– రాజ్యాంగంలో ‘సోషలిస్టు, ‘సెక్యులర్’ పదాలు తొలగించాలనడంపై సీపీఐ(ఎం) నిరసన
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ప్రవేశిక నుంచి ‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి చేసిన ప్రతిపాదనను సీపీఐ(ఎం) తీవ్రంగా నిరసించింది. రాజ్యాంగాన్ని నాశనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్ సుదీర్ఘ లక్ష్యం, తన హిందూత్వ ప్రాజెక్టుకు అనుగుణం గా భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న దాని ఉద్దేశం ఈ ప్రతిపాదనతో బహిర్గతమైందని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. స్వాతంత్య్రం కోసం మన చారిత్రాత్మక వలసవాద వ్యతిరేక పోరాటంలోని వివిధ స్రవంతుల నుంచి వచ్చిన అసంఖ్యాక స్వాతంత్య సమరయోధుల ఆకాంక్షలను భారత రాజ్యాంగం కలిగి వుంది. రాజ్యాంగం ప్రవేశికలో ‘సోషలిజం’, ‘సెక్యులరిజం’ పదాలను పొందుపరచడమనేది ఏకపక్షంగా చేర్చినది కాదు. షహీద్-ఇ-ఆజం భగత్ సింగ్, ఆయన అనుచరులు వంటి స్వాతంత్య్ర సమరయోధులు దీటుగా నిలబడిన, తమ ప్రాణాలను త్యాగం చేసిన కీలకమైన విలువలను ఇది ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగంలోని ప్రతి నిబంధనలోనూ వారి ఆదర్శాలు పొందుపరచబడ్డాయి. ఈ పదాలను చేర్చడం ఆ వారసత్వాన్ని ధ్రువీకరిస్తుంది. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు ఈ ప్రాథమిక సూత్రాలను తొలగించాలని కోరడం వారి కపటత్వానికి పరాకాష్ట. ఆర్‌ఎస్‌ఎస్ యొక్క మితవాద, ప్రజావ్యతిరేక, విచ్ఛన్నకర సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జాతీయోద్యమ, అమరవీరులు పాటించిన గొప్ప విలువలను వారు (ఆర్‌ఎస్‌ఎస్) సహరించలేరు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన కీలక విలువలను మార్చేందుకు జరిగే ఏ ప్రయత్నాన్నైనా సీపీఐ(ఎం) దృఢంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా వుంటూ, ఆర్‌ఎస్‌ఎస్, అది చెప్పినట్టు నడుచుకునే బీజేపీ చేసే ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించాలని పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్ ఉద్దేశం బహిర్గతమైంది
- Advertisement -
- Advertisement -