Thursday, April 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ను తెరుస్తున్నాం

హార్ముజ్‌ను తెరుస్తున్నాం

- Advertisement -

చైనా కోసం…ప్రపంచం కోసమే : ట్రంప్‌
ఇరాన్‌ యుద్ధం ముగియబోతోంది
రెండో విడత చర్చలకు దౌత్య యత్నాలు
వాషింగ్టన్‌లో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ రాయబారుల భేటీ
వాషింగ్టన్‌ :
ప్రపంచ దేశాల కోసం హార్ముజ్‌ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ‘హార్ముజ్‌ జల సంధిని నేను శాశ్వతంగా తెరిచినందుకు చైనా చాలా సంతోషిస్తోంది. నేను చైనా కోసం…ప్రపంచం కోసం ఆ పని చేశాను. ఈ పరిస్థితి ఇకపై ఎన్నడూ ఉత్ప న్నం కాదు. ఇరాన్‌కు ఆయుధాలు పంపరాదని వారు అంగీకరించారు. కొన్ని వారాల క్రితం నేను అక్కడికి వెళ్లినప్పుడు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నన్ను పెద్దగా, బలంగా హత్తుకున్నారు. మేము కలిసి పనిచేసుకుం టున్నాం’ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. కాగా ఇరాన్‌కు ఆయుధాలు అందించవద్దని జిన్‌పింగ్‌కు లేఖ రాశా నని ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు అందిస్తోం దని తాను విన్నానని, అలా చేయవద్దని కోరుతూ లేఖ రాశానని చెప్పారు. తాను అలా చేయడం లేదని జిన్‌పింగ్‌ ప్రత్యుత్తరం ఇచ్చారని అన్నారు.

ఇరాన్‌ యుద్ధం ముగియబోతోంది
ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం త్వరలోనే ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. యుద్ధాన్ని సైనిక చర్యతో ముగించబోవడం లేదని ఆయన తెలిపారు. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు అమెరికా సిద్ధమవుతున్న వేళ ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘మాపని ఇంకా పూర్తి కాలేదు. మేము నిష్క్రమిస్తే ఇరాన్‌ పునర్నిర్మాణానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఒప్పందం చేసుకోవాలని వారు బలంగా కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్‌ చెప్పారు. ఫాక్స్‌ బిజినెస్‌ ప్రతినిధితో ట్రంప్‌ బుధవారం మాట్లాడుతూ ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి చేయాలన్న తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఇరాన్‌ అణు సామర్ధ్యాన్ని నిర్మూలించడానికి ఆ చర్య అవసరమని అన్నారు. ‘నేను ఆ పనిచేయకపోతే ఇరాన్‌ వద్ద ఇప్పటికే అణ్వాయుధం ఉండేది. ఒకవేళ వారి వద్ద అణ్వాయుధం ఉంటే మీరు వారిని సర్‌ అని వినయంగా పిలవాల్సి వచ్చేది. అలా జరగాలని ఎవరూ కోరుకోరు’ అని ట్రంప్‌ చెప్పారు. అలాగే పదివేల మందితో యూఎస్‌ బలగాలు పశ్చిమాసియాలో మకాం వేసి ఉన్నట్టు తెలిపారు.

హార్ముజ్‌లో నౌకల రవాణాను అనుమతించండి : అమెరికాను కోరిన సౌదీ
హార్ముజ్‌ జలసంధి మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇరాన్‌తో చర్చలు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని సౌదీ అరేబియా కోరింది. లేకుంటే ప్రాంతీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతుందని హెచ్చరించింది. హార్ముజ్‌ మూసివేతకు ప్రతీకారంగా గల్ఫ్‌కు ఆవల ఇరాన్‌ దాడులు చేయవచ్చునని, ఇతర కీలక సముద్ర మార్గాలను అడ్డుకోవచ్చునని అరబ్‌ అధికారులు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికకు తెలియజేశారు. సౌదీ అరేబియాలోని కీలక బాబ్‌ అల్‌-మందెబ్‌ జలసంధిని ఇరాన్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నదని సౌదీ అందోళన చెందుతోంది. ఎర్ర సముద్రంలోని ఈ జలసంధి ద్వారానే సౌదీ నుంచి చమురు ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. బాబ్‌ ఎల్‌-మందెబ్‌ను మూసివేయాలని ఇరాన్‌ అనుకుంటే హౌతీలు జత కలుస్తారని యెమన్‌ నిపుణుడు ఆడం బరన్‌ చెప్పారు. గాజా ఘర్షణ సమయంలో హౌతీలు తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు.

రెండో విడత చర్చలకు దౌత్య యత్నాలు వాషింగ్టన్‌లో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ రాయబారుల భేటీ
అమెరికా, ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చల కోసం ఇస్లాబాద్‌లో దౌత్యవేత్తలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇరాన్‌ ఓడరేవులను దిగ్బంధిస్తానని అమెరికా చేసిన హెచ్చరిక, దానికి ప్రతిగా మధ్యప్రాచ్యం అంతటా లక్ష్యాలపై దాడులు చేస్తానని ఇరాన్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో రెండో విడత చర్చలపై ఉత్కంఠ నెలకొంది. రాబోయే రెండు రోజులలో ఇరాన్‌తో సంప్రదింపులు జరుగుతాయని, వాటికి ఇస్లామాబాదే వేదిక అని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే. చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ కూడా చెప్పారు. పాకిస్తాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌తో మాట్లాడానని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా దశాబ్దాల విరామం తర్వాత తొలిసారిగా ఇజ్రాయిల్‌, లెబనాన్‌ రాయబారుల మధ్య వాషింగ్టన్‌లో చర్చలు జరిగాయి. ఇవి మంచి ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. ఉగ్రవాద హెజ్బొలా గ్రూపు నుంచి లెబనాన్‌కు విముక్తి కల్పించాలని ఇరు పక్షాలు అభిప్రాయ పడ్డాయని ఇజ్రాయిల్‌ రాయబారి ఎచిల్‌ లైటర్‌ తెలిపారు. సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని లెబనాన్‌ రాయబారి నాదా హమదేV్‌ా మొవాద్‌ అన్నారు. అయితే ఇజ్రాయిల్‌, హెజ్బొల్లాల మధ్య జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకాలని ఆయన కోరారు.

రష్యా నుంచి పెరిగిన ఇంధన దిగుమతులు
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ ఇంధన సరఫరాలలో ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గత నెలలో రష్యా నుంచి మన దేశం పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేసింది. తద్వారా భారత ఇంధన దిగుమతుల వ్యూహంలో మార్పులు జరిగాయి. మీడియా వార్తల ప్రకారం రష్యా నుంచి మార్చిలో మన దేశం రూ.58,229 కోట్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న సమయంలో దిగుమతులు రెట్టింపుకు పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత్‌ తన ఇంధన వ్యూహాన్ని సర్దుబాటు చేసుకుంటోందని ఈ పరిణామం రుజువు చేస్తోంది. ఫిబ్రవరిలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు పడిపోయిందని, అయితే అది మార్చిలో గరిష్ట స్థాయికి చేరుకున్నదని సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) సంస్థ తెలిపింది. గత నెలలో రష్యా నుంచి శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసిన దేశాలలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. వీటిలో 91 శాతం వాటా ముడి చమురుదే. దీనితో పాటు బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను కూడా భారత్‌ కొనుగోలు చేస్తోంది.

19 వరకే ఇరాన్‌ చమురు అమ్మకాలు గడువు పొడిగించం : అమెరికా
సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ నౌకలలో ఉన్న చమురును విక్రయించుకునేందుకు ఇచ్చిన గడువును పొడిగించే ప్రశ్నే లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌ చమురు నౌకల ప్రయాణానికి అమెరికా ఈ నెల 19వ తేదీ వరకూ తాత్కాలిక వెసులుబాటు ఇచ్చింది. దానిని పొడిగించే ఉద్దేశం లేదని, ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తామని ట్రంప్‌ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్‌ ఇంధన ఎగుమతులకు ఈ నెల 19వ తేదీ వరకూ ఇచ్చిన వెసులుబాటును పొడిగించే ఉద్దేశం లేదని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేసింది. అంతేకాక కఠినతరమైన నిబంధనలను విధించబోతున్నామంటూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు సంకేతాలు పంపింది. అందుబాటులో ఉన్న అన్ని అధికారాలు, సాధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటా మని చెప్పింది. ఇరాన్‌ లావాదేవీలను కొన సాగించే విదేశీ బ్యాంకులపై సెకండరీ ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇప్పటికే నౌకలలో నింపిన ఇరాన్‌ చమురును, పెట్రో కెమికల్‌ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు గత నెలలో అమెరికా అనుమతి ఇచ్చింది. యుద్ధ సమయంలో అంతర్జాతీయంగా సరఫరాల ఒత్తిడి తలెత్తకుండా చూసేందుకు గతంలో విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో 140 మిలియన్‌ బ్యారల్స్‌ చమురు రవాణాకు మార్గం సుగమమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -