– రిజెక్ట్ కోల్ కుప్పలు అంటుకొని ఎగిసిన మంటలు
– అలుముకున్న దట్టమైన పొగ
– అధికారుల నిర్లక్ష్యమే కారణం
– జర్నలిస్టులను లోపలికి అనుమతించని వైనం
నవతెలంగాణ-గణపురం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిజెక్ట్ కోల్ కుప్పలు ప్రమాదవశాత్తు అంటుకోవడంతో మంటలు ఎగసిపడుతూ కేటీపీపి మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. వేసవి తీవ్రత కారణంగా ఎండ వేడికి బొగ్గు నిల్వల్లో మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. కిలోమీటర్ల మేర నల్లని పొగ మేఘాలు కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒక పక్కకు ఆర్పితే మరో పక్కకు మంటలు చెలరేగడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు తీవ్రంగా కృషి చేసి మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పేశారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి విఘాతమూ కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మంటల ధాటికి ప్లాంట్ పరిసరాల్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది.
ప్రమాదమా..? నిప్పు పెట్టారా ?
కెటిపిపిలో కిలోమీటర్ల మేర రిజెక్ట్ కోల్ కుప్పలు ఉన్నాయి. దీనికి తోడు అదే ప్రాంతంలో జెన్కోలో భారీగా చెత్తాచెదారం పారబోస్తున్నారు. ఈ క్రమంలో అధికారులే నిప్పు పెట్టారా అనే అనుమానం కలుగుతోంది. చెత్తా చెదారం భారీగా ఉండటం.. వేస్ట్ బొగ్గు నిల్వలు పేరుకుపోవడంతో అక్కరకు రానివేనని కాలబెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సేఫ్టీ అధికారులు దగ్గర ఉండి చెత్త చెదారాన్ని ఆ మంటల్లో వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
జర్నలిస్టులను లోపలికి పంపించని అధికారులు
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగుతుండటంతో కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు జర్నలిస్టులకు పర్మిషన్ లేదని వెళ్లగొట్టారు.
కేటీపీపీలో భారీ అగ్ని ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



