– సీసీఎల్‌ఏ కమిషనర్ ఉత్తర్వులు
– గ్రామస్తుల హర్షం
– వివరాలు వెల్లడించిన మాజీ సర్పంచులు
– ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 129, 142లో ఉన్న 25.10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను గ్రామ మాజీ సర్పంచులు దండు ఇస్తారి, యాటకారి సిద్ధేశ్వర్ శంషాబాద్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సుల్తాన్‌పల్లి గ్రామ రెవెన్యూలో సర్వేనెంబర్ 129లోని 16.24 ఎకరాలు, 142లోని 8.26 ఎకరాలు బిల్లా దాఖలలో(ప్రభుత్వ భూమి) ఉంది. 1954-55లో ఆ భూమి బిల్లా దాఖల(ప్రభుత్వ భూమి)గా రికార్డుల్లో ఉందని, అయితే పి.ప్రభులింగం అనే వ్యక్తి ముగ్గురు కొడుకులయిన పి.నర్సింలు పి.అశోక్ పి.రవీందర్ ఆ భూమి వారసత్వంగా వచ్చిందంటూ 2005 జూన్‌లో పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. ఆ భూమిని కాసుల చంద్రశేఖర్‌గౌడ్, డి. వెంకటేష్‌గౌడ్, టీఎల్ శ్రీనివాస్‌చారి, ఏ.కృష్ణారెడ్డి, దీప్తి మౌనికకు అమ్మేశారు. అయితే 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిలో పేదలకు 60 గజాల చొప్పున ఇండ్లస్థలాలతో పాటు శ్మశానవాటికకు కూడా కేటాయించింది. అలాగే, ఆ భూమిలో ఉన్న బోడవానికుంట అభివృద్ధి కోసం రూ.2,71,331 నిధులు మంజూరు చేసింది. అయితే ఆ భూమి కాసుల చంద్రశేఖర్, దూరల వెంకటేష్‌గౌడ్‌తో పాటు మరికొందరు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది కబ్జా ప్రయత్నం చేయడంతో గతంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయంలో గ్రామ మాజీ సర్పంచ్ యాటకారి సిద్దేశ్వర్, ఎం.లక్ష్మయ్య సీసీఎల్‌ఏలో కేసు వేశారు. సుమోటోగా స్వీకరించిన సీసీఎన్‌ఏలో విచారణ చేపట్టారు. ఆ భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రభుత్వానికి చెందుతుందని సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ తీర్పు వెల్లడించారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమిని కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ బోర్డులు పాతాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని గ్రామ మాజీ సర్పంచులు కోరారు. సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తీర్పు వెలువరించిన సీసీఎల్‌ఏ కమిషనర్, ప్రభుత్వ అధికారులకు, సహకరించిన గ్రామస్తులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ భూమి అంటూ తీర్పు వెలువరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎం.లక్ష్మయ్య, ఎలుగని ప్రభాకర్‌గౌడ్, రాజుగౌడ్, జి.మల్లికార్జున్, మైలారం రాజు, శ్రీశైలం, సిద్దయ్య, కావలి ఈశ్వర్, శివగౌడ్ రాఘవేందర్, సిద్ధికీ, మురళి, సాయి, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్‌పల్లిలోని 25.10 ఎకరాలు ప్రభుత్వానిదే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES