Saturday, April 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రాణాలకు భద్రత.. నేరాలపై ఉక్కుపాదం

ప్రాణాలకు భద్రత.. నేరాలపై ఉక్కుపాదం

- Advertisement -

రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘అరైవ్‌ అలైవ్‌’
హత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ : కరీంనగర్‌లో రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి
మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యంగా ‘షీ లీడ్స్‌’.. స్కూటీల పంపిణీ
సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై నిరంతర అప్రమత్తత అవసరం
ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రివార్డుల ప్రదానం
కరీంనగర్‌తో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న శివధర్‌రెడ్డి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌ క్రైమ్‌
వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి ప్రాణం తిరిగి క్షేమంగా చేరుకోవడమే లక్ష్యంగా పోలీస్‌, రవాణా శాఖల సమన్వయంతో సాగుతున్న ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా మలచాలని రాష్ట్ర డిజిపి బి.శివధర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శుక్రవారం పర్యటించిన ఆయన.. రోడ్డు భద్రత వారోత్సవాలు, మహిళా పోలీసుల కోసం ఉద్దేశించిన ‘షీ లీడ్స్‌’ కార్యక్రమం, పోలీస్‌ అధికారుల సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యల కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాలుగా మారాయని డిజిపి ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో హత్యల వల్ల 800 మంది చనిపోతే, రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది ప్రాణం కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో 70శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ నాణ్యమైన హెల్మెట్‌ ధరించి తప్పనిసరిగా స్ట్రిప్‌ పెట్టుకోవాలని సూచించారు. అలాగే, కారులో ప్రతి ఒక్కరూ సీట్‌ బెల్ట్‌ ధరించాలని చెప్పారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ, ‘3 సెకండ్స్‌ బ్రేక్‌ రూల్‌’ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.కమిషనరేట్‌లోని అస్త్ర కన్వెన్షన్‌ హాలులో జరిగిన సదస్సులో రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు పంచుకున్న అనుభవాలు సభికులను కంటతడి పెట్టించాయి. సంగారెడ్డిలో ఇటీవల జరిగిన ఒక ప్రమాదం తర్వాత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను ఎంతో కలచివేసిందని డిజిపి చెప్పారు. అనంతరం ‘అరైవ్‌ – అలైవ్‌’ స్కైబెలూన్‌, పోస్టర్‌, పాటల సీడీని ఆవిష్కరిం చారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం, హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ఆర్థిక సాయంపై మండల స్థాయిలో అవగాహన పెంచుతా మన్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. కరీంనగర్‌లో ముందస్తు చర్యలతో ఈ మూడు నెలల్లో 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించగలిగామని వివరించారు.

మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సివిల్‌ విభాగంలో 33 శాతం, ఏఆర్‌ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు డిజిపి తెలిపారు. తెలంగాణ ‘షీ టీమ్స్‌’ మోడల్‌ను నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 ‘భరోసా’ కేంద్రాల పనితీరును సుప్రీంకోర్టు సైతం అభినందించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే 40 మంది బ్లూ కోల్ట్‌ మహిళా సిబ్బందికి 20 స్కూటీలు, పెప్పర్‌ స్ప్రేలు, హాట్‌ బాక్సులను డిజిపి పంపిణీ చేశారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో డిజిపి మాట్లాడుతూ.. కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్‌హెచ్‌ఓగా తాను పనిచేసిన రోజులను నెమరువేసుకున్నారు. దేశవ్యాప్తంగా సైబర్‌ క్రైమ్స్‌, మాదక ద్రవ్యాల ముప్పు పెరిగిందని.. ‘మెటా ఫండ్‌’, ‘క్రిప్టో కరెన్సీ’ వంటి కొత్త తరహా నేరాలను నివారించేందుకు పోలీసులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం, పలు సంచలన కేసులను ఛేదించి నేరస్థులకు శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులకు డీజీపీ నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అశ్విని, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎంవీఐ చక్రవర్తి, ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -