Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసామూహిక ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి ప్రమాదం

సామూహిక ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికి ప్రమాదం

- Advertisement -

– పౌరసత్వం.. ఓటు హక్కు వేర్వేరు
– ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా సీఈసీ
– జాతీయ భావాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి : సీపీఐ(ఎం) సదస్సులో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– నిర్బంధం ఉన్నప్పుడే కమ్యూనిస్టులు గట్టిగా పోరాడాలి
– సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : జాన్‌వెస్లీ
– సెప్టెంబర్‌ 12 వరకు నియోఫాసిస్టు విధానాలపై దేశవ్యాప్త క్యాంపెయిన్‌ : ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీజేపీ నాయకులు ఆధునిక కాలానికి అనుగుణంగా సూటు బూటు వేసుకున్నా వారి మనసులో ఫ్యూడల్‌ భావాలే ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. రాచరిక వ్యవస్థను తేవాలని భావిస్తున్నదని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ‘రాజ్యాంగం- ఎన్నికల కమిషన్‌-దొంగ ఓట్లు’అనే అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్‌ను నిర్వహించారు. ప్రధాన వక్త రాఘవులు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 12 వరకు నెలరోజులపాటు బీజేపీ అనుసరిస్తున్న నియో ఫాసిస్టు విధానాలపై దేశవ్యాప్త క్యాంపెయిన్‌ చేపట్టాలని చెప్పారు. భారతీయ భావాన్ని ఏచూరి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని అన్నారు. దేశంలో అనేక మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదా యాలు, తాత్విక చింతన కలిస్తేనే భారతీయ భావన అవుతుందన్నారు. కానీ బీజేపీ సంకుచిత ధోరణితో ఒక భావాన్ని, ఒక భాషను, ఒక ఆహారాన్ని, ఒక జాతికి పరిమితమై ఆలోచిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని విడదీసి ప్రజల్లో ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. నూతన ఆలోచన, ప్రశ్న, నిజం పట్ల బీజేపీకి నమ్మకం లేవనీ, సమానత్వాన్ని అంగీకరించట్లేదనీ చెప్పారు. ఇండియా అయినా, భారత్‌ అయినా కులం, మతం, లింగబేధం లేకుండా పౌరులందరూ సమానమేనని రాజ్యాంగం చెప్తుందన్నారు. మతాలు ఉన్నా, ప్రజలంతా లౌకికంగా ఉండాలనే రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తున్నదని వివరించారు.

కానీ బీజేపీ ఫ్యూడల్‌ వ్యవస్థను తేవాలనుకుంటున్నదనీ, కులాలు ఉండాలంటున్నదని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు అందరికీ ఓటు హక్కు లేదనీ, దేశంలో అందరికీ ఓటును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. దానివల్లే భారత్‌లో అధ్యక్ష తరహా పాలన కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉందన్నారు. కానీ మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమిలో ఒక పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మారిందని చెప్పారు. అందుకే బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను చేపట్టిందన్నారు. డబ్బు, కులం, మతం, అధికార యంత్రాంగం ద్వారా కాకుండా ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు తెచ్చి గెలవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఓటు హక్కు కోసం ఆధార్‌, రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, బర్త్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు కావాలంటున్నారని చెప్పారు. దొంగ బర్త్‌ సర్టిఫికెట్‌, దొంగ పాస్‌పోర్టులు ఉండడం లేదా?అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడం ఎప్పటినుంచో జరుగుతున్నదనీ, తాజాగా సామూహికంగా ఓట్ల తొలగింపును చేరుస్తున్నారని తెలిపారు. ఈసీ అర్హులను అనర్హులుగా ప్రకటిస్తున్నదనీ, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యకం చేశారు.

పౌరసత్వం, ఓటు హక్కు వేర్వేరని స్పష్టం చేశారు. భారత్‌లో నివాసం ఉంటే ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. హిట్లర్‌ కూడా ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని తొలగించారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం కూడా అదే తరహాలో పాలన సాగిస్తుదని తెలిపారు. అప్రమత్తంగా లేకుంటే రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాని అమలు చేస్తారని హెచ్చరించారు. రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సోషలిస్టు పదాలను తొలగించాలనుకుంటున్నారని చెప్పారు. కమ్యూనిస్టులంటే అమెరికా అధ్యక్షులు ట్రంప్‌, ఇక్కడ ప్రధాని మోడీకి భయమని అన్నారు. భారతీయ భావం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు.

పార్లమెంటుకే ప్రాధాన్యత లేదు : జాన్‌వెస్లీ
మోడీ ప్రభుత్వంలో పార్లమెంటుకే ప్రాధాన్యత ఉండడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఎంపీలు ప్రశ్నిస్తే అణచివేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం ఉండకుండా చేస్తున్నారని చెప్పారు. మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ స్వతంత్రంగా వ్యవహరిస్తే బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు 70 నుంచి 80 శాతం మంది జైళ్లలో ఉండాలన్నారు. ఒకే ఇంటికి వేల ఓట్లు ఎలా నమోదవుతున్నాయని ప్రశ్నించారు. అడ్రస్‌ లేకున్నా ఓటు హక్కు ఎలా వస్తున్నదని అడిగారు. ప్రజాప్రతినిధులను మార్చడానికి కాకుండా ప్రభుత్వాలనే మార్చేందుకు ఎన్నికల వ్యవస్థను బీజేపీ ఉపయోగించుకుంటున్నదని విమర్శించారు. రిజర్వేషన్లున్నా ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటుపరం అవుతున్నాయనీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన ఆర్డినెన్స్‌ను ఆమోదించడం లేదన్నారు. నిర్బంధాలున్న సమయంలోనే ఎర్రజెండా ప్రజలకు అండగా నిలబడాలనీ, కమ్యూనిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.

రాజ్యాంగ మూలాలపై దాడి : ఎస్‌ వీరయ్య
సదస్సుకు అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక విలువలకు ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. రాజ్యాంగ మూలాలపై దాడి జరుగుతున్నదని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న నియోఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 12 వరకు క్యాంపెయిన్‌ నిర్వహించాలని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఏచూరి ఉంటే బీజేపీ వ్యతిరేక శక్తులు, పార్టీలను ఏకం చేసే వారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లులక్ష్మి, బండారు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img