Wednesday, April 30, 2025
Homeమానవిసంస్కారం అంటే…

సంస్కారం అంటే…

ప్రియ‌మైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకో. ప్రతి వారం నీకోక విషయం చెప్పడం అలవాటు అయిపోయింది. నేను చెప్పే వాటిలో కొన్ని రోజూ ఏదోరకంగా ఎక్కడో అక్కడ ఎదుర్కునేవే. నాన్న.. ఈ రోజు నీకు సంస్కారం అంటే ఏమిటో చెప్తాను. చాలా మంది అంటూ ఉంటారు చదువు కున్నారు, సంస్కారం లేదా అని? చదువు సంస్కారాన్ని నేర్పదు. అది పెరిగిన వాతావరణం వల్ల కొంత, పరిస్థితులను అర్ధం చేసుకునే విధానంలో కొంత అలాగే చదువుతో కొంత వస్తుంది. అంతే కాని చదువు ఉంటేనే సంస్కారం ఉంటుంది అని అనుకోకూడదు.
స్నేహితుల, బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. అక్కడకు వెళ్ళినప్పుడు చాలా మందిని గమనిస్తూ ఉంటాను. వాళ్ళు వేసుకున్న బట్టలు, నగలు, వారి కుటుంబం గురించి పదిమందితో కూర్చుని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. పదిమందిలో విమర్శించడం, ఎగతాళి చేయడం తప్పు. ఎవరి స్థోమతను బట్టి వారు బట్టలు, నగలు వేసుకుంటారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే పక్కకు పిలిచి చెప్పాలి.
ఈ మధ్యన ఓ సంఘటన నేనే స్వయంగా ఎదుర్కొన్నాను. ఇటీవల సప్తహ హరికథ కార్యక్రమాలు జరిగితే వెళ్లాను. రోజూ సాయంత్రం అతిధులు వచ్చేవారు. దాదాపుగా వారంతా నాకు పరిచయమే. నేను వెళ్లి పలకరించి ప్రేక్షకుల పక్కన కూర్చునే దాన్ని. అసలు విషయం ఏమిటంటే కార్యక్రమ నిర్వహకుడుకి ఆతిధులతో ఫొటోలు దిగడం, వాళ్ళ నెంబర్లు తీసుకోవడం ఇష్టం ఉండదు. నేను ఒకరోజు ఒకరితో ఫొటో దిగాను. ఆ మర్నాడు ఫొటోగ్రాఫర్‌ ‘బైట వాళ్ళ ఫొటోలు తీయోద్దన్నారు’ అని అన్నాడు. సరేలే మళ్ళీ అతను మాట పడటం ఎందుకని ఊరుకున్నాను. ఐదవ రోజు కార్యక్రమానికి ఒక ఎమ్మెల్యే వచ్చారు. వారు వేరే ఊర్లో ఉంటారు. మళ్ళీ ఆయన్ని కలవడం కుదరది ‘సర్‌ మీతో ఒక ఫొటో దిగొచ్చా’ అన్నాను. ‘సరే అమ్మ’ అని నిల్చున్నారు. నేను ఫొటోగ్రాఫర్‌ని పిలుస్తున్నాను. ఈ లోపల కార్యక్రమ నిర్వాహకులు వచ్చి ‘మీరు రోజూ అందరితో ఫొటోలు దిగుతున్నారు, ఇది పద్దతి కాదు, కావాలంటే హరికథలు వినడానికి రండి’ అని అందరి ముందు అనేశారు. నేను ఏమీ మాట్లాడలేదు. ఎమ్మెల్యే వెళ్లి పోయారు. ఇది ఒక 75 ఏండ్ల వ్యక్తి సంస్కారం. పైకి పెద్దరికం, పెద్దమనుషులు, సామాజిక సేవ అంటూ ఒక ముసుగు వేసుకుని నటిస్తారు. అతనికి ఇష్టం లేకపోతే పక్కకు పిలిచి చెప్పాలి. మహిళను అని కూడా చూడకుండా ఇలా మాట్లాడాడు. తర్వాత చాలా మంది నాకు ఫోన్‌ చేసి ‘తప్పు అతనిదే మీరేమీ బాధ పడకండీ’ అని ఊరడించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సంస్కారం అనేది చదువు, వయసుతో సంబంధం లేనిది. కొంతమంది వయసులో చిన్నవారైనా ఎంతో సంస్కారంగా ఉంటారు. చదువులేకపోయినా పద్దతిగా మాట్లాడతారు. అలాగే నీ మాటలు, చేతలు, నడతలే నీవు ఎంత సంస్కారవంతురాలివో తెలియజేస్తాయని గుర్తుపెట్టుకో బంగారం. ఉంటాను… ప్రేమతో అమ్మ

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img