Friday, April 17, 2026
E-PAPER
Homeక్రైమ్చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి... చిన్నారికి యాసిడ్‌ తాగించిన చిన్నమ్మ

చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి… చిన్నారికి యాసిడ్‌ తాగించిన చిన్నమ్మ

- Advertisement -

మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-బోడుప్పల్‌

తన పిల్లలపై మామగారి మమకారం తగ్గిందనే అసూయతో, అభం శుభం తెలియని నాలుగేండ్ల పసివాడిపై చిన్నమ్మ పగ పెంచుకుంది. ఆ బాలుడిని అంతమొందించాలని పథకం వేసింది. చాక్లెట్‌ ఇస్తానని నమ్మించి, జ్యూస్‌ అని చెప్పి యాసిడ్‌ తాగించింది. ఈ అత్యంత అమానుష ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ శ్రీనివాసకాలనీకి చెందిన పర్వతం నాగరాజు-సంధ్య దంపతులకు ఇద్దరు సంతానం. నాలుగేండ్ల కార్తీక్‌ వాసు స్థానికంగా ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. వీరు నాగరాజు తల్లిదండ్రులైన సతీష్‌కుమార్‌-అంజమ్మతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. వారితోపాటు నాగరాజు సోదరుడు జగదీష్‌-ఆయన భార్య మంజుల ఉంటున్నారు. అయితే, తమ కుమారుడి కంటే కార్తీక్‌ వాసుపైనే మామగారు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటూ మంజుల తరచూ గొడవలకు దిగేది. ఈ క్రమంలో ఆ బాలుడిపై ద్వేషాన్ని పెంచుకుంది. ఈ నెల 9న రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్‌ వాసు హాల్‌లో ఆడుకుంటుండగా మంజుల అతడిని గదిలోకి పిలిచింది. చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి వంట గదికి తీసుకెళ్లి జ్యూస్‌ అని నమ్మించి యాసిడ్‌ తాగించింది. అది తాగిన వెంటనే బాలుడు విలవిల్లాడుతూ కేకలు వేయడంతో తల్లి సంధ్య పరుగున అక్కడికి వచ్చింది. తొలుత నిందితురాలు బుకాయించినా, బాలుడు జరిగిన విషయాన్ని చెప్పడంతో వెంటనే అంకుర ఆస్పత్రికి తరలించారు. మూడ్రోజుల చికిత్స అనంతరం బాలుడు కోలుకోవడంతో మంగళవారం రాత్రి తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పలుమార్లు హత్యాయత్నం
మంజుల గతంలోనూ బాలుడిని హతమార్చేందుకు ప్రయత్నించినట్టు నాగరాజు దంపతులు తెలిపారు. ఒకసారి బెడ్‌రూంలో బాలుడి ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయబోయిందని, ఆ సమయంలో తల్లి గమనించి అడ్డుకుందని సమాచారం. మరోసారి భవనంపైకి తీసుకెళ్లి ప్రమాదకరంగా రేలింగ్‌పై కూర్చోబెట్టగా, మామ గమనించి మందలించినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -