Monday, May 5, 2025
Homeతాజా వార్తలుసర్కారుపై ఉద్యోగుల నారాజ్‌

సర్కారుపై ఉద్యోగుల నారాజ్‌

- Advertisement -

– పెండింగ్‌ బిల్లులపై అసంతృప్తి
– ఏండ్ల తరబడి ఎదురుచూపులు
– సంఘాల ఆందోళన బాట
– కీం…కర్తవ్యం..!?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఎన్నికల ముందు చెప్పినదానికి, అధికారంలోకి వచ్చాక చేస్తున్నదానికి మింగుడుపడటం లేదు. అధికారం కోసం హామీలు ఇచ్చి ఆనక దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆందోళనపథంలో వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్నీ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పెన్షనర్లు సైతం లక్షల్లో ఉన్నారు. ఆయా సర్కారీ శాఖల సర్వీసు నిబంధనల ప్రకారం సమయానుకూలంగా ప్రమోషన్లు, బదిలీలతోపాటు వేతనాల పెంపు, డీఏలు, ఇతర భత్యాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది.అయితే కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలవుతు న్నది. సాధారణంగా రావాల్సిన నిధులను సైతం మోడీ సర్కారు తొక్కిపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థికంగా చిక్కులను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు తప్పకుండా చెల్లిస్తామని సర్కారు బయటకు చెబుతున్నా, నిధుల సమీకరణ సవాల్‌గా మారిందని ప్రభుత్వ పెద్దల అభిప్రాయంగా ఉంది.
3.69 లక్షల మంది
రాష్ట్రంలో మొత్తం యాభైకిపైగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో 3.69 లక్షలకుపైగా ఉద్యోగులుండగా, 2.88 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగులకుగాను దాదాపు రూ. 8000 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు బకాయిలు ఉన్నట్టు గతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ప్రతినెలా కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ సైతం ఇచ్చారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.సాధారణ అవసరాలకే లోటు బడ్జెట్‌ ఉందని గత అసెంబ్లీ సమావేశాల్లో సర్కారు ప్రకటించింది కూడా. కాగా 2023.జులై నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ గుర్తించి సర్కారు పన్నెత్తడం లేదు. డీఏలు దాదాపు రెండేండ్లుగా విడుదల చేయడం లేదు.
చిన్న మొత్తాలూ పెండింగే..
కనీసం ఉద్యోగుల పీఎఫ్‌ పార్ట్‌పైనల్‌ మొత్తాలను కూడా అత్తెసరుగా ఇచ్చే పరిస్థితి నెలకొంది. దానికి కూడా నెలలతరబడి టోకెన్లతో ఎదురుచూడాల్సి వస్తున్నది. ఉద్యోగ సంఘాల జేఏసీ చెప్పినట్టుగా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి ఏదో ఒక బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా అవసరాలు తీర్చుకోవడానికి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సంఘాల విమర్శిస్తున్నాయి. అదే సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం గత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. ఆదాయం పెంచండి.. మేము పేదలకు పంచుతాం..ప్రతినెలా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తెస్తున్నాం.. ఇక డీఏలు, ఇతర భత్యాల గురించి ఆశలు పెట్టుకోవద్దని ఉద్యోగులకు పరోక్షంగా పెండింగ్‌ బిల్లుల పట్ల నిస్సహాయతను వ్యక్తం చేశారు. మీరు నిరసన తెలపాలనుకుంటే జపాన్‌ తరహాలో రెండు, మూడు గంటలు అదనంగా పనిచేసి ఆదాయం పెరిగేలా చూడాలంటూ విజ్ఞప్తి చేసే తరహాలోనే మాట్లాడారు. అయితే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై రోజురోజుకు అసంతృప్తి తీవ్రమవుతున్నట్టు పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సర్కారుకు సమాచారం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంది. ఇప్పటికే ఆయా ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించా యి. దీనిపై సర్కారును ఇంటెలిజెన్స్‌ అప్రమత్త ం చేస్తున్నది. ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతరులతో టచ్‌లో ఉంటున్నట్టు సమాచారం.
సంఘాల కార్యాచరణ
పెండింగ్‌ బిల్లులు, ఇతరాల విషయమై ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించింది. రిటైర్డ్‌ ఉద్యోగులు వచ్చేనెలలో మహాధర్నా చేసేందుకు వ్యూహారచన చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసును ఇచ్చాయి. పంచాయతీకార్మికులు వచ్చే మే నెల నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇలా ఒక్కో సంఘం ఒక్కో తరహాలో ప్రభుత్వంపై పెండింగ్‌ బిల్లుల విషయమై దండెంతేందుకు అడుగులేస్తుండటం గమనార్హం.
పెద్దలకు విడుదల
ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులను పెండింగ్‌లో పెడుతూ బడా కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేస్తున్నదనే విమర్శలను రేవంత్‌ సర్కారు ఎదుర్కొంటున్నది. పెద్దవాళ్లకు రూ. 1200 కోట్లు ఫిబ్రవరిలో ఇచ్చారనీ, అదే సందర్భంగా సర్పంచులు, ఇతరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 691.93 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సర్కారు అంగీకరించింది. దీనిపై సర్పంచులు గత నెలలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ను ముట్టడించారు. అర్థనగంగా ఆందోళనకు దిగారు. ఒక సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకున్న సందర్భమూ ఉంది. పెండింగ్‌ బిల్లులతోపాటు సర్కారు హెల్త్‌కార్డుల సమస్యను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వైద్య,ఆరోగ్య శాఖ ఈవిషయంలో ఒకింత నిర్లక్ష్యం చేస్తున్నదని అంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -