విడతల వారీగా దోపిడీ చేసేందుకు కుట్ర
మల్లన్నసాగర్-మూసీ అనుసంధాన ప్రాజెక్టు ఓ క్రిమినల్ చర్య
కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఎందుకు తేవడం లేదు
రూ.1,100 కోట్లతో ఉన్న అంచనాలు ఏడు రెట్లు ఎందుకు పెరిగాయి
గోదావరి జలాలు వాడుతూ కాళేశ్వరంపై చిల్లర ప్రచారం
సీఎం రేవంత్‌రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిధులను లూటీ చేయడం కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. గోదావరి జలాలను వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కల్పతరువు, కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్టే అన్న నిజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మల్లన్నసాగర్-మూసీ అనుసంధాన ప్రాజెక్టు ఓ క్రిమినల్ చర్య అని అన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్నసాగర్ నుంచి నీళ్లను ఎందుకు తెస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి జలాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తెచ్చేందుకు రూ.1,100 కోట్లతో బీఆర్‌ఎస్ హయాంలో రూపొందించిన అంచనాలు రూ.7,390 కోట్లకు ఏడు రెట్లు ఎందుకు పెరిగాయో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రూ.1.50 లక్షల కోట్లకు పెంచిందన్నారు. విడతల వారీగా దోపిడీ చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీకే రూ.వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని అన్నారు. బనకచర్ల కోసమే మేడిగడ్డను రిపేర్ చేయించడం లేదన్నారు. సొంత డబ్బులతో మూడు పిల్లర్లు రిపేర్ చేయిస్తామంటూ ఎల్ అండ్ టీ సంస్థ ముందుకొచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలం అయినందునే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదని వివరించారు. నోటా ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లమని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడే నేరాన్ని అంగీకరించారనీ, ఓ టీవీ చర్చలో కాంగ్రెస్‌లో చేరారంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. స్పీకర్ వారిపై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాహుల్ విమర్శించే సీబీఐతో కాళేశ్వరంపై విచారణ
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ జేబు సంస్థలంటూ విమర్శిస్తారని కేటీఆర్ అన్నారు. ఆ సీబీఐతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్న సాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని వివరించారు. కాళేశ్వరం కూలేశ్వరం అన్న వారే ఆ నీళ్లను హైదరాబాద్‌కు తీసుకొస్తామంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటూనే దాన్ని బదనాం చేస్తున్న ముఖ్యమంత్రి వైఖరి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఉందన్నారు. గండిపేటకు తీసుకొస్తున్నది కాళేశ్వరం నీళ్లా? కాదా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. ఇప్పటిదాకా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందనీ, 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పారు.
రూ.94 వేల కోట్ల ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రూ.94 వేల కోట్లలో మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగిందనీ, దానికి రూ.250 కోట్ల వరకు ఖర్చయ్యిందనీ, అదే నష్టం జరిగిందని వివరించారు. ఇదంతా రాజకీయ ఆరోపణ అని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కోసమే మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయించకుండా నీళ్లను కిందికి వృధాగా వదులుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటలు హైదరాబాద్‌లో నల్లా నీళ్లు వచ్చేలా చూస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత తాగునీటి పథకాన్ని కూడా కాంగ్రెస్ రద్దు చేస్తుందని చెప్పారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి రూ.12 వేల కోట్ల డ్రగ్స్‌ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగల్ ఫోర్స్, హైడ్రాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముడుపులు ముట్టాయా? అందుకే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.
మూసీ లూటీ కోసమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES