ఆరోగ్య రంగాన్ని కార్పొరేట్లకు
అప్పగించే కుట్రను ఆపండి
ప్రజారోగ్య సంచాలకులు
బి.రవీంద్రనాయక్‌కు ఏఐవైఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలనీ, ఆరోగ్య రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ప్రజారోగ్య సంచాలకులు బి.రవీంద్రనాయక్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో జ్వరం, షుగర్, బీపీ వంటి సాధారణ వ్యాధులకు అవసరమైన ప్రాథమిక మందులు కూడా లేవని రవీంద్రనాయక్ దృష్టికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తీసుకెళ్లారు. అత్యవసర మందుల లేమితో రోగులు ఇబ్బంది పడుతున్న తీరును ఉదహరణలతో వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు ఇచ్చే మందుల చీటీలను తీసుకుని ప్రయివేటు మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇది పేదలపై ఆర్థిక దాడి మాత్రమే కాకుండా వారి ఆరోగ్య హక్కులను బహిరంగంగా తుంగలో తొక్కడమేనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరతపై జ్యూడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మందుల కొనుగోలు, సరఫరాలో జరిగిన అవినీతిపై బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికీ ఉచిత, నాణ్యమైన వైద్యం హక్కుగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.సత్య ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్ పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



