Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంఠారెత్తిన టోకు ధరలు

ఠారెత్తిన టోకు ధరలు

- Advertisement -

38 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
మార్చిలో 4 శాతానికి చేరువలో డబ్ల్యూపీఐ
సామాన్యుడి జేబుకు చిల్లు
న్యూఢిల్లీ :
దేశంలో ధరలు ఠారెత్తుతు సామా న్యుడి నడ్డి విరుస్తోన్నాయి. ఈ ఏడాది మార్చిలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 4 శాతం చేరువకు ఎగిసింది. ఇది గత మూడేండ్లలో అత్య ధికంగా కావడం ఆందోళకరం. బుధవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ 3.88 శాతానికి చేరింది. ఇది 38 నెలల గరిష్ట స్థాయి. ఇంతక్రితం ఫిబ్రవరిలో 2.13 శాతం గా ఉన్న ఈ ధరల సూచీ.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారీగా ఎగబాకడం తీవ్ర ఆందోళనకరం. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చి నెలలో ముడి చమురు ధరలు ఏకంగా 51.57 శాతం మేర పెరగడమే ధరల మంటకు ప్రధాన కారణం. ఇది సామాన్యుడి రవాణా బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసింది. గత ఏడాది కాలంగా ప్రతికూల దిశలో ఉన్న ఇంధనం, విద్యుత్‌ విభాగం ద్రవ్యోల్బణం ఇప్పుడు 1.05 శాతానికి చేరడం భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనడానికి హెచ్చరికగా మారింది.

తయారీ ఉత్పత్తుల భారం..
సామాన్యుడు ఎక్కువగా ఉపయోగించే నూనె గింజల ద్రవ్యోల్బణం 22.81 శాతం పెరగడం గమనార్హం. దీంతో వంట నూనెల ధరలు భారంగా మారాయి. డబ్ల్యూపీఐలో 64 శాతానికి పైగా వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చిలో 3.39 శాతానికి చేరుకుని 40 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇది 2.92 శాతంగా ఉంది. ఇదే నెలలో 3.21 శాతంగా ఉన్న రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం.. మార్చిలో ఇంధన ధరల పెరుగుదల కారణంగా 3.4 శాతానికి పెరిగింది.

కరుగుతున్న పొదుపు..
మరోవైపు వినియోగదారుల ధరల సూచీ 3.40 శాతానికి చేరింది. ఆదాయాలు హరించుకుపోతున్న తరుణంలో అధిక ధరల వల్ల సామాన్యుడి వాస్తవ ఆదాయం తగ్గుముఖం పడుతోంది. దీంతో గతంలో వంద రూపాయలకు వచ్చే సరుకులు ఇప్పుడు సగం కూడా రావడం లేదు. వర్షాభావ పరిస్థితులు గనుక తలెత్తితే ఆహార వస్తువుల ధరలు పెరిగి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5 శాతం దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధరలను ప్రభుత్వం అదుపు చేయకపోతే అనేక కుటుంబాలు తన దైనందిన అవసరాల కోసం అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఆదాయం పెరగక పోగా.. ఖర్చులు మాత్రం గరిష్ట స్థాయికి చేరడం దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆర్థిక పునాదులను దెబ్బతీయనుందని విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -