Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతాంగ సమస్యల పరిష్కారంలో వైఫల్యం

రైతాంగ సమస్యల పరిష్కారంలో వైఫల్యం

- Advertisement -

పాలకులకు పారిశ్రామిక రంగంపై ఉన్న ప్రేమ వ్యవసాయంపై లేదు
తెలంగాణ రైతు సంఘం
రంగారెడ్డి జిల్లా మహాసభలో
నంద్యాల నర్సింహారెడ్డి
27 మందితో
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా
కాడిగళ్ల భాస్కర్‌, డి.రామ్‌చందర్‌


నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా 3వ మహాసభ బుధవారం ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో జరిగింది. నర్సింహారెడ్డి మహాసభ ప్రారంభోపన్యాసం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. దేశంలో 60శాతం మంది వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీలు పెంచి రైతులకు ఆధునిక వ్యవసాయంపై తగిన అవగాహన కల్పించాలని కోరారు. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టి పారిశ్రామికరంగానికి ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులకు పారిశ్రామిక రంగం మీద ఉన్న ప్రేమ వ్యవసాయ రంగంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఆదాని, అంబానీ ఆస్తులు 1558 శాతం, రిలయన్స్‌ 528 శాతం ఆస్తులు పెరిగాయని తెలిపారు. రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదన్నారు. రాష్ట్రంలో ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. మోడీ తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రైతుల పోరాటం వల్ల వెనక్కి తీసుకున్నారని, ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్‌లోనూ అలాంటి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటులో 300 మంది ఎంపీలు కోటీశ్వరులే ఉన్నారని, అందువల్ల రైతు అనుకూల చట్టాలు, పేదలకు అనుకూలమైన నిర్ణయాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్‌ తీసుకునే యుద్ధ నిర్ణయాలను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా ప్రధాని మోడీ మాత్రం మౌనం వీడటం లేదని విమర్శించారు. యుద్ధాల వల్ల దేశంలో అన్ని వస్తువుల ధరలూ పెరిగాయని, తద్వారా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ లేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్‌లోనూ ఐక్యమత్యంతో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలో 27 మందితో సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కాడగళ్ల భాస్కర్‌, డి.రామ్‌చందర్‌ ఎన్నికయ్యారు. ఈ మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సీనియర్‌ నాయకులు సి.జంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్‌, కార్యదర్శి రామచందర్‌, కోశాధికారి విక్రమ్‌, సహాయ కార్యదర్శులు ముసలయ్య, భాస్కర్‌రెడ్డి, బుగ్గరాములు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, తావునాయక్‌, రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు అశోక్‌, వెంకటేష్‌, ఐలయ్య, బాలరాజ్‌, యాదయ్య, ఆంజనేయులు, శ్రీను, శ్రీనివాస్‌ రెడ్డి, మల్లేష్‌, రమేష్‌, శేఖర్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -