“మీరు వారితో ఫారం 6 నింపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫారం 8 ద్వారా ఆ పని చేయడానికి వ్యవస్థ అనుమతించలేదు.”
సెప్టెంబర్ 30న బాంబే హైకోర్టు గోవా బెంచ్ న్యాయమూర్తులు వాల్మీకి మెనెజెస్, అమిత్ జంసందేకర్ చేసిన ఈ వ్యాఖ్య ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లోని అసలు సమస్యను బయట పెట్టింది. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించబడిన వారు తిరిగి తమ పేర్లను చేర్చుకోవాలంటే, మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకుంటు న్నామని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టం అనుమతించిన మార్గాన్ని సాఫ్ట్వేర్ మూసివేస్తే, చివరకు చట్టం కంటే కోడ్దే పైచేయి అవుతోందన్నది ఈ వివాదం సారాంశం.
గోవాలోని సాల్గావ్కర్ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఒకే నియోజకవర్గంలో చిరునామా మార్చుకున్నారు. చిరునామా మార్పు కోసం చట్టబద్ధమైన ఫారం 8ను సమర్పించారు. అయితే, సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ఆ ఫారాన్ని అంగీకరించకపోవడంతో వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. తిరిగి పేర్లు చేర్చుకోవాలంటే మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకునేవారి కోసం ఉద్దేశించిన ఫారం 6 సమర్పించాలని అధికారులు సూచించారు. గతంలో ఓటర్లుగా నమోదై ఉన్నవారు అబద్ధపు ప్రకటన చేయడానికి నిరాకరించి కోర్టును ఆశ్రయించారు.
ఇది ఒక్క కుటుంబానికి ఎదురైన సమస్య మాత్రమే కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత పరిశీలించిన 97 మంది ఓటర్లు అర్హులేనని గోవాలోని ఎన్నికల నమోదు అధికారులు గుర్తించినప్పటికీ, వారి పేర్లను తిరిగి చేర్చేందుకు సాఫ్ట్‌వేర్‌లో అవకాశం లేదని వెల్లడైంది. ఈ సదుపాయం కల్పించాలని గోవా ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఎనిమిదిసార్లు ఎన్నికల సంఘానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. 2026 ఫిబ్రవరిలో ప్రకటించిన తుది జాబితాలో వారి పేర్లు లేకుండానే పోయాయి. చివరకు ఫారం 6 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించగా, వారిలో 81 మంది ఆ ఫారాన్ని నింపారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం ఓటర్ల నమోదుపై చట్టబద్ధమైన అధికారం ఎన్నికల నమోదు అధికారులదే. అయినప్పటికీ, వారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే, చట్టం ప్రకారం పనిచేయాల్సిన అధికారులు సాఫ్ట్వేర్ పరిమితులకు లోబడి పనిచేయాల్సి వచ్చింది.
అసలు సమస్య ఈవీఎంలో కాదు
ఎన్నికల వ్యవస్థలోని లోపాన్ని కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు పరిమితం చేయలేం. ఈవీఎం పనిచేసే విధానం ఒక సమస్య అయితే, ఎవరు ఓటు వేయడానికి అర్హులో నిర్ణయించే ఓటర్ల జాబితా వ్యవస్థ మరో, మరింత ప్రాథమికమైన సమస్య. పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది, ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది, న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి. కానీ చివరకు ఓటు వేయగల వ్యక్తులను నిర్ణయించే ఓటర్ల జాబితాను ECINet వంటి సాఫ్ట్వేర్ వ్యవస్థ నిర్వ హిస్తోంది. ఆ వ్యవస్థలోని కోడ్ చట్టం అనుమతించే చర్యలను అమలు చేయలేకపోతే, ఆచరణలో చట్టం కంటే సాఫ్ట్వేర్ నియమాలే బలంగా మారతాయి.
సుమారు పాతికేళ్ల క్రితం లారెన్స్ లెసిగ్ తన Code and Other Laws of Cyberspace పుస్తకంలో ఇదే ప్రమాదాన్ని వివరించారు. చట్టసభలు రూపొందించే చట్టాలతోపాటు ప్రోగ్రామర్లు రాసే కంప్యూటర్ కోడ్లు కూడా ప్రజల జీవితాలను నియంత్రిస్తాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ వ్యవస్థలు విస్తరిస్తున్న కొద్దీ కంప్యూటర్ కోడ్లు చట్టాల అమలును ప్రభావితం చేయడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో చట్టాలనే అధిగమించే పరిస్థితి ఏర్పడుతోంది.
నేడు బ్యాంకింగ్, సంక్షేమ పథకాలు, పన్నుల చెల్లింపులు, ఓటర్ల నమోదు వంటి కీలక వ్యవహారాలు డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. అందువల్ల ఈ కోడ్‌ను ఎవరు రూపొందిస్తున్నారు? చట్టం అనుమతించే ప్రతి పరిస్థితిలో అది సరిగ్గా పనిచేస్తుందని ఎవరు నిర్ధారిస్తున్నారు? వ్యవస్థ తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకంగా మారాయి.
13.3 కోట్ల పేర్ల తొలగింపు
ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న వెల్లడించిన గణాంకాల ప్రకారం, SIR కింద ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13.3 కోట్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిలో 2.8 కోట్ల పేర్లు మరణించినవారివిగా, 1.01 కోట్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైనవిగా పేర్కొన్నారు. మిగిలిన సుమారు 9.5 కోట్ల పేర్లను “అందుబాటులో లేరు, శాశ్వతంగా వలస వెళ్లారు లేదా ఇతర కారణాలు” అనే విస్తృత వర్గంలో చేర్చారు. ఈ తొలగింపుల వెనుక అనుసరించిన విధానంపైనే ప్రధాన అభ్యంతరం ఉంది. ఓటరు వివరాల్లో తార్కిక అసంగతత కనిపిస్తే, ముందుగా అతడిని అనర్హుడిగా భావించి, తన అర్హతను నిరూపించుకునే బాధ్యతను అతడిపైనే మోపుతున్నారు. దేశంలో అక్షరాస్యత లోపాలు, ఉపాధి లేదా వివాహం కోసం వలసలు, అద్దె ఇళ్లు, మురికివాడలు, స్థిరమైన చిరునామా లేకపోవడం వంటి పరిస్థితులు విస్తృతంగా ఉన్నాయి. ఇలాంటి సమాజంలో వివరాల్లో తేడా కనిపించినంత మాత్రాన ఒక వ్యక్తిని అనుమానితుడిగా పరిగణించడం వల్ల మోసాలను గుర్తించడంకంటే అర్హులైన పేద ప్రజలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫారం 6 ఒక్కటే మార్గమా?
సర్ తరువాత తొలగించబడిన పేర్లను తిరిగి చేర్చుకునే ప్రక్రియలో ఫారం 6 ఒక్కటే మార్గంగా మిగిలిందన్నది మరో తీవ్రమైన సమస్య. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం, ఫారం 6 మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారి కోసం ఉద్దేశించబడింది. చిరునామా మార్పు వంటి సందర్భాలకు ఫారం 8 నిర్దేశించబడింది. ముప్పై ఏళ్లుగా ఓటు వేస్తున్న వ్యక్తి పేరు, ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేరనే కారణంతో తొలగించబడితే, తిరిగి తన పేరు చేర్చు కోవడానికి కొత్త ఓటరుగా దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం సాంకేతిక అసౌకర్యం కాదు, పౌరుడు తన గత నమోదును నిరూపించుకోవాల్సిన, తప్పుడు ప్రకటన చేసే ఒత్తిడికి గురయ్యే సమస్య.
ఎన్నికల సంఘం లోపలే అభ్యంతరాలు
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సందర్భాల్లో లిఖితపూర్వకంగా అభ్యంత రాలు వ్యక్తం చేశారు. ఫారం 6, ఫారం 8 చట్టబద్ధంగా నిర్దేశిం చిన ఫారాలని, 1960 నాటి నిబంధనలను సవరించ కుండా వాటిని మార్చడం సరికాదని వారు పేర్కొన్నారు. మార్చిన ఫారం 6ను సంధు అనధికారికమైనదిగా, చట్టవిరుద్ధ మైనదిగా అభివర్ణించి తొలగించాలని కోరారు. అలాగే, ఓటర్ల జాబితా డేటాబేస్ కేంద్రీకృతమవుతున్న తీరు, దానిలో మార్పులు చేసే అధికారాలు, రాష్ట్ర స్థాయి అధికారులకు కల్పిస్తున్న ప్రాప్యతపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఐటీ విభాగం పర్యవేక్షణలో జరిగిన మార్పుల గురించి తమకు తెలియజేయ లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖరాశారు. ఈ అభ్యంత రాలను ఎందుకు పట్టించుకోలేదు? వ్యవస్థను ఎవరు రూపొందించారు? దాని పనితీరును పరీక్షించేందుకు ఎలాంటి ప్రమాణాలు అనుసరిం చారు? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం.
గత అనుభవాల హెచ్చరిక
2000లో అమెరికాలోని ఫ్లోరిడాలో DBT Online అనే ప్రైవేటు సంస్థ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న సుమారు 58వేలమంది జాబితాను రూపొందించింది. పేర్లను సరిపోల్చే విధానంలోని లోపాల వల్ల నల్లజాతి ప్రజలు అసమానంగా ఎక్కువగా ఆ జాబితాలో చేరారు. ఓటు వేయ డానికి అర్హులైన వేలాది మంది ఓటు హక్కు కోల్పోయారు. జార్జ్ డబ్ల్యూ.బుష్ అధ్యక్ష ఎన్నికల్లో కేవలం 537 ఓట్ల తేడాతో గెలిచిన నేపథ్యంలో, ఓటర్ల జాబితాలోని లోపాలు ప్రజాస్వామ్యంపై ఎంతటి ప్రభావం చూపగలవో ఈ ఘటన స్పష్టం చేసింది.
భారతదేశంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణలో వైఫల్యాల కారణంగా అర్హులైన ప్రజలకు రేషన్ అందని ఘటనలూ గతంలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు అనుభవాల్లోనూ ఒకే సమస్య కనిపిస్తుంది: యంత్రం లేదా డేటాబేస్ తప్పు చేసినా, దాని ప్రభావాన్ని ఎదుర్కొనేది సాధారణ పౌరుడే. సాంకేతిక వ్యవస్థలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాధ్యతను ఎవరు వహించాలనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోతే, ప్రజలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రజాస్వామ్యానికి అవసరమైన మార్పులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన అధికారి నిర్ణయమే సాఫ్ట్‌వేర్‌ను నియంత్రించాలి; సాఫ్ట్వేర్ పరిమితులు అధికారిని నియంత్రించకూడదు. తప్పుగా తొలగించబడిన ఓటరును తిరిగి చేర్చుకునే ప్రక్రియ ఉండాలి. చట్టం అనుమతించే ప్రతి మినహాయింపును వ్యవస్థ అమలులోకి రాకముందే పరీక్షించాలి. కోడ్, రూపకల్పన పత్రాలు, తొలగింపులకు సంబం ధించిన రికార్డులు స్వతంత్ర పరిశీలనకు అందుబాటులో ఉండాలి. రాష్ట్రాల వారీగా, తొలగింపులకు పేర్కొన్న కారణాల వారీగా వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. అలాగే, పేర్లను తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం కల్పించాలి. తొలగింపులకు కారణాలు తెలియజే యాలి. అర్హులైనవారు అబద్ధపు ప్రకటనలు చేయా ల్సిన అవసరం లేకుండా తమ పేర్లను సరిదిద్దుకోవడానికి, తిరిగి చేర్చుకోవడానికి చట్టబద్ధమైన మార్గాలు కల్పించాలి. ECINet కోడ్‌తోపాటు దాని ప్రాప్యత రికార్డులను స్వతంత్రంగా ఆడిట్ చేయాలి. ఎన్నికల సంఘం నిర్ణయాలు, సమావేశాల వివరాలు అధికారిక రికార్డుల్లో ఉండాలి.
ఓటరును నిర్ణయించేదెవరు?
సర్‌లో బయటపడిన సమస్య ఈవీఎం పనితీరుకు మాత్రమే సంబంధించినది కాదు. ఎవరు ఓటరు, ఎవరు ఓటు వేయడానికి అర్హులు అనే విషయాన్ని నిర్ణయించే ఓటర్ల జాబితా వ్యవస్థలో ఉంది. చట్టబద్ధంగా అర్హుడైన వ్యక్తిని సాఫ్ట్వేర్ తిరస్కరిస్తే, ఆ లోపాన్ని సరిచేసే అధికారం, బాధ్యత మానవ అధికారుల చేతుల్లో ఉండాలి. ఇది అసమర్థత వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్నది పరిశీలించాల్సిన అంశమే. అయితే, వ్యవస్థలోని నిర్మాణపరమైన లోపాన్ని గుర్తిం చడానికి దురుద్దేశాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. అర్హులైన పౌరులు ఓటు హక్కు కోల్పోయేలా చేసే విధానం ఏదైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. ప్రజాస్వామ్యంలో ఓటరును ఎంపిక చేసేది సాఫ్ట్వేర్ కాదు, చట్టం. ఆ చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. ఓటు హక్కును ప్రభావితం చేసే సాంకేతిక వ్యవస్థలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా, తప్పులను సరిదిద్దుకునే అవకాశాలతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం నిలుస్తుంది.
(స్వేచ్ఛానుసరణ) ప్రబీర్ పురకాయస్థ







కామెంట్లు (0)