ఓటు హక్కు రక్షణ కోసం ప్రారంభమైన పోరాటం భారత జాతికి మౌలికమైన ఇతర అంశాలపైకి కూడా విస్తరించింది. అదే సమయంలో ఈ పోరాటం శాంతియుత నిరసన సభలు జరుపుకొనే స్వాతంత్రం గురించిన ప్రశ్నలను కూడా అనివార్యంగా ముందుకు తెచ్చింది. 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా ఈ సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయని లోగడ భావిస్తూ వచ్చాం. అయితే వలసవాద వ్యతిరేక స్వాతంత్ర పోరాటంతో ఏ కోశానా సంబంధం లేని ఆర్ఎస్ఎస్ అప్పట్లో వాటిని ఆమోదించలేదు. ఇప్పుడు బీజేపీని వెనక నుంచి నడిపించే సారథిగా వుంది. ఆరెస్సెస్ ఆ స్థానం నుంచి రిపబ్లిక్ రాజ్యాంగం ప్రాతిపదికన భారత జాతికి ప్రతీకలుగా వర్ణించబడే చిహ్నాల పట్ల తన మౌలిక వ్యతిరేకతను మరోసారి గట్టిగా చెప్పడానికి సిద్ధమైపోయింది.
ఆది నుంచీ వ్యతిరేకమే
వినాయక దామోదర సావర్కార్, ఎం.ఎస్. గోల్వాల్కర్ ల నిరంతర వ్యాఖ్యానాలు గాకుండా - ఈ సమాంతర దృష్టిని అధికారికంగా నిక్షిప్తం చేసి అందించే సాధనం ఆరెస్సెస్ అధికార ప్రతిక ‘ఆర్గనైజర్’. త్రివర్ణ పతాకం పట్ల దాని తీవ్ర వ్యతిరేకత, హిందూ రాష్ర్ట, హిందీ కాషాయ పతాకం కావాలన్న దాని కోర్కె చాలా శక్తివంతంగానే వినిపించబడ్డాయి. 1947 జులై ఆగస్టు ‘ఆర్గనైజర్’ సంచిక ఈ దృక్పథాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా వెలవరించబడింది. 1947లో భారత స్వాతంత్రం సమీపిస్తున్న కల్లోలిత మాసాలలో ఆరెస్సెస్ తన హిందూత్వ భావజాలంతో నూతనంగా ఆవిర్భవిస్తున్న ఈ జాతీయ చిహ్నాల పట్ల వ్యతిరేకతను బాహాటంగా వెల్లడించుకుంది. దేశం పేరు, భాష, పతాకం గుర్తింపు ప్రశ్నలు మాత్రమే కాదంటూ హిందువులు, అల్పసంఖ్యాక మతాల మధ్య విభజన తీసుకురావడానికి వాటిని సాధనాలుగా చేయజూసింది. వారిని వేరుగా పెట్టే విధమైన పోటీ చిహ్నాలను ప్రతిపాదించింది. 1947 జులై-ఆగస్టు ఆర్గనైజర్ సంచిక చూస్తే దృక్పథాన్ని రుద్దడంలో వారు విఫలమైనారని స్పష్టమవు తుంది.1947 జులై రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకం గురించి చర్చించింది. త్రివర్ణ పతాకం ఆమోదించే దిశలో దేశం ముందుకు సాగుతుండగా ఆరెస్సెస్ విష ప్రచారం మొదలుపెట్టింది. భగవధ్వజం అనే కాషాయ పతాకాన్ని ఆరెస్సెస్ పూజించి శాఖలలో ఆవిష్కరించింది.
ఆరెస్సెస్‌కు చెందిన కొంతమంది సన్యాసులు దాన్ని ప్రత్యక్షంగా పట్టుకుని తిరిగారు. జులై 17 సందపాదకీయంలో ఆరెస్సెస్ తమ పతాకం గొప్పతనాన్ని ఇలా కీర్తించింది. ‘‘ఇదంతా కేవలం పనికిమాలిన వ్యవహారం, ఈ పతాకం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అది ఐదు వేల సంవత్సరాల చరిత్రగల హిందూ జాతి అనే ఒకే దేశం హిందూస్థాన్. అన్ని మతాలను సంతృప్తిపర్చాలనే ఉద్దేశంతో మనం ఒక పతాకాన్ని ఎంచుకోజాలము’’ అని ఆ సంపదాకీయం నొక్కి చెప్పింది. భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో వెలసిన హిందూరాజ్యాల గురించిన చెదురుమదురు ప్రస్తావనలతో మన గతం గురించి బూటకపు కథనాల సృష్టి దీనికి ప్రాతిపదిక. బ్రిటిష్ వలస పీడన నుండి విముక్తమై భారత దేశానికి స్వాతంత్ర్య సాధన జరిగే వరకు, ఇతర మత వర్గాలేవీ లేకుండా కేవలం ఒక ‘హిందూ దేశం’ ఐదు వేల ఏండ్ల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగిందని చెప్పడానికి చారిత్రకంగా లేదా పురావస్తు పరంగా ఎటువంటి ఆధారాలు లేవు. అసలు భారత దేశం కేవలం హిందువులకే ప్రత్యేకించి ఉండేదన డానికి ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే ఇది స్పష్టంగా కనిపించింది; ఆ పోరాటం ఫలితంగానే ‘భిన్నత్వంలో ఏకత్వం’ గల భారత జాతీయత రూపుదిద్దుకుంది. బలవంతపు ఆక్రమణ ద్వారా కాకుండా, వివిధ సంస్కృతులను తనలో ఇముడ్చు కోవడం ద్వారా ఏర్పడిన ఒక స్వాభావిక సమ్మిళిత దేశం. అయితే, ఆరెస్సెస్ మాత్రం దీనంతటికీ వ్యతిరేకమే.
అది ‘భగవధ్వజం’ కీర్తనల్లోనే వుండిపోయింది. ‘ఆర్గనైజర్’ పత్రిక కట్టుకథలతో దాన్నే జాతీయ జెండాగా సిఫార్సు చేసింది.ఆ సంపాదకీయం బెదిరింపు ధోరణిలో ఇంకా ఇలా పేర్కొంది: ‘‘ఈ జెండాలో భగవధ్వజం సమ్హోహన శక్తినీ, గొప్పతనాన్ని, ఉదాత్తతను గుర్తించలేని వారు కేవలం అజ్ఞానులు, దురుద్దేశం కలవారే. హిందుస్థాన్‌కు ఇదే నిజమైన జాతీయజెండా కాగలదు; ఇది మాత్రమే దేశానికి ఆమోదయోగ్య మైనదవుతుంది. ప్రజలలో ఇటువంటి బలమైన డిమాండ్ పెరుగుతోంది, కాబట్టి రాజ్యాంగ పరిషత్ వారి ఆకాంక్ష మేరకు నిర్ణయించడంలోనే విజ్ఞత వుంటుంది.’’ ఆరెస్సెస్ ఎంతగా ఈ భ్రమలో మునిగి తేలినా, ప్రజలు మాత్రం అసలు అలాంటి అభిప్రాయంలో ఎంతమాత్రం పాలుపంచుకోలేదు. ఎందు కంటే, స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలు పొందిన ప్రత్యక్ష అనుభవాలు వేరు; ఆ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనవద్దని సంఘ్ నాయకులు ప్రజలకు బహిరంగంగానే చెబుతుండేవారు. అప్పట్లో వారు బ్రిటిష్ వారికి విధేయులుగా వ్యవహరించేవారు.
జెండాతో చెలగాటం!
అనుకున్నట్టుగానే అంతిమంగా రాజ్యాంగ పరిషత్ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించింది. అయితే సావర్కర్‌పై అదేం ప్రభావం చూపలేదు; ఆయన ప్రకటనను ‘ఆర్గనైజర్’ ఆగస్టు 7 సంచికలో పూర్తిగా ప్రచురించారు. అంతకు ముందు ‘ఆర్గనైజర్’ జులై 3 సంచికలో ప్రచురితమైన అభిప్రాయాలనే ఈ ప్రకటనలో. గోల్వాల్కర్ కూడా వ్యక్తీకరించారు. స్వాతంత్ర్య ప్రకటనకు ఒక రోజు ముందు, ఆగస్టు 14న వెలువడిన ‘ఆర్గనైజర్’లో, ఆరెస్సెస్ తన భ్రమపూరిత ధోరణినే కొనసాగిస్తూ ఇలా పేర్కొంది: ‘‘ఏదో అదృష్టవశాత్తూ అధికారంలోకి వచ్చిన వారు త్రివర్ణ పతాకాన్ని మన చేతుల్లో ఉంచవచ్చు; కానీ హిందువులు దాన్ని ఎప్పటికీ గౌరవించరు, తమదిగా స్వీకరించరు. అసలు ‘మూడు’ సంఖ్యే ఒక చెడు సంకేతం. మూడు రంగులు కలిగిన జెండా మనస్తత్వ శాస్ర్త రీత్యా నకారాత్మక ప్రభావంతో దేశానికి చేటు తెస్తుంది’’. అంటే ఆ తొలి రోజుల నుంచి ఆరెస్సెస్ మూఢత్వ ఆలోచనల్లో మునిగి తేలడం ఆశ్చర్యమేమీ కాదు. ఆరెస్సెస్ సమర్థించిందేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీతో సహా దాని అనుబంధ సంస్థలు తమకు తామే ఎవరు దేశద్రోహులో నిర్ణయించే అధికారం గుత్తకు తీసుకున్నారు. జాతీయ జెండా విషయంలో పచ్చిగా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారు.
అందుకే, నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో దాదాపు 52 ఏండ్ల పాటు జాతీయ జెండాను ఎగురవేయలేదు. అయితే, 1992 గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటే బీజేపీ చాలా హడావిడి చేసింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడైన మురళీ మనోహర్ జోషి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు ‘ఏక్తా యాత్ర’ను చేపట్టారు. ఇక ఆర్టికల్ 370 రద్దు అప్పట్లో ఆ పార్టీకి అత్యంత ముఖ్యమై రాజకీయ ఎజెండాగా ఉండింది. వాస్తవానికి, అప్పట్లో అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరగకపోలేదు. భద్రతా దళాలు కాశ్మీర్ లోయ లోని వివిధ ప్రాంతాల్లో జాతీయ పతాకం ఎగురవేస్తూనే ఉండేవి. జాతీయ జెండా పట్ల విద్వేషకరమైన నిందాపూర్వక భావాలున్న వారు తమ దేశభక్తిని, జాతీయవాదాన్ని చూపించుకోవడానికి త్రివర్ణ పతాకాన్ని వాటమైన సాధనంగా చేసుకున్నారన్నమాట. గణతంత్ర రాజ్యాంగం పట్ల విశ్వాసంగల వారికీ, మోడీ ప్రభుత్వ విధాన పోకడలు ప్రమాదకరమని భావించే వారికీ ఇటీవలి పోరాటాల క్రమంలో జాతీయ జెండా (త్రివర్ణ పతాకం) ఒక గౌరవ చిహ్నంగా మారడం సంతోషకరమైన విషయం. కార్పొరేట్-హిందుత్వ శక్తుల కలయికతో నడుస్తున్న ఈ ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలనే వమ్ము చేసే పనిలో మునిగి వుంది.
మళ్లీ అదే ఉత్తేజం
కార్పొరేట్-హిందుత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జాతీయ జెండా విస్తృతంగా కానవచ్చింది. ముఖ్యంగా, భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే మూడు ‘నల్ల చట్టాల’కు వ్యతిరేకంగా రైతులు ఇరవై నెలల పాటు సాగించిన సుదీర్ఘ పోరాటంలో ఈ పతాకమే స్పష్టంగా కనిపించింది. జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు, రాజ్యాంగ ప్రతులు, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాల నమూనాలను కూడా తమ నిరసనల్లో భాగం చేసుకున్నారు. ఆరెస్సెస్ మౌలిక భావనలు, ఫాసిస్ట్ ధోరణులు, కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం చూస్తున్న ప్రజలు మళ్లీ పోరాటంలోకి దూకి , త్రివర్ణ పతాకాన్ని అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రతిఘటన చిహ్నంగా ఉపయోగించడం సహజమే.
ఆశాకిరణమే
అందువల్ల, నేడు ‘జెన్ జీ ఉద్యమాల్లో, అలాగే ఓటు హక్కును కాపాడుకునేందుకు ఢిల్లీ వీధుల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్న విస్తృత పోరాటాల్లో ‘తిరంగా’ మళ్లీ గట్టిగా ముందుకు రావడం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు. ఎస్ఐఆర్ని నిలిపివేయాలంటూ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగానూ, ఎన్నికల కమిషనర్ల నియామకంలో మరింత పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి కోసమూ పోరాడుతున్నవారిపై దుస్తులు మార్చిన ఆరెస్సెస్ గూండాలు, రకరకాల యూనిఫాంలలో వివిధ భద్రతా దళాల గూండాలు సాగించిన అమానుషకాండ... నిరసనకారులు మరింత వినూత్నమైన సృజనాత్మ రీతులలో, ఉత్సాహభరితంగా త్రివర్ణ పతాకాన్ని చేబూనడానికి కారణమైంది. వివిధ యువజన సంస్థలు ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేద్దా’మని పిలుపునివ్వడంతో ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జరిగే పోరాటం దేశభక్తి సారం మరింత శక్తి పుంజుకున్నట్టయింది.
త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా ఎగరేయడమన్నది అవిభాజ్యంగా రాజ్యాంగంలోని 19వ అధికరణం, నిరసన హక్కుతో ముడివడి వుంది. 19వ అధికరణాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టు ఎంతగా నొక్కి చెప్పినా ప్రభుత్వం, ఢిల్లీ పోలీ సులు మాత్రం నిరసనలను అణగదొక్కేందుకు నిర్వాహకుల అరెస్టులు, ఖైదులతో అడ్డుకుంటారని వారి తీరుతోనే స్పష్టమవు తున్నది. ఒక విధంగా చూస్తే చీకటిమయంగా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా తిరంగాను, నిరసన హక్కును గట్టిగా చాటడం చాలా గొప్ప పరిణామమే.
(అక్టోబర్ 21 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)







కామెంట్లు (0)