మతోన్మాద బీజేపీనీ.. పదేండ్లు అభివృద్ధిని పట్టించుకోని బీఆర్‌ఎస్‌ను ఓడించండి.. : జూబ్లీహిల్స్ ఓటర్లకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్డులోని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకేటష్ మాట్లాడుతూ.. మతోన్మాద ప్రజావ్యతిరేక బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి, హైదరాబాద్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. అందువల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ప్రజలను కోరారు. 
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అన్యాయం చేసిందన్నారు. మురికివాడలు, బస్తీల్లో తాగునీటి సమస్య, రోడ్లు, డ్రెయినేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, దీన్ని పట్టించుకున్న వారే కరువయ్యా రన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీపీఐ(ఎం) స్వతంత్రంగా సభలు, సమావేశాలు పెడుతుందని, ఇంటింటికీ ప్రచారం చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్, కెఎన్.రాజన్న, జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ ఆర్.ఆశోక్ ఉన్నారు.

 
                                    