకు బాధ్యత లేదా? కాదా! విద్యార్థుల జీవితాల్ని గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? విద్యార్థులకు ముందుగా శారీరక, మానసిక ఆరోగ్యం చేజారకుండా చర్యలు చేపట్టాలి. విద్యార్థులు కూడా చావడం కాదు, బతికి సాధించాలి. చదువొక్కటే జీవితం కాదు, నీకంటూ ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉంటావు. అదేమిటో తెలుసుకో ఆత్మవిశ్వాసంతో ఆచరించు.మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్లే, మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయని నమ్ము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img