బావా బావా భారత్ ఇప్పుడు భారత్ కాదంట, రుణముక్త భారతంట యాద్గిరి పరుగుపరుగున వచ్చాడు.
ఐతే ఏమిటి గిరి? ప్రశ్నించాడు నర్సింగ్.
అంటే మన దేశానికి చెందిన అప్పులన్నీ కట్టేశారనే కదా బావా?
అలాగని ఎవరు చెప్పారు యాదన్నా.
నీవేమిటి బావా మన ప్రధాని, అమాత్యులు అంతగా చెబుతుంటే నీకు తమాషాగా ఉందా. అన్నీ అంతే నీకు!
రుణముక్త భారతా లేకుంటే రుణ విముక్త భారతా సరిగా చెప్పు?
అదేమిటి బావా రెండింటికీ తేడా ఏముంది.
ఉంది యాద్గిరి చార్మినారుకు కుతుబ్మినారుకు ఉన్నంత తేడా ఉంది.
నాకర్థం కాలేదు...
నీకే కాదు ప్రజలెవ్వరికీ అర్థం కాదిది.
అంటే?
అంటే లేదు గింటే లేదు నాయకుల పదాలు అంత తీయగా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి.
అంటే?
ఇది నీ మూడో ‘‘అంటే’’. నిన్ను ఒకటడుగుతా చెప్పు అప్పు తీరాలంటే మొదట ఏం చేయాలి
అప్పు చేయాలి..
అబ్బా నీకింత తెలివి ఉందని తెలీక అడిగాను యాద్గిరి . ఇది నీకిప్పుడొచ్చింది కాని పెద్దోళ్ళకు ఎప్పుడో వచ్చింది. నిషాముక్త భారత్ తయారుచేయాలంటే, ఊరేగింపులు చేయాలంటే, మీద మీద ప్రచారం చేసి టీవీల్లో కనబడాలంటే మొదట ఏం చేయాలి నీ తరహాలో చెప్పు.
మొదట తాగుడు, మత్తు మందులు అలవాటు చేయాలి బావా.
ఇప్పుడు లైన్లోకొచ్చావ్ యాద్గిరి. ఏమైనా నువ్వు ముందు ముందు గొప్ప దేశనాయకుడవౌతావ్ అనిపిస్తుంది.
ఇన్నిన్ని మోసాలు చేస్తూ దేశనాయకుడిగా మారడం నాకిష్టం లేదు బావా. లోపల ఒకటి చేస్తూ బయటికి ఒకటి చెబుతూ ఎప్పటికప్పుడు ప్రజల్ని మోసం చేస్తున్నారు చూడు అలా నేనెప్పుడూ చేయలేను.
మరేం చేస్తావు యాద్గిరి?
ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి బావా.
ఎలా తెలియజేస్తావ్.
పత్రికల ద్వారా, టీవీల ద్వారా ఇలాంటి నాయకుల చోర్ముక్త భారత్ కావాలని ప్రచారం చేయాలి.
అవెప్పుడూ వాళ్ల చేతిలో ఉంటాయి యాదన్నా. నీవు చెప్పినా ప్రజలు ఇప్పుడు పెద్ద నిషాలో ఉన్నారు. వాళ్ళంటే భయంతోనో, భక్తితోనో, లేదూ గుడ్డి నమ్మకంతోనో ప్రజలు వినే పరిస్థితిలో లేరు.
చెప్పగా చెప్పగా వింటారు బావా. రైతులు, యువత ఉద్యమాలు చేశారు కదా లోలోపల ప్రజల్లో కసికూడా ఉంది బావా.
అమ్మో నీవు తక్కువోడివి కాదు యాద్గిరి. అన్నీ గమనిస్తున్నావ్.
లేదంటే యాభై శాతం సీట్లు దామాషా పద్ధతిలో పెంచుతామన్నోళ్లు ఇప్పుడు అందరికీ పెంచుతామని కొత్త ఎత్తుకు పోయారు కద బావా. జనాలని, పార్టీలని బోల్తా కొట్టించడంలో వీళ్లను మించినోళ్లు లేరు బావా.
బోల్తా కొట్టించేటోళ్లు ఎప్పుడో ఒకప్పుడు బోల్తా పడతారు యాద్గిరి.
మెజారిటీ లేకుండానే అన్నీ చేసుకుంటూ పోతున్నారు కద బావా ఇక సీట్లు పెంచి ఎక్కువ సీట్లు వాళ్ళె తెచ్చుకొని ఇంకేం చేస్తారోనని భయంగా ఉంది బావా!
భయమేమీ అక్కరలేదు యాద్గిరి. బ్రిటీషోళ్లు తమకోసం రైళ్లు వేసుకున్నార లేదా. వాటిద్వారా సరుకులు రవాణా చేసి వ్యాపారం పెంచుకున్నారా లేదా.
పెంచుకున్నారు.
రైళ్లలో దేశమంతా తిరిగి మహాత్ముడు ప్రజలందరినీ ఏకం చేశాడా లేదా?
చేశాడు బావా. అప్పటికే దేశంలో చాలా చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయిలే.
సరే వాటినన్నింటినీ ఒక క్రమంలో పెట్టాడు కదా.
అవును బావా.
ఇప్పుడూ అలాగే ఉంది పరిస్థితి. అందరినీ ఒకేతాటి పైకి తేవడానికి మనం పని చేయాలి యాద్గిరి.
కరెక్టే బావా. అదే మంచిపని వీళ్లను ఎదుర్కోవడానికి.
నీవు మొదట అన్నావే రుణముక్త భారత్ అని, పెద్ద పెద్ద కార్పోరేట్ల అప్పులన్నీ ఓ నాలుగైదు శాతం కట్టించుకొని మిగతాది మాఫీ చేస్తున్నారు చూడు. ఇలాంటి పనులన్నీ నిజమైన దేశ భక్తులు చేస్తారా అని అడుగు భక్తులను. సమాధానమేం చెబుతారో చూద్దాం.
వాళ్లు మూర్ఖులు బావా, కండ్లు తెరవరు.
అలా అనుకోకు యాద్గిరి చోర్ముక్త భారత్ కావాలంటే మనం నిషాముక్త భారత్ తయారుచేయాలి.
నీవూ వాళ్ల మార్గంలోనే వెళుతున్నావా, ఊరేగింపుల్లో పోతావా బావా.
కాస్త ఓపికగా విను యాద్గిరి. నేను చెప్పే నిషా ప్రజల మెదళ్లలో ఉన్నది. దాన్ని పోగొట్టాలి మొదట. అప్పుడు వీళ్లను ఇంటికి సాగనంపడం ఈజీ అవుతుంది.
నిజమే బావా.
ఇకనుండి ఏం పని మీద ఉంటావ్.
నిషాముక్త భారత్, చోర్ముక్త భారత్ బావా.
అది అసలైన విషయం. ఇప్పుడు గాంధీలాగా పట్టాలెక్కావ్. దేశాన్ని కూడా పట్టలెక్కించు మరి.
సరే బావా.
జంధ్యాల రఘుబాబు
9849753298






కామెంట్లు (0)