మో (డీ) లిమిటేషన్‌ మోసక్రీడలు

20 నిమిషాల క్రితం

De-limitation Deceptions
avatar
Telakapalli Ravi

ప్రచురించబడింది నవం 28, 2026 | 5 నిమిషాల చదవడం

మోడీ సర్కారు మోసకారి రాజకీయ క్రీడలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఆగమే ఘాల మీద పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మహి ళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి తీరాలని హడావుడి పడిపోతున్నది. గడచిన ఏప్రిల్‌‌లో ఇలాంటి ప్రహసనమే జరిపి.. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, దాంతో పాటు రాష్ర్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాసనసభ లోక్‌‌సభ సీట్లు పెంచే బిల్లు ఏకపక్షంగా తీసుకొచ్చి భంగపాటుకు గురైన తీరు ఎవరూ మర్చిపోలేదు. నిజానికి అప్పటినుంచి కేంద్రం వ్యవహారం మొత్తం చుక్కెదురుగానే నడుస్తున్నది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ ‌షా పథకం వేశారంటే ఇక తిరుగుండదనే ప్రచారం ఆ ఓటమితో వెనక్కు పోయింది. తర్వాత నీట్‌‌పై సిజెపి దీక్షలు, ‘సర్‌’ ‌దారుణాలపై ఓట్‌‌చోరీ వ్యతిరేక పోరాటం ఉధృత రూపం దాల్చాయి. వీటికి జడిసిపోయిన మోడీ టీం తాత్కాలికంగా తోకముడిచింది. అయినా 2029 ఎన్నికల పోరాటం వారి ముందు భయంగా కదలాడు తూనే వుంది. ఎందుకంటే నానా పాట్లు పడినప్పటికీ 2024లోనే మెజార్టీ పొందలేక పోయింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాపాడిన సర్‌‌లు ఇప్పుడు లేవు. గనక మరేదైనా రాజ్యాంగ రాజకీయ మాయాజాలం అనివార్యమై కూచుంది. డీ లిమిటేషన్‌ ‌ప్రహసనాన్ని మహిళా రిజర్వేషన్‌ ‌లేబుల్‌‌తో తీసుకువచ్చి తమకు బలమైన రాష్రాల్లో భారీగా సీట్లు పెంచేసు కోవాల న్నది ఇక్కడ అసలు పథకం. అంతే తప్ప ఈ రెండిం టికీ సంబంధమే లేదు. వట్టినే డీ లిమిటేషన్‌ ‌చేస్తామంటే అసలే కుదరదు. అందుకే ఈ కపట నాటకం మొదలు పెట్టారు.

అవసరమేమిటి?

ఉన్న సీట్లలో 33 శాతం ఇస్తామంటే ఎవరూ వద్దనరు. 2023లోనే ఆ మేరకు సభ బిల్లు ఆమోదించినా ఇప్పటివరకూ ఎందుకు ఇవ్వలేదనేదే సమస్య . కానీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లులో ఎక్కడా డీ లిమిటేషన్‌ ‌ప్రసక్తి లేదు, మూడోవంతు పెంచడం అనే మాట ఒక దశలో వచ్చింది గానీ యాభై శాతం పెంచడం ఎందుకు వచ్చింది? అది కూడా మొదట జనాభాను బట్టి పెంచడం అని ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు, జనాభా తగ్గించిన రాష్ర్టాలు వ్యతిరేకించడం అనివార్యంగా జరుగుతుందని తెలుసు. డీ లిమిటేషన్‌ ‌తాజా జనాభా లెక్కల గురించి జరగాలన్నప్పుడు ఐదేండ్లుగా వాయిదా పడుతున్న జనగణన ఎందుకు వాయిదా వేశారు? ఇప్పుడు 2027కు అంటే వచ్చే ఏడాదిలో కొత్త లెక్కలు రానుండగా ఎందుకింత హడావుడి పడుతున్నారు? రాష్రాల కలయికగా వున్న భారత రాజ్యాంగం ప్రకారం శాసనసభలస్థానాలు కూడా పెంచే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదు? ఏప్రిల్‌‌లో ఓడిపోయిన బిల్లును మళ్లీ తీసుకుంటున్నప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ముందే ఎందుకు మాట్లాడలేదు? ఇందులో ప్రతి ప్రశ్నకూ సమాధానం ఒకటే. ఏదో విధంగా పెంచేసుకుని ఆధిపత్యం నిలబెట్టుకోవడం తప్ప నిజమైన ఏకాభిప్రాయ సాధన కేంద్రం ఉద్దేశమే కాదు. వారికి కావలిసింది తోకాభిప్రాయం మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో వున్న ‌వైసీపీ నేత జగన్‌, బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ ‌వంటివారు ఆ మద్దతునివ్వడానికి సిద్ధంగా వున్నారు. ఏదో విధంగా సీట్లు పెరుగుతాయనే ఆనందం తప్ప దీర్ఘకాలిక ప్రభావాలూ, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక సమతుల్యత వంటివి వారికి ప్రధానం కాదు.

తెలుగు రాష్ట్రాలకు మరీ దెబ్బ

నిజంగా తెలుగు రాష్రాలు ఈ విషయంలో మరింత వ్యతిరేకత తెలిపి ఉండాల్సింది. 2014లో విభజన చట్టంలోనే ఇరు శాసనసభల స్థానాలు పెంచాలని నిర్దేశించి ఉంది. ఆ ప్రకారం తెలంగాణలో 175, ఏపీలో 225 స్థానాలు అయివుండాలి. చేయకపోవడానికి కారణమేమీ లేదు. డీ లిమిటేషన్‌‌పై రాజ్యాంగ నిషేదం ఉందని అప్పుడు చెప్పారు. కానీ మధ్యలోనే అస్సాం, జమ్మూ కాశ్మీర్‌‌లలో లోక్‌‌సభ స్థానాల పునర్విభజన చేశారు. అది కూడా మత కోణంలో ముస్లిం మెజార్టీ వున్న సీట్లకు హిందూ ఓటర్లు కలిసేలా చేసి తమకు లాభం కలిగేలా చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ సమయంలో ఇంత హడావుడి పడటానికి అది అతి ముఖ్య కారణం. ఇప్పుడు సీట్ల పెంపునకు ఆమోదం వేసుకోవడమంటే నియోజకవర్గాల సంఖ్య, సరిహద్ధులు నిర్ణయించే అధికారం పొందడమే, అది కూడా ఎన్నికల సంఘం చేయవలసి వుంటుంది. వీగిపోయిన బిల్లులో ఈ అధికారం పూర్తిగా ప్రధాన ఎన్నికల అధికారి(సిఈసి) ఆధ్వర్యంలో ఆయన లేదా తను నియమించే మరో అధికారి కేంద్ర ప్రతినిధి, రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కమిషనర్లు ఆయాచోట సభ్యులుగా ఉంటారని ప్రతిపాదించారు. సర్‌ ‌తతంగం, ఈవిఎంలపై వివాదాలు చూసిన తర్వాత ఈ సిఈసి ఎలా చేసి ఉండేవారో ఎవరైనా ఊహించగలరు. ఆయన్ను ఈ సర్కారు ఎందు కింతగా పట్టుకు వేళ్లాడుతున్నది కూడా అర్థం చేసుకోగలరు. ఇప్పటికీ ఆయనే పదవిలో ఉన్నారని కూడా గుర్తుంచు కోవలసి వుంటుంది. కనక ఇదొక కపటనాటకం. మళ్లీ శాసనసభ సీట్ల విషయానికొస్తే ఇప్పుడు చట్టంలో 500లోపు శాసనసభ స్థానాల పరిమితి ఉంది. యూపీలో అత్యధికంగా 420 ఉన్నాయి. కానీ కొత్త బిల్లులో 500-650 వరకూ పెంచుకోవచ్చని ప్రతిపాదన చేశారు. ఇది స్పష్టంగా యూపీ కోసమే. అసలు చిన్న రాష్రాల సిద్ధాంతం చెప్పే బీజేపీ తగ్గింస్తుందే గానీ పెంచదు కదా మరి ఈ పెంపు దేనికి? తమకు కావలసిన యూపీలో పెంచుకోవడం కోసమైతే అడ్డగోలుగా చేస్తారు ఏపీ, తెలంగాణలకు మాత్రం చేయరన్నమాట. స్వప్రయోజం తప్ప దేశ విశాల దృష్టి కాదన్నది ఇక్కడే తెలిసిపోతుంది. ముందే చెప్పినట్టు ఏపీ, తెలంగాణ సీట్లు పెంచి వుంటే దానిపై యాభై శాతం ఇంకా పెరిగివుండాలి కదా? ఏపీకి 2009లో రెండు లోక్‌‌సభ స్థానాలు తగ్గించారు గనక మరింత నష్టం జరిగిందనేది కూడా ఇక్కడ గమనించాల్సి వుంటుంది. తమపైనే మోడీ సర్కారు ఆధారపడి ఉందనీ, ఎంతో సహకరిస్తున్నదని టముకు వేసేవారు వీటిని ఎందుకు సాధించలేకపోయారు? ఇప్పుడు కనీస ప్రశ్నలు వేయకుండా ఎందుకు వంతపాడుతున్నారు? చూస్తే చంద్రబాబులా అత్యత్సాహంతో సమర్థిస్తున్న బీజేపీయేతర నాయకులు మరొకరు కనిపించడం లేదు.

అవకాశవాద మద్దతు

వైసీపీ, బీఆర్‌ఎస్‌ ‌కూడా సీట్ల పెంపునే గొప్పగా చూపిస్తూ మద్దతు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ చిరకాల కల నెరవే రిందని బీఆర్‌ఎస్‌ అంటుంటే వైసీపీ పెరిగే సీట్లతో దూసుకుపోతానని కలలు కంటున్నది. ఇక తమిళ నాడులో స్టాలిన్‌, మహారాష్ర్టలో శరద్‌ ‌పవార్‌ ‌వంటివారు కూడా తమ తమ కోణాలలో బలపర్చడం తప్ప రాజ్యాంగ హక్కుల కోసం మాట్లాడక పోవడం బాధాకరమైన వాస్తవం. బీజేపీ వరకూ చూస్తే అకాలీ దళ్‌ ‌తిరిగిరావడం తప్ప ఎన్‌‌డిఎతో కలిసిన వారెవరూ లేరు. అయినా ఈ బిల్లు తేవడానికి సాహసిం చిందంటే ఇలాంటి అవకాశవాద మద్దతులూ, బెదిరించి తెచ్చుకున్నవే కారణం. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ నుంచి, శివసేన ఉద్ధవ్‌ ‌వర్గం నుంచి చీలిపోయిన వారిని (అంతకుముందే చీలిపోయిన షిండే వర్గంతో పాటు) డిఎంకెను కూడా కలుపుకుని లెక్కేసుకున్నారు. బీజేపీకి 241 స్థానాలు స్వంతంగా ఉండగా బలపర్చేవారిని కలుపుకుని 319 అవుతుంది. ఎనిమిది మంది ఎన్సీపీ, 22 మంది డిఎంకె, 20 మంది టిఎంసి మాజీలు, నలుగురు వైసీపీ కలిస్తే కాస్త తక్కువ వుంటుంది. ఆరోజు హాజరు కాకపోవడం, ఇతర వ్యూహాలతో ఎలాగో నెట్టేసుకు పోగలమని బీజేపీ నమ్ముతున్నది. ప్రలోభాలు, బెదిరిం పులు కూడా నడిపిస్తున్నది.

మరీ దారుణమేమంటే పవార్‌ ‌కుమార్తె సుప్రియా సూలేకు కేంద్రంలో పదవీ గురించి కూడా ఇప్పుడే బేరాలు నడవడం! బీఆర్‌ఎస్‌‌కు లోక్‌‌సభలో సభ్యులు లేరు గానీ రాజ్యసభలో వున్నారు. కానీ ఇవన్నీ నిరాటంకంగా నడుస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. అధినేతల అవకాశవాద పోకడలను వ్యతిరేకించేవారు, ఆక్షేపించేవారు ఆ పార్టీల్లో లేకపోలేదు. కనక 2026 ఏప్రిల్‌‌లో వలెనే ఇప్పుడు కూడా శృంగభంగమైనా ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిల్లును సమర్థించేది లేదని తేల్చిచెప్పడంతో పాటు కార్యక్రమం కూడా రూపొందించుకుంటున్నాయి. డిలిమిటేషన్‌ పార్లమెంటు చరిత్రలోనే విషాద ఘట్టమని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ ‌బ్రిటాస్‌ ‌స్పష్టం చేశారు. ఓట్‌‌చోరీ సీట్‌ ‌చోరీ తర్వాత ఇది సంసద్‌ ‌చోరీ అని కాంగ్రెస్‌ ‌సభ్యులొకరు అన్న మాట యదార్థమే, పాలక పక్షాలకు అందులోనూ మితవాద మతవాద బీజేపీ వంటి పార్టీలకు ఆధిపత్యం, అధికారం నిలబెట్టుకోవడం తప్ప ప్రజా స్వామ్య సూత్రాలపై పెద్ద పట్టింపేమీ వుండదు. ఇక్కడ కొసమెరుపు ఏమంటే గతంలో జమిలి ఎన్నికలంటూ హంగామా చేసి ఒక కమిటీని కూడా నియమించిన బీజేపీ ఇది ముగిసిన వెంటనే దాన్ని కూడా తీసు కొస్తానంట ున్నది. అదే జరిగితే తెలంగాణలో ఎన్నికలు ఆరునెలలు ఆలస్యమవుతాయని రాష్ర్టపతి పాలన పెడతామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయినా సరే బీఆర్‌ఎస్‌ అనుకూలంగానే స్పందిస్తున్నది. బహుశా ఈ పరిస్థితి మరిన్ని చోట్ల కూడా ఎదరవచ్చు. పైగా బీజేపీ కీలక ఎంపీ హైదరాబాదులో స్పష్టంగా చెబుతున్న ఈ మాట అధికారికంగా కేంద్రం ప్రకటించలేదు. అకస్మాత్తుగా దాడిచేసి అనుకున్న పని పూర్తి చేసుకోవాలన్నదే వారి ఆలోచనగా సాగుతున్నారు.


ఇదే సమయంలో ప్రధాని మోడీ స్వయంగా మొన్న రాజ్యాంగ దినోత్సవాన రాసిన వ్యాసంలో ముస్లిం రిజర్వేషన్లు అడుగుతున్నారంటూ ప్రతిపక్షంపై దాడిచేశారు. బీసీ ముస్లిం రిజర్వేషన్లకు పోటీ పెట్టి వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్‌ ‌బిల్లుపై మాట్లాడే సందర్భంలోనే అమిత్‌ ‌షా తాము పాలించే రాష్ర్టాలన్నిటిలో ఉమ్మడి సివిల్‌ ‌కోడ్‌ ‌తీసుకువస్తామన్నారు. కనుక బీజేపీ-ఆరెస్సెస్‌‌ల మతతత్వ ఎజెండా స్పష్టంగానే కనిపిస్తున్నది. దీనిపై పార్లమెంటులో నెగ్గడం నెగ్గకపోవడం ఒకటైతే మౌలికంగా ఈ అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక పోకడలపై పోరాడటం మరింత ముఖ్యం. అలాంటి పోరాటాల భయంతో, ఇలాంటి కుటిల ఎత్తుగడలకు సర్కారు పాల్పడవచ్చు గానీ అదే వారిని కాపాడటం జరిగే పనికాదు.
తెలకపల్లి రవి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

సిఫార్సు చేయబడింది

హోమ్