Tuesday, April 29, 2025
HomeUncategorizedవీడీసీలు.. గ్రామ అరాచక కమిటీలు

వీడీసీలు.. గ్రామ అరాచక కమిటీలు

– అణగారిన వర్గాలపై నిరంతరం ఆంక్షలు
– సీఎం, పీసీసీ చీఫ్‌ స్పందించాలి
– ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
– తాళ్లరాంపూర్‌లో పర్యటన
నవతెలంగాణ-ఆర్మూర్‌
అణగారిన వర్గాలపై నిరంతరం ఆంక్షలు విధిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ(వీడీసీ)లపై పాలకులు, అధికారులు, పోలీసులు ఎందుకంత ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఏర్పడ్డ వీడీసీలపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలు శృతిమించుతున్నాయని.. రాజ్యాంగేతర శక్తులుగా మారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని అన్నారు. ‘గ్రామ అరాచక కమిటీలుగా’ పని చేస్తున్న వీడీసీలను పూర్తిగా నిషేధించాలని.. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ వీడీసీ.. గౌడ కులస్తులను బహిష్కరించి అనేక ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) సంయుక్తంగా శుక్రవారం ఆర్మూర్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా, ‘చలో తాళ్లరాంపూర్‌’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తాళ్లరాంపూర్‌లో బాధితులను పరామర్శించారు. ఆర్మూర్‌లో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది వెంకట్రాములు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవీ రమణ, రజక సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ సదానంద గౌడ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రమేష్‌ బాబు తదితరులు మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం తాళ్ళ రాంపూర్‌ వీడీసీ గీత కార్మికులను బహిష్కరించిందని, ఇంతవరకు వారిపైన ఏ విధమైన చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే కుల బహిష్కరణను ఎత్తివేయాలని, వీడీసీలపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో దళితులను, బలహీనవర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌, సీపీ లాంటి ఉన్నతాధికారులు కూడా వీడీసీల అరాచకాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని, కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై వీడీసీలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. వీడీసీల దౌర్జన్యాన్ని ప్రశ్నించడానికి రాజకీయ పార్టీలే భయపడుతున్నాయని, వీడీసీలు రజాకర్ల తరహాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గీత కార్మికులను పదేండ్లపాటు కల్లుగీత వృత్తికి దూరమయ్యేటట్లు చేసిన వీడీసీ చేతనే బాధితులకు పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. గౌడ మహిళలను సాదరంగా గుడిలోకి భాజా భజంత్రీలు, మేళతాళాలతో తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. తాళ్ల రాంపూర్‌ గీత కార్మికులు లింగా లక్ష్మినర్సగౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే బడుగు, బలహీన వర్గాలపైనే వీడీసీల ఆగడాలు అరాచకాలు మితిమీరిపోతున్నాయన్నారు.
ప్రభుత్వం స్పందించి వీడీసీలపై నిషేధం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) డివిజన్‌ కార్యదర్శి పల్లపు వెంకటేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సాయిబాబా గౌడ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మోత్కూర్‌ లింగాగౌడ్‌, బాల్కొండ మాజీ ఎంపీపీ లింగాగౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూరినిడ దశరథ్‌, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్‌ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల అధ్యక్షులు బెజ్జారం అంబదాస్‌, ఎల్లొల సురేష్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పడగెల బాలరాజ్‌, రాష్ట్ర బీసీ, గౌడ, గంగపుత్ర, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నూర్జహాన్‌, నాయకులు కుతాడి ఎల్లయ్య, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img