Magazines

అన్నదాతల ఆత్మఘోష వినపడటం లేదా?

1 గంట క్రితం

of the farmers not be heard?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 4 నిమిషాల చదవడం

పెరుగుతున్న సాగు ఖర్చులు.. గిట్టుబాటు ధరల లేమి.. అప్పుల భారం.. ఉపాధికి ముప్పు.. భూమిపై హక్కులకు విఘాతం.. ఇవన్నీ కలిసి రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలను సంక్షోభంలోకి నెడుతు న్నాయి. దేశానికి ఆహారాన్ని అందిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే శ్రమజీవుల సంక్షేమాన్ని విస్మరించి సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడం సాధ్యం కాదు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సాగుతున్న ఆర్థిక విధానాలు, మతతత్వ రాజకీయాల వల్ల ప్రజల ఐక్యతకు కలుగుతున్న విఘాతం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వంఈ పన్నెండున్న రేండ్ల పాలనలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని నెరవేర్చలేకపోయింది. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడంలోనూ విఫలమైంది. ఫలితంగా రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 4,690 మంది రైతులు కాగా, 6,096 మంది వ్యవసాయ కార్మికులు. అంటే రోజుకు సగటున దాదాపు 30 మంది వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4,151 కేసులు, కర్ణాటకలో 2,423 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక సంక్షోభ తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్యల వెనుక భూమిలేని వ్యవసాయ కూలీలు, కౌలురైతులు, గిరిజన ప్రాంతాల ప్రజలు, మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలను వ్యక్తిగత సమస్యలుగా మాత్రమే చూడకుండా, వ్యవసాయ విధానాల వైఫల్యంతో ముడిపడిన సామాజిక విషాదంగా గుర్తించాలి.

పెరుగుతున్న పెట్టుబడులు.. తగ్గుతున్న ఆదాయాలు

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, యంత్రాల అద్దెలు, కూలీల వేతనాలు ఏటేటా పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందనే భరోసా రైతులకు లేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తున్నప్పటికీ, అన్ని పంటలకు, అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఆ ప్రయోజనం అందడం లేదు.2024-25లో దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన గోధుమల్లో సుమారు 23 శాతం, వరి ఉత్పత్తిలో 49 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరించింది. మిగిలిన పంటలను రైతులు మార్కెట్ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చులకు తగిన ఆదాయం లభించక అప్పుల భారం పెరుగుతోంది.మరోవైపు కరువులు, అకాల వర్షాలు, వరదలు, వడగాలులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయం మరింత అనిశ్చితంగా మారుతోంది. పంట నష్టానికి తగిన పరిహారం అందకపోవడం రైతులను మరింత కష్టాల్లోకి నెడుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే రైతులకు చట్టబద్ధ మైన కనీస మద్దతు ధర, సమర్థవంతమైన పంటల బీమా, చౌక రుణాలు, పంట నష్టానికి సకాలంలో పరిహారం అందించాలి.

భూసేకరణ పేరుతో రైతుల హక్కులకు విఘాతం

పరిశ్రమలు, రహదారులు, గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భూసేకరణ జరుగు తోంది. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, దాని భారాన్ని రైతులు, గిరిజనులు, గ్రామీణ పేదలపై మోపడం సమంజసం కాదు. న్యాయమైన పరిహారం, పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాధికి భరోసా కల్పించకుండా భూములు సేకరిస్తే అనేక కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవు తుంది.దీనికితోడు స్థానిక పెత్తందారుల భూకబ్జాలు, భూ వివాదాలు పేదల సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. భూమిపై హక్కులు, అటవీ హక్కుల పరిరక్షణ, కౌలురైతుల గుర్తింపు, మహిళా రైతులకు భూమి పట్టాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

ఉపాధి హామీకి కొత్త సవాళ్లు

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలక పాత్ర పోషించింది. అయితే 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన వీబీ-జీ రామ్ జీ చట్టం పాత ఉపాధి హామీ చట్టం స్థానంలోకి వచ్చింది. కొత్త చట్టం గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధి హామీని ప్రకటించింది. అయితే ఉపాధి హామీ రోజుల సంఖ్య పెరగడం ఒక్కటే గ్రామీణ పేదల సమస్యలకు పరిష్కారం కాదు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల వరకు పనులను నిలిపివేసే నిబంధన, రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం, నిధుల కేటాయింపులు, పని కోరినవారికి వాస్తవంగా ఎంత ఉపాధి లభిస్తుందనే అంశాలు కీలకం. ప్రతి గ్రామీణ కుటుంబానికి అవసరమైన సమయంలో పని కల్పించడం, వేతనాలను సకాలంలో చెల్లించడం, పని నిరాకరించినప్పుడు చట్టప్రకారం నిరుద్యోగ భృతి అందించడం తప్పనిసరి. లేకపోతే కొత్త చట్టం ప్రకటించిన ప్రయోజనాలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు..

రైతులకు ముప్పా?

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లు మరింతగా తెరుచుకుంటే దేశీయ రైతులపై పోటీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు పొందే విదేశీ రైతులతో మన రైతులు పోటీపడాల్సి వస్తుంది. ముఖ్యంగా నూనెగింజలు, పండ్లు, పశుదాణా ముడిసరుకుల దిగుమతులు దేశీయ మార్కెట్ ధరలపై ప్రభావం చూపవచ్చు.2026లో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చట్రంలో పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో దేశీయ రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా వాణిజ్య ఒప్పందాల్లోని నిబంధనలను బహిరంగంగా వెల్లడించాలి. సున్నితమైన వ్యవసాయ రంగాలకు తగిన రక్షణ కల్పించాలి. రైతుల ఆదాయాలు, దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఆహార భద్రతపై పడే ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవాలి.

ఐక్య పోరాటమే పరిష్కారం

వ్యవసాయ సంక్షోభం ఒక్క కారణంతో ఏర్పడినది కాదు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, పెరుగుతున్న సాగు ఖర్చులు, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు పరస్పరం ముడిపడి ఈ సంక్షోభాన్ని తీవ్రం చేస్తున్నాయి. వీటికి పరిష్కారం చూపాలంటే ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు అవసరం.

రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, గిరిజనులు, మహిళా రైతులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులకు బదులుగా జీవనోపాధి, భూమి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్రజలు సంఘటితం కావాలి. రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం, గ్రామీణ పేదలకు ఉపాధి, భూమిలేనివారికి జీవన భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు, పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునే వ్యవస్థను బలోపేతం చేయాలి. భూమి, ఉపాధి, సామాజిక భద్రతపై హక్కులను కాపాడాలి.అన్నదాతను కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమే. శ్రమజీవుల హక్కులను పరిరక్షించి, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాలు చూపినప్పుడే సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యమవుతుంది. రైతుల బతుకులు బాగుపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే అన్నదాతల సంక్షేమం ప్రభుత్వాల తక్షణ ప్రాధాన్యంగా మారాలి.


మూడ్ శోభన్, 9949725951

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్