డీలిమిటేషన్ పై సవరణను వ్యతిరేకించాలి: స్టాలిన్ పిలుపు
చెన్నై : నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపాదిత సవరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నల్ల జెండాలను ఎగరవేయాలని కోరారు. ఈ సవరణను -నల్ల చట్టం’, -కుట్ర’గా ఆయన అభివర్ణించారు. ”పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలను ఎగరవేస్తాము. భారతదేశాన్ని తిరోగమన దిశగా నడిపిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా నల్లజెండాలు ఎగరవేయండి” అని అన్నారు. పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు, ఢిల్లీల మధ్య పోరేనన్న తన వాదనను బీజేపీ రుజువుచేస్తోందని మండిపడ్డారు. తమ ప్రకటనలోని వాస్తవాన్ని బీజేపీ గ్రహించిందని, తమిళనాడు అభివృద్ధి చెందడాన్ని గాని, పార్లమెంటులో తమిళనాడు ప్రతినిధుల గొంతుకను వినిపించడాన్ని గానీ బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ కుట్రకు రూపమిచ్చేందుకే సవరణను ప్రవేశపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రను చట్టంగా తామెలా అంగీకరించగలమని కేంద్రాన్ని ప్రశ్నించారు.
నల్లజెండాలు ఎగరవేయాలి
- Advertisement -
- Advertisement -



