Magazines

ఉక్రెయిన్‌పై మరోసారి చర్చలు!

2 గంటల క్రితం

Talks on Ukraine once again!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 3 నిమిషాల చదవడం

ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య అబుదాబీలో వచ్చే ఏడాది ప్రారంభంలో చర్చలు జరుగుతాయన్న వార్తలు ప్రపంచంలో ఒక పెద్ద చర్చనీయాం శంగా మారాయి. అమెరికా రాయబారి విట్‌కాఫ్ అటు కీవ్, ఇటు మాస్కోతో చర్చల తరువాత సూత్రప్రాయంగా చర్చలకు అంగీకరిస్తున్నట్లు పుతిన్ ప్రకటిం చటంతో అనేక మందిలో ఆశలు మొలకెత్తాయంటే అతిశయోక్తి కాదు. అయితే 2022 ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రారంభమైన రష్యా సైనిక చర్య తరువాత డోనాల్డ్ ట్రంప్ అనేకసార్లు సంక్షోభం ముగిసినట్లే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరు మూడవ తేదీన జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఉభయ సభల్లోనూ మెజారిటీ కోల్పోయే పరిస్థితి ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఎలాగైనా పరువు దక్కించుకోవాలని ట్రంప్ నానా పాట్లు పడుతున్నాడు.

ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత, అంతకు ముందు విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఇరవై శాతం ఉక్రెయిన్ ప్రాంతాలు ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించింది.వాటన్నింటినీ తిరిగి తమకు ఇవ్వకపోతే మాస్కోతో చర్చలు జరిపేది లేదని గతంలో పలుమార్లు జెలెన్‌స్కీ ప్రకటించాడు. ఇప్పుడు ‘మీ ఎన్నికల అవసరాల కోసం మాప్రయోజనాలను ఫణంగా పెడతారా’ అంటూ అతగాడు ట్రంప్‌ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. కీవ్‌కు భవిష్యత్‌లో నాటోలో సభ్యత్వం ఇవ్వ కూడదని, అంతర్జాతీయ దళాల పేరుతో ఉక్రెయిన్‌లో ఇతర దేశాల మిలిటరీని నియమించకూడదని కూడా రష్యా డిమాండ్ చేస్తోంది.వాటిలో ఏ ఒక్కదాని మీద వెనక్కు తగ్గినా రష్యాలో పుతిన్, అదే విధంగా అంగీకరిస్తే ఉక్రెయిన్‌లో జెలె‌న్‌స్కీ పతనం ఖాయం. ఇప్పటివరకు రష్యాకు వ్యతిరేకంగా ఆయుధాలు ఇచ్చి పోరు చేయిస్తున్న ఐరోపా దేశాల నాయకత్వాలను కూడా ఆయా దేశాల జనాలు నిలదీయటం ఖాయం. రష్యా షరతులను అంగీకరించటానికి ఇన్నేండ్లు పోరు ఎందుకు సాగించినట్లు, దానికి బిలియన్లకొద్దీ డాలర్లు ఎందుకు తగలేసినట్లని ఆయా సమాజాలు నిలదీస్తే వారి దగ్గర సమాధానం ఉండదు. ఇదే పరిస్థితి అమెరికా నాయ కత్వానికి కూడా ఎదురవుతుంది. అంతర్జా తీయంగా తీవ్ర విమర్శల పాలు కావాల్సి వస్తుంది.ఇన్ని సంవత్సరాలుగా రష్యా మీద అనేక ఆంక్షలు విధించి దాని ఆటకట్టిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు దానితోనే రాజీచేసుకోవటం ఏమిటని అధికార రిపబ్లికన్లతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలకు కంటిచూపు తప్ప ట్రంప్‌నకు నోటమాటలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా రష్యాతో ఆర్థిక సహకారం గురించి కూడా ట్రంప్ దూత విట్‌కాఫ్ బుధవారం నాడు మాస్కోలో చర్చలు జరిపారని వార్తలు. నాలుగేండ్లుగా రష్యాలో బందీగా ఉన్న తమ పౌరుడిని విడుదల చేయటం పుతిన్ మానవతావైఖరికి నిదర్శనమని ట్రంప్ కితాబు ఇవ్వటం ఏమిటనీ పశ్చిమదేశాలన్నీ ఉడికి పోతున్నాయి. ఇంతకాలం అవన్నీ రష్యా, పుతిన్ అమానవీయత గురించి ప్రపంచానికి చూపిన చిత్రాలు, చెప్పిన మాటల సంగతేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

రష్యా సైనిక చర్యకు ముందు 2021లో దాదాపు 30వేల మంది మాత్రమే ఉక్రెయిన్ పౌరులు మిగతా ఐరోపాలో ఆశ్రయం కోరినవారు ఉన్నారు. అలాంటిది 2022 ఫిబ్రవరిలో రష్యా దాడులు ప్రారంభమైన తరువాత ఆ సంఖ్య 56 లక్షలకు ఇప్పుడు 59లక్షలుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క ఐరోపాలోనే అత్యధికులు ఉన్నారు. అసలే తమ దేశాల్లో వివిధ తరగతుల వారు వీధుల్లోకి ఎక్కుతుంటే వారినేమి చేయాలో తోచని పాలకులకు లక్షలాది మంది ఉక్రెయిన్ శరణార్ధులను ఎంతకాలం పోషించాలనే ప్రశ్నలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫ్రాన్సులో జరుగుతున్న పరిణామాలకు వలస వచ్చిన వారు ఒక కారణమని స్వయంగా డోనాల్డ్ ట్రంప్ అని చెప్పిన తరువాత ఉక్రెయిన్లను ఎలా చూస్తారో చెప్పనవసరం లేదు. అబుదాబీలో జరిగే మూడు దేశాల చర్చలలో తమ పాత్ర, ప్రయోజనాల గురించి మిగిలిన ఐరోపా దేశాలు కచ్చితంగా ప్రశ్నిస్తాయి, ఎందుకంటే నాలుగేండ్లుగా ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నవాటిలో అవికూడా ఉన్నాయి. రష్యా షరతులతో కొంత మేరకు రాజీపడి ఒప్పందం చేసుకొనేందుకు తొలి రోజుల్లోనే జెలెన్‌స్కీ సి‌ద్ధపడినప్పటికీ బ్రిటన్ వంటి దేశాలు కాళ్లు అడ్డంపెట్టి పడకుండా చూశాయి. రష్యా తొలిరోజుల నాటి దూకుడును ఇప్పుడు ప్రదర్శించటం లేదు. దానికి తగిలిన ఎదురు దెబ్బలు కావచ్చు లేదా తొందరేముంది తాపీగా చూద్దాం అన్న ఎత్తుగడా కావచ్చు. తాబేలు మాదిరి మెల్లమెల్లగా ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నది. రానున్న చలికాలంలో విద్యుత్, గ్యాస్ లేకుండా ఎలా గడపాలన్న ఆలోచన కీవ్‌ను వణికిస్తున్నది. అందుకే ఏదో విధంగా ఒప్పందం చేసుకొని బయటపడాలని జెలెన్‌స్కీ చూస్తున్నాడు. మొత్తం మీద చూసినపుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.ఎవరి గేమ్‌ను వారు అడుతున్నారు.ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు పిల్లిమెడలో గంటకట్టేదెవరన్నదే అసలైన ప్రశ్న!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్