ప్రజా కళాకారులపై పెరిగిన నియంత్రణ బాధ్యత : తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
ఆకట్టుకున్న ప్రజా నాట్యమండలి కళా ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ద్వేషభావం దేశాన్ని కమ్మేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా కళాకారులపై మరింత బాధ్యత పెరిగిందని తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా తెలంగాణ జానపద ఉత్సవాల ప్రారంభ సభ బుధవారం ప్రజా నాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంగారి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆనందాచారి మాట్లాడుతూ ప్రస్తుత అననుకూల పరిస్థితుల్లో కళాకారుల గొంతులు మరింత నైపుణ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరముందని సూచించారు. ద్వేషభావానికి వ్యతిరేకంగా కళాకారులు, కవులు, రచయితలు అంతా ఒక్కటై నిలవాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని కోరుతూ ప్రజానాట్య మండలి ముందు పీఠిన నిలిచిందనీ, నేడు అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంలాంటి పరిస్థితుల్లోనూ అదే శాంతిని కోరుతూ నిలబడిందని ప్రశంసించారు. సంగీతం, సాహిత్యం, కళ, సృజన ఏదైనా సరే… ప్రపంచ శాంతి కోసమేనన్నారు. వీటికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయనీ, భక్తిని ప్రచారార్భాటంగా మార్చుకుని దాని ముసుగులో దుర్మార్గాలు చేస్తూ, స్వార్థ్య రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయని తెలిపారు.
భక్తిని నటిస్తున్న వారి కుయుక్తులపై ప్రజా నాట్య మండలి పాటలు పాడాలనీ, భజనలు చేయాలని పిలుపునిచ్చారు. భక్తి పేరుతో ప్రతి పండుగను హైజాక్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఆ పండుగల సందర్భంగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. శ్రమ జీవులపై అనేక భారాలు వేస్తున్న వారు… అదే శ్రామికులు పండించిన పంటను కోసిన సందర్భంలో పండుగను చేసుకుంటున్నాయని తెలిపారు. మతం, భక్తి అనేవి సాటి మనిషిని దయతో చూడాలని చెబుతుంటాయనీ, ద్వేషాన్ని చూపే వారు నియంతలే అవుతారని విమర్శించారు. శాంతిని కోరుకునే వారే నిజమైన కళాకారులని వ్యాఖ్యానించారు.ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు ప్రజా నాట్యమండలి రాష్ట్ర మహాసభలు, తెలంగాణ జానపద ఉత్సవాల ప్రారంభ సభ సందర్భంగా వివిధ జిల్లాల కళాకారులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాడుదమా స్వేచ్ఛాగీతం పాట, నల్లగొండ జిల్లా ప్రసాద్ ఆటా పాట, సాయి భజన బృందం, సూర్యాపేట కళాకారుల డప్పుల వాయిద్య ప్రదర్శనలు అలరించాయి.
సమాజ మార్పు..ప్రజల్లో చైతన్యానికి కృషి
సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజా నాట్యమండలి కళాకారులు కృషి చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ గణాంకాల అధికారి డి.నాగమల్లేశ్వరరావు అన్నారు. ‘నా గండపెండేరాన్ని ప్రజా నాట్యమండలికి ఇవ్వాలనుకుంటున్నాను..’ అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించడమే ప్రజానాట్యమండలి చేసిన కృషికి నిదర్శనమని ఉదహరించారు. దేశమంతటా ప్రజా నాట్యమండలి పేరు వినబడేలా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. తన పదవీ విరమణ తర్వాత కూడా ప్రజా నాట్యమండలికి తన సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. అనంతరం ఆహుతుల చేతుల మీదుగా కళాకారులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి మాజీ రాష్ట్ర కార్యదర్శి తులసిగారి నర్సింహ, నాయకులు రాచకొండ రమేశ్, ఫ్రీడం ఆయిల్ ఎగ్జిక్యూటివ్ అధికారి సురేశ్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.మారన్న, ప్రజా నాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శులు వేముల సదానంద్, పి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



