పుస్తకాలు పట్టాల్సిన చిట్టితల్లులు బాల్యంలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ పుత్తడిబొమ్మల మెడలో పుస్తెలతాడు ఉరితాడులా మారి ఉచ్చు బిగిస్తోంది. తెలిసీ తెలియని వయసులో పట్టుమని పదహారేండ్లు కూడా నిండని ముక్కుపచ్చలారని ఆ పసిమొగ్గలు కుటుంబ బరువు, బాధ్యతల బందీఖానాలో చిక్కి శల్యమైపోతున్నారు. పెండ్లంటే ఏమిటో తెలియకుండానే చిన్నారులు అగాథంలో కూరుకుపోతున్నారు. మోయలేని పేదరికం ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసారం అనే సాగరంలోకి నెట్టేస్తున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడి ఎన్నో జీవితాలు ఆహుతి అవుతున్నాయి.
తెలంగాణలో బాల్య వివాహాల విషయంలో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోం దని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చెబుతోంది. రాష్ట్రంలో సుమారు ఐదు శాతం అమ్మాయిలు… అంటే సుమారు 2.16 లక్షల మంది బాలికలకు 18 ఏండ్ల లోపే పెండ్లి చేస్తున్నారని సర్వేలో గుర్తించారు. చట్టపరమైన నిషేధం ఉన్నప్పటికీ.. సామాజి కంగా ఇంకా కొనసాగుతున్న సమస్యగా కనిపిస్తోంది. అబివృద్ధికి కేవలం ఆర్థిక ప్రమాణా లనే కాకుండా.. మహిళల స్థితిని కూడా సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఈ పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు, త్వరగా పెళ్లిచేసి బాధ్యతలు తీర్చుకోవాలనే భావనతో చిన్నారులను చదువుకోవాలన్న ఆకాంక్షల నుంచి దూరం చేస్తున్నారు. తెలంగాణ మహిళల్లో సుమారు 65.5శాతం మంది పదోతరగతి దాటి చదవలేకపోతున్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు కనీసవిద్యను కూడా పూర్తి చేయడం లేదు. ఇది మహిళల అభివృద్ధి, సామాజిక పురోగతికి పెద్ద అడ్డంకిగా మారుతోంది.
ప్రత్యేకంగా గిరిజన వర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బాల్యవివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తల్లిదండ్రులు ఈ సామాజిక దురాచారం నుంచి బయటపడలేక పోతున్నారు. రోజుకు మూడు చొప్పున కేసులు మన రాష్ట్రంలోనే నమోదవు తున్నాయి. బాల్య వివాహాల నిరోధక చట్టం, చైల్డ్‌లైన్‌పై అవగాహనతో ఎవరై నా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తేనే ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా జరుగు తున్న బాల్య వివాహాలకు లెక్కేలేకుండా పోతోంది. ”మేలిమి బంగరు మెలతల్లారా.. కలువల కన్నుల కన్నెల్లారా.. తల్లులగన్నా పిల్లల్లారా.. విన్నా రమ్మా ఈ కథను..” అంటూ గురజాడ అప్పారావు బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కు కుని బలైపోయిన బాలిక గురించి రాసిన దీనగాథ ”పుత్తడిబొమ్మ పూర్ణమ్మ” కథ. ఆ పూర్ణమ్మల కథళు నేటికీ కొనసాగుతుండటం అత్యంత విషాదం. రాజధాని పరిసర ప్రాంతాలు సైతం అభివృద్ధిలోనే కాదు.. సామాజిక వెనుకబాటులోనూ ముందుండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా అది నిష్టుర సత్యం. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరగడానికి కారణం అవిద్య, అవగాహనా లేమి కారణాలుగా కనిపిస్తున్నాయి. సమాజాన్ని ఆవరించిన అభద్రతా భావం కూడా ఆడపిల్లలకు శాపంగా మారింది.
పిల్లలకు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి, అభివృద్ధి చెందటానికి రక్షణ పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. బాల్య వివాహం వారి హక్కులను హరిస్తుంది. ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్న నేటికాలంలో కూడా ఇప్పటికీ దేశంలో బాల్య వివాహాలు జరగడానికి కారణాలేమిటి? కేవలం అభివృద్ధిలోనే కాకుండా ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన అమా నుష ఆచారాలు కొనసాగుతున్నంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా నిరూపయోగమే. నేడు హిందూత్వ ఎజెండాను బలంగా అమలు చేస్తున్న మనువాదుల పాలనలో ఉన్నాం. పాలకగణం చట్టాలను అమలు చేయడం కంటే ప్రజలను అశాస్త్రీయత వైపు నడిపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నది. దాని ఫలితం చట్ట విరుద్ధమని తెలిసినా ఇప్పటికీ బాల్య వివాహాలు ఆగడంలేదు. దీని కారణంగా రానున్న దశాబ్దంలో కోట్లాది మంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదంఉందని యునిసెఫ్ హెచ్చరించింది.
ఏదిఏమైనా బాల్యవివాహాల దురాచారం సమర్థనీయం కాదు. దీన్ని అరికట్టినప్పుడే యువతులకు వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపికలకు అవకాశం ఉంటుంది. తద్వారా మహిళా సాధికారతకు మేలైన బాట పడుతుంది. దేశం పురోగతి సాధిస్తున్న క్రమంలో మహిళలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తుండ టంపై చైతన్యం కల్పించడం ద్వారా బాల్యవివాహాలను నిరోధించాలి. ప్రజల్లో అవగాహన పెంచి, భయం పోగొట్టి, మహిళలకు, ఆడపిల్లల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఈ బాల్య వివాహాల్ని అడ్డుకోవడం కష్టం.



