Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంనడిరోడ్డుపై ఎంఏ బేబీ బైటాయింపు

నడిరోడ్డుపై ఎంఏ బేబీ బైటాయింపు

- Advertisement -

యూపీ సర్కార్‌ అణచివేత చర్యలపై సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం
నిర్బంధ నేతలను విడిచిపెట్టేదాకా కదలబోమని స్పష్టీకరణ
దిగొచ్చిన అధికార యంత్రాంగం : కార్మిక నేతల విడుదల
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో

నోయిడాలో కనీస వేతనాల కోసం ఉద్యమించిన కార్మిక నేతలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు, బాధిత కార్మిక కుటుంబాలను కలిసేందుకు వెళ్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ బృందం పట్ల కూడా ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కొనసాగించింది. బాధిత కుటుంబాలను కలిసేందుకు వెళ్తున్న వీరిని శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందే బేబీ బృందం పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్న స్థానిక సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లను కూడా లాగేసుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఎ బేబీ, ఇతర నాయకులు నడి రోడ్డుపైనే బైఠాయించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ చర్యలను బేబీ తీవ్రంగా ఖండించారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన కార్మికోద్యమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొన్న బాధిత కుటుంబాలను కలిసితీరుతామని నినదించారు. దీంతో పోలీసులు నోయిడా వెళ్లేందుకు అనుమతించారు. నోయిడాలోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతించాలని కోరారు. అందుకు అధికారులు ససేమిరా అనడంతో మళ్లీ కలెక్టర్‌ నివాసం వద్ద కూడా సీపీఐ(ఎం) నేతలు ఆందోళన కొనసాగించారు. కార్మిక సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాల్సిందేనని, వారిని విడుదల చేసి ఇక్కడకే తీసుకురావాలని నినదించారు. దీంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్మిక సంఘాల నాయకులను విడుదల చేసి ఎంఎ బేబీ బృందం ఆందోళన చేస్తున్న ప్రదేశానికి తీసుకొచ్చారు. పోలీసుల నిర్బంధం నుంచి విడుదల అయినవారిలో సీఐటీయూ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి పివి అనియన్‌, అధ్యక్షులు వీరేంద్ర గౌర్‌, రామ్‌ స్వరాత్‌, మరో ముగ్గురు కార్యకర్తలు ఉన్నారు. దీంతో సీపీఐ(ఎం) బృందం ఆందోళన విరమించింది. అనంతరం స్థానిక అడిషనల్‌ డిస్ట్రిక్‌ మెజిస్ట్రేట్‌ (ఏడీఎం)తో సీపీఐ(ఎం) నేతలు సమావేశమయ్యారు. పారిశ్రామిక కార్మికులు.. సమ్మె సందర్భంగా చేసిన డిమాండ్లన్నిటినీ నెరవేర్చాలని కోరారు. అన్యాయంగా అరెస్టు చేసిన మిగిలిన ఏడుగురు నేతలనూ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్పందించిన ఏడీఎం కార్మిక నేతలను వెంటనే విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ విషయమై కలెక్టరుతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. సమ్మెకు సంబంధించిన అన్ని అంశాలపైనా సీఐటీయూ నాయకులతో మాట్లాడుతామని కలెక్టరు హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) బృందంలో ఎంఎ బేబీతో పాటు సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు, సికర్‌ ఎంపీ అమ్రారామ్‌, అరుణ్‌కుమార్‌, ఎంపీలు డాక్టర్‌ శివదాసన్‌, ఎఎ రహీం, జాన్‌బ్రిట్టాస్‌, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ పోలీసుల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడుగడుగునా అడ్డుకున్నారని, బీజేపీ ప్రభుత్వ తీవ్ర నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాల కోసం ఉద్యమించిన కార్మికులపై పోలీసులు దాడి చేయడాన్ని, అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. తక్షణమే కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇది పాక్షిక విజయం మాత్రమేనని, కార్మికుల కనీస వేతనాల పెంపు, భద్రత కోసం, అలాగే కొత్త లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా తమ పోరాటం ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -