ఎన్ని వసతులు కల్పించినా మన పరిశ్రమలు వస్తూత్పత్తి పెంచడం లేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. తన ‘‘మేక్ ఇన్ ఇండియా’’ నినాదం వమ్ము కావడానికి మొత్తం బాధ్యతను పారిశ్రామిక సంస్థల నెత్తిన రుద్దేశారు. భారత వాణిజ్య పారిశ్రామిక సంస్థల సమాఖ్య (ఫిక్కీ) శతవార్షిక సభ వేదికగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల అసలు ముఖాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. సుమారు రెండున్నర లక్షల ప్రయివేట్, ప్రభుత్వ, బహుళజాతి సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేదికపై నిలబడి, ఉత్పత్తి పెరగలేదంటూ పారిశ్రామిక రంగంపై మోడీ విరుచుకుపడటం తమ స్వయంకృత విధాన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయ త్నమే తప్ప మరొకటి కాదు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆచరణలో దారు ణంగా విఫలమైన బాధ్యతను పారిశ్రా మికవేత్తలపైకి నెట్టివేస్తూ, సాక్షాత్తూ దేశ ప్రధానే ప్రతిపక్షాల తరహాలో విమర్శ నాస్త్రాలు సంధించడం కంటే విడ్డూరం ఇంకేముంటుంది?
కార్పొరేట్ రంగానికి ఊతమిచ్చే ముసుగులో పన్ను రేట్లను 32 శాతం నుంచి 22 శాతానికి కుదించి, బడా బాబులకు కాసుల వర్షం కురిపించింది వీరి ప్రభుత్వమే. దీనికి తోడు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టిన బడా కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలకు రాయితీలు, రైట్-ఆఫ్‌ల పేరిట కళ్లప్పగించి మాఫీ చేస-ింది కూడా ఇదే పాలకులు! కార్పొరేట్ పన్నుల తగ్గింపుతో బడా సంస్థల ఖజానాలు, లాభాలు కొండలా పెరిగాయే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క ఉపాధి అవకాశమైనా పెరగలేదు. కష్టజీవులైన శ్రామికుల, ఉద్యోగుల వేతనాలు పైసా కూడా మెరుగుపడలేదు. నాణ్యమైన ఉత్పత్తులూ సామాన్యుడికి అందుబాటులోకి రాలేదని ప్రధాని స్వయంగా అంగీకరించడం పాలకుల విధానాల డొల్లతనానికి పరాకాష్ట!
అయితే, ఈ వైఫల్యాలకు మూలం ప్రభుత్వ నయా ఉదారవాద, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానా లేనన్న నిజాన్ని ప్రధాని పూర్తిగా విస్మరించారు. దేశీయ కొనుగోలు శక్తిని పెంచేలా ప్రజల చేతుల్లో ఆదాయం నిలిచే విధానాలు లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం, ఆర్థిక అసమా నతలు పెరగడం వంటి అంశాలను పక్కనపెట్టి, కేవలం పారిశ్రామికవర్గాల మీదే నెపం నెట్టడం అసలు సమస్యను పక్కదారి పట్టించడమే. రాయితీలన్నీ బడా కార్పొరేట్లకు కట్టబెట్టి, ఆర్థిక మందగమన బాధ్యతను ఇతరులపై మోపడం ద్వారా ప్రభుత్వ విధానాల వైఫల్యం స్పష్టమవు తోంది.
ఒకవైపు విదేశీ ఎగుమతుల ప్రమాణాలు అంతర్జాతీయ నిబంధనలపై ఆధారపడి ఉంటా యని, దేశీయ మార్కెట్లో కొనుగోలు శక్తి, ధరల అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టిఎ) కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే పరిశ్రమలు వాటిని వినియోగించుకోవడం లేదంటూ మోడీ వాపోతున్నారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ఏడాది కాలంగా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తూనే ఉంది. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే ఆ ఒప్పందం ఇంకా ప్రాథమిక సంప్రదింపుల దశలోనే చిక్కుకుపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన, అనిశ్చిత వాణిజ్య వైఖరిని గమనిస్తే, ఈ ఒప్పందం ఎప్పటికి కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి.
అమెరికా, రష్యా, బ్రిటన్‌తో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెంచే సామర్థ్యం ఉన్నప్పటికీ, విదేశీ వాణిజ్య ఒప్పందాలు ఆశించిన స్థాయిలో ఎందుకు ముందుకు సాగడం లేదనే కీలక ప్రశ్నలకు ప్రధాని వద్ద స్పష్టమైన సమాధానాలు లేవు. ప్రభుత్వ విధానాల అస్థిరత, గత వాణిజ్య ఒప్పందాలలో ఎదురైన చేదు అనుభవాల వల్లే పారిశ్రామికవేత్తలు సభలో మౌనంగా ఉన్నారు. ఈ పరిస్థితిని గ్రహించి మోడీనే చివరకు ‘చప్పట్లు కొట్టండయ్యా’ అంటూ అడుక్కోవాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రధాని టముకు వేసి ప్రచారం చేస్తున్నట్టుగా మన ఆర్థిక వ్యవస్థ మూడు పూలు, ఆరు కాయలుగా ఎదుగుతున్న దాఖలాలే లేవన్న సంగతి ప్రధాని కుండబద్దలు కొట్టి మరి చెప్పకనే చెప్పారు. స్వావలంబన సాధించడంలో భారత్ పురోగతి సాధించలేదని అంగీకరిస్తూ మోడీ మాట్లాడిన మాటలు ‘ఆత్మనిర్భర భారత్’లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.
నిజమైన స్వావలంబన సాధించాలంటే కార్పొరేట్ లాభాల కంటే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ పెట్టుబడులను పెంచి దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి. కార్మికులు సృష్టించే సంపద యావత్ సమాజానికి అందేలా చూడాలి. కానీ, ప్రభుత్వం అందుకు భిన్నంగా లేబర్ కోడ్లకు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. శ్రమజీవుల హక్కులను పరిరక్షించడమే దేశ ఆర్థిక పురోగతికి అసలైన మార్గం.






కామెంట్లు (0)