సీనియర్స్ వేధింపులే కారణమని కుటుంబీకుల ఆరోపణ
పని ఒత్తిడి, ఇష్టం లేని
కోర్సులో చేరడం వల్లేనని పోలీసుల అనుమానాలు
నవతెలంగాణ – గోషామహల్
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. పీజీ జనరల్ సర్జరీ ప్రథమ సంవత్సరం విద్యార్థి వసతి గృహంలో నిద్ర మాత్రలు, ఇంజెక్షన్ తీసుకుని చనిపోయాడు. అయితే, సీనియర్ల ర్యాగింగ్ వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రాంచందర్- నాగమణి దంపతుల కుమారుడు కాట్రావత్ సురేశ్ (29) ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇటీవల పీజీ కోర్సు ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. తాను కోరుకున్న జనరల్ మెడిసిన్ సీటు రాకపోవడంతో, చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి నేపథ్యంలో జనరల్ సర్జరీలో చేరినట్టు సమాచారం. మూడు నెలలుగా ఉస్మానియా ఆస్పత్రిలోని పీజీ విద్యార్థుల వసతి గృహంలో ఉంటూ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తల్లితో ఫోన్లో మాట్లాడేవాడని సహచర విద్యారులు తెలిపారు. గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో గమనించిన పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అమూల్య.. అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. సహచర విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా క్యాజువాల్టీకి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సాయంత్రం వరకూ మృతదేహాన్ని క్యాజువాల్టీలోనే పెట్టారు. మృతుడి కుటుంబీకులు వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. చదువుల్లో టాపర్‌గా ఉండే సురేశ్ సున్నిత మనస్తత్వం కాదని, ఆత్మహత్యకు బలమైన కారణం ఏమైనా ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్ విద్యార్థుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. క్యాజవాల్టీ నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా కుటుంబీకులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోస్టుమార్టం చేసేది లేదంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. చివరకు సాయంత్రం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి స్నేహితులు, బంధువుల నుంచి కొన్ని వివరాలు సేకరించామని.. పని ఒత్తిడి, ఇష్టం లేని కోర్సులో చేరాననే అత్మన్యూతనకు లోనై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



