Thursday, April 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'కుల కార్పొరేషన్ల' భర్తీకి గ్రీన్‌సిగల్‌

‘కుల కార్పొరేషన్ల’ భర్తీకి గ్రీన్‌సిగల్‌

- Advertisement -

ఒకట్రెండు రోజుల్లో జీవో
మీనాక్షి నటరాజన్‌తో భేటీలో సీఎం నిర్ణయం
పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ పీసీసీ చీఫ్‌నకు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అధికార పార్టీలోని ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్‌ చైర్మెన్లు, పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి నాయిబ్రాహ్మణ, పద్మశాలి, రజక తదితర కులాలకు చెందిన కార్పొరేషన్లలోని పోస్టులనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో సీఎం బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో దాదాపు నాలుగు గంటలపాటు వారు పలు అంశాలపై చర్చించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజర్ల పోస్టుల భర్తీపై కూడా వారు సమాలోచనలు చేసినట్టు తెలిసింది. మండల, బూత్‌ లెవల్‌ కమిటీల ఏర్పాటుపై సైతం వారు చర్చించారు. కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్‌ విభజన, రాష్ట్రానికి జరగబోయే నష్టం గురించి ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. కాంగ్రెస్‌ సంస్థాగత విషయాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా త్వరలోనే పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ)ని నిర్వహించాలంటూ ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు.

కాగా కార్పొరేషన్లతోపాటు పార్టీ పదవులను భర్తీ చేసేటప్పుడు క్రియాశీలకంగా ఉన్న జిల్లాలు, అక్కడి సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన నేతలు తదితరాంశాలపై జాబితాను రూపొందించాలంటూ సీఎం సూచించారు. ఒక్కో ఆశవహుడి పేరును ప్రస్తావిస్తూ ఆయన చర్చించారు. ‘ఒక్కరికి కేవలం ఒక పదవే…’ అనే సూత్రాన్ని పక్కాగా, తూ.చా. తప్పకుండా పాటించాలంటూ కోరారు. ఇదే విధంగా భవిష్యత్‌ అవసరలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాలు, పొందికలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కార్పొరేషన్‌ చైర్మెన్లు, ప్రభుత్వ సలహాదారుల పోస్టుల కోసం వందలాది మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాను సాధ్యమైనంతగా వడబోసి, పార్టీకి విధేయులుగా ఉండి, ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకోసం పని చేసి, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించాలని సీఎం భావిస్తున్నారు. వారిలోంచి మొదటి దఫాగా 20 నుంచి 25 మందికి పదవులను కట్టబెట్టాలని ఆయన నిర్ణయించారు. ఇదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు ప్రాధాన్యతనిస్తూనే రెడ్డి సామాజిక తరగతిని కూడా ‘సంతృప్తి’ పరిచే విధంగా జాబితాలను సిద్ధం చేయాలని సీఎం… పీసీసీ చీఫ్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో కనీసం 30 శాతం మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -