2027 జనగణనను లెక్కలోకి తీసుకోరా? మహిళా బిల్లుతో పునర్విభజనను ముడిపెట్టడమేమిటి?
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ట్రాలకు శాపమైందా?
కేంద్ర బిల్లులపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలు
న్యూఢిల్లీ : లోక్‌సభ స్థానాల పెంపుదలకు ఉద్దేశించిన మూడు బిల్లుల ప్రతులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేసింది. గురువారం జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లులపై చర్చించాల్సి ఉంది. బిల్లులను లోతుగా అధ్యయనం చేసే అవకాశం సభ్యులకు ఇవ్వకుండా సమావేశాని కి కేవలం 48 గంటల ముందుగా వాటి ప్రతులను అందజేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసమే ఈ బిల్లులను తీసుకొచ్చా మని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్పటికీ వాటిని నిశితంగా పరిశీలిస్తే మహిళ లకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడాన్ని మించి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టడమే వాటి ఉద్దేశమని అర్థమవుతోంది. బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందితే పార్లమెంటరీ సమీకరణలు, జనాభా ఆధారిత ప్రాతినిధ్యం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఉత్తరాది రాష్ట్రాలకే రాజకీయ అధికారం
ఎలాంటి సంప్రదింపులకు అవకాశం ఇవ్వకుండా హడావిడిగా చేపట్టిన ఈ చర్య కారణంగా రాజకీయ అధికారం ఉత్తరాది రాష్ట్రాల చేతులలోకి వెళుతుంది. అంటే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో నిలకడగా విజయాలు సాధిస్తున్న రాజకీయ పార్టీలు…అంటే బీజేపీ, దాని మిత్రపక్షాలే అంతిమంగా లబ్ది పొందుతాయి. 2023లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే అది నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం కేంద్రం తెర పైకి తెచ్చిన మూడు బిల్లులను కలిపి చూస్తే అవి 1971 నాటి పునర్విభజన ప్రక్రియపై కొనసాగుతున్న ఫ్రీజింగ్‌ను తొలగించి 2011 నాటి జనగణన ఆధారంగా కొత్తగా పునర్విభజనకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ పునర్విభజనతో తీవ్రంగా నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపును రాష్ట్ర జనాభా ప్రభావితం చేస్తుంటుంది. కాబట్టి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం పడుతుంది. నిధుల కేటాయింపు విషయంలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
జనాభా నియంత్రణే శాపమా?
బిల్లులను అధ్యయనం చేసినప్పుడు ఒక కీలక ప్రశ్న ముందుకు వస్తోంది. 2021లో చేపట్టాల్సిన జనగణన ఐదు సంవత్సరాల ఆలస్యంగా 2026లో ప్రారంభమైంది. అలాంటప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఇప్పుడు కొనసాగుతున్న జనగణన పరిస్థితి ఏమిటి? జనగణన జరుగుతుండగా పదిహేను సంవత్సరాల నాటి లెక్కలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 129 లోక్‌సభ స్థానాలు (తమిళనాడు-39, కర్నాటక-28, ఆంధ్రప్రదేశ్-25, కేరళ-20, తెలంగాణ-17) ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఒక్కో లోక్‌సభ స్థానం ఉంది. ఉత్తర భారతంలోని మూడు అతి పెద్ద రాష్ట్రాలకు (ఉత్తరప్రదేశ్-80, బీహార్-40, రాజస్థాన్-25) కలిపి 145 స్థానాలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టి జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలే జనసంఖ్యలో అధిక వృద్ధి రేటును నమోదు చేశాయని జనగణన డేటా చెబుతోంది.
ఉత్తరాది రాష్ట్రాలలో గణనీయంగా పెరిగిన జనాభా
1971-2011 జనగణనల మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మొత్తం జనాభా 150 శాతానికి పైగా పెరిగిందని డేటా చెబుతోంది. అదే కాలంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో వృద్ధి రేటు 100 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల సంతానోత్పత్తి రేటుతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో రేటు ఎక్కువగా ఉంది. 2011 జనగణనను ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే లోక్‌సభ సీట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. పన్నులలో రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే వాటా కూడా జనాభా పరిమాణం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. తమిళనాడు, కేరళ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇప్పటికే నిధుల కేటాయింపు విషయంలో కేంద్రంతో ఘర్షణ పడుతున్నాయి. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి అందుతున్న ఆర్థిక వనరులతో పోలిస్తే వాటికి కేంద్రం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువగా ఉంటోంది. ఉదాహరణకు కేరళ నుంచి కేంద్రానికి చేరుతున్న ప్రతి రూపాయిలోనూ కేవలం 0.62 రూపాయలు మాత్రమే తిరిగి ఆ రాష్ట్రానికి అందుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల నేతలు ఏమంటున్నారు?
కేంద్రం ప్రతిపాదించిన బిల్లులపై కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నేతలు మండిపడుతున్నారు. ‘1971 జనగణనకు బదులుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది లేదా స్తంభించిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి రాజకీయ వలస ప్రాంతంగా మార్చేందుకు ఈ బిల్లుల ద్వారా కుయుక్తితో కూడిన వ్యూహాన్ని రూపొందించారు’ అని రాజ్యసభలో కేరళకు చెందిన సీపీఐ (ఎం) సభ్యుడు జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ఈ నెల 23న తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం కుట్రపూరితంగా నియోజకవర్గాల పునర్విభజనను తెర పైకి తెచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సహచర దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. సీట్ల పెంపుదలలో సగ భాగాన్ని దామాషా పద్ధతిలోనూ, మిగిలిన సగ భాగాన్ని దేశాభివృద్ధి కోసం ఆర్థికంగా అత్యుత్తమంగా రాణిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయించేలా ఓ హైబ్రిడ్ నమూనాను ఆయన ఆ లేఖలలో ప్రతిపాదించారు. పార్లమెంట్ ఆమోదం పొందితే పార్లమెంటరీ సమీకరణలు, జనాభా ఆధారిత ప్రాతినిధ్యం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
- Advertisement -
- Advertisement -



