Wednesday, April 30, 2025
Homeఆటలుఆ ఇద్దరుమెరిస్తేనే!

ఆ ఇద్దరుమెరిస్తేనే!

– అభిషేక్‌, హెడ్‌ రాణిస్తేనే సన్‌రైజర్స్‌ జోరు
– ఓపెనర్లపై అతిగా ఆధారపడుతున్న ఆరెంజ్‌ ఆర్మీ
– సంక్లిష్టంగా మారుతున్న ప్లే ఆఫ్స్‌ అవకాశాలు

కత్తి పట్టిన వాడు.. ఎప్పటికైనా కత్తికే బలవుతాడు. క్రికెట్‌లో ఈ మాట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సరిగ్గా సరిపోతుంది. భారీ స్కోర్ల మోజు, 300 రికార్డు వేటలో అతి దూకుడు చూపించిన సన్‌రైజర్స్‌కు ఇప్పుడు ఆ దూకుడే చేటు తెచ్చింది. వేగంగా మారుతున్న టీ20 క్రికెట్‌లో ఒకే వ్యూహం దగ్గర ఆగిపోతే అవివేకమే అవుతుంది. గత సీజన్‌లో ఫలించిన ధనాధన్‌ దూకుడు తాజాగా పని చేయటం లేదు. అయినా, సన్‌రైజర్స్‌ ఇంకా ఆ వ్యూహంతోనే ముందుకెళ్తుంది. ఇది ఆత్మవిశ్వాసమా? అవివేకమా?! ఫలితాలే తేల్చాలి.
నవతెలంగాణ క్రీడావిభాగం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌ దక్కాలంటే కనీసం ఎనిమిది మ్యాచుల్లో విజయాలు వరించాలి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసింది. రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ మరో ఏడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ ఏడింటిలో సన్‌రైజర్స్‌ కనీసం ఆరు విజయాలు సాధించాలి. సన్‌రైజర్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రస్తుత వ్యూహం, ఆలోచనతో ఆరు విజయాలు సాధించటం కష్టమే అనిపిస్తోంది. అందుకు కారణం, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌పై ఆ జట్టు అతిగా ఆధారపడటమే.
ఓపెనర్లు రాణిస్తేనే..
2024 ఐపీఎల్‌ నుంచి అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌లు 22 మ్యాచుల్లో ఓపెనింగ్‌ చేశారు. అందులో 11 మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ గెలుపొందగా.. 11 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. విజయాలు సాధించిన మ్యాచుల్లో అభిషేక్‌, హెడ్‌ పరుగులు వరద పారించారు. జట్టు స్కోరులో మూడొంతుల పరుగులు ఈ ఇద్దరే బాదారు. ఓవర్‌కు 14.65 పరుగులతో సగటున 80.1 పరుగులు పిండుకున్నారు. కానీ సన్‌రైజర్స్‌ ఓడిన మ్యాచుల్లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. సగటు స్కోరు 14.5కు పడిపోగా.. రన్‌రేట్‌ 8.78కు తగ్గింది. ఐపీఎల్‌18లో రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రావిషేక్‌ 19 బంతుల్లో 45 పరుగులు జోడించింది. ఇషాన్‌ కిషన్‌ శతకం ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. ఆ తర్వాత మ్యాచుల్లో వరుసగా 15, 11, 4, 9 పరుగుల భాగస్వామ్యమే నమోదైంది. పంజాబ్‌ కింగ్స్‌పై మళ్లీ 171 పరుగులతో మోత మోగించగా.. ముంబయి ఇండియన్స్‌పై 59 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ నెగ్గిన మ్యాచుల్లో అభిషేక్‌, హెడ్‌ 13.93 రన్‌రేట్‌తో జట్టు స్కోరులో 40 శాతం పరుగులు బాదగా.. ఓడిన మ్యాచుల్లో ఓవర్‌కు 9 పరుగుల చొప్పున జట్టు స్కోరులో 6.2 శాతం పరుగులే జోడించారు. గెలుపోటముల శాతం మరే జట్టుకు ఈ స్థాయిలో వ్యత్యాసం లేదు. విజయాల్లో ఓపెనర్లు సగటు 77.80 కాగా, ఓటముల్లో 19.54 సగటు నమోదు కావటం గమనార్హం.
ప్రత్యర్థులు పట్టేశారు?
ఆధునిక క్రికెట్‌లో ‘డేటా’ అద్భుతాలు చేస్తోంది. అభిషేక్‌, ట్రావిశ్‌ హెడ్‌పై ఇతర జట్లు గట్టి ఫోకస్‌ పెట్టాయి. ఏ షాట్లకు అవుటవుతున్నారు, ఎటువంటి బంతికి పేలవ షాట్‌ ఆడుతున్నారు, ఏ వ్యూహానికి పడిపోతున్నారనే రిసెర్చ్‌ గట్టిగా జరిగింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 39.56 బాల్స్‌ను షార్ట్‌బాల్స్‌ను సంధించింది. ఫలితంగా సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు బాదింది. ఉప్పల్‌లోనే జరిగిన తర్వాతి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ బౌలర్లు తెలివిగా బౌలింగ్‌ చేశారు. ఐపీఎల్‌2024లో ఉప్పల్‌లో యార్కర్లపై రన్‌రేట్‌ 6.74 మాత్రమే. దీంతో ఆ జట్టు ఎక్కువగా యార్కర్లు, ఫుల్‌ లెంగ్త్‌ బాల్స్‌ను సంధించి సక్సెస్‌ అయ్యింది. 300పై కన్నేసిన సన్‌రైజర్స్‌ను కనీసం 200 మార్క్‌ తాకనీయలేదు. రిషబ్‌ పంత్‌ అమలు చేసిన ఫార్ములానే ఇతర జట్లు అనుసరించాయి. ఫలితంగా, సన్‌రైజర్స్‌ ఏడు మ్యాచుల్లో ఐదింట ఓడింది. వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌ పేసర్లు సైతం యార్కర్లు, ఫుల్‌ లెంగ్త్‌ బంతులతో సన్‌రైజర్స్‌ బ్యాటర్లను ఇరకాటంలో పడేయటం చూశాం.
మరి ఇప్పుడెలా?
సన్‌రైజర్స్‌ సక్సెస్‌లో అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌ మెరుపులు కీలకం. ఆ ఇద్దరు ఆశించిన ఫామ్‌లో లేరు. ప్రత్యర్థి జట్లు మెరుగైన ప్రణాళికతో హైదరాబాద్‌ ఓపెనర్లను కట్టడి చేస్తున్నాయి. మరి, ఈ సమయంలో సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ మరింత బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పవర్‌ప్లేలో గట్టి పునాది లేనిదే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు భారీ స్కోరు కల సాధ్యం చేయలేరు. 300 మెరుపులు సన్‌రైజర్స్‌కు ఇప్పుడు అవసరం లేదు. 20 ఓవర్ల పాటు నిలకడగా బౌండరీలు బాదుతూ 220-230 పరుగులు చేస్తే చాలు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ సహా అనికెత్‌ వర్మలు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే సన్‌రైజర్స్‌ మళ్లీ వరుస విజయాలు సాధించవచ్చు. కానీ అందుకు, సన్‌రైజర్స్‌ ప్లాన్‌-బి అమలు చేసే ఆలోచన చేయాలి!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img