Saturday, June 7, 2025
E-PAPER
Homeఆటలుకప్పు కొట్టేదెవరో?

కప్పు కొట్టేదెవరో?

- Advertisement -

– ఐపీఎల్‌ ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఢీ నేడు
– తొలి టైటిల్‌పై కన్నేసిన ఇరు జట్లు
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంతిమ ఘట్టానికి చేరుకుంది. 18వ సీజన్‌లో కొత్త చాంపియన్‌కు రంగం సిద్ధం కాగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌ టైటిల్‌ వేటలో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నాల్గోసారి ఫైనల్‌కు చేరుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ రెండోసారి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. బెంగళూర్‌కు తొలి టైటిల్‌ అందించాలనే సంకల్పంతో విరాట్‌ కోహ్లి ఉండగా.. పంజాబ్‌ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపేందుకు శ్రేయస్‌ అయ్యర్‌ ఉక్కు సంకల్పంతో కనిపిస్తున్నాడు.
ఐపీఎల్‌18 ఫైనల్లో ఎవరు నెగ్గినా రికార్డులు బద్దలు కానున్నాయి. 18 ఏండ్లుగా టైటిల్‌ను అందుకునేందుకు ఎదురుచూస్తున్న రెండు జట్లు నేడు ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచాయి. క్వాలిఫయర్‌1లో పంజాబ్‌ కింగ్స్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ చిత్తుగా ఓడించింది. నేడు ఫైనల్లోనూ రజత్‌ సేన అదే ప్రదర్శన పునరావృతం చేస్తుందా? శ్రేయస్‌ గ్యాంగ్‌ ప్రతీకార విజయంతో కప్పు ఎగరేసుకుపోతుందా? చూడాలి.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
ఐపీఎల్‌ 18 అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నేడు ఫైనల్లో టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. ఇటు పంజాబ్‌ కింగ్స్‌.. అటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలి టైటిల్‌ కోసం ఎదురు చూస్తుండగా.. ఐపీఎల్‌కు కొత్త చాంపియన్‌ ఖాయమైంది. 2014 తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ తొలిసారి ప్లే ఆఫ్స్‌కు, ఫైనల్‌కు చేరుకోగా.. 2016 తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలిసారి టైటిల్‌ పోరులో అడుగుపెట్టింది. గత సీజన్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్సీ వహించటం ఆ జట్టుకు అదనపు అనుకూలత. గతంలో మూడు సార్లు ఫైనల్లో బోల్తాకొట్టిన బెంగళూర్‌ ఈసారైనా కప్పు అందుకుంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
జోరుమీదున్న పంజాబ్‌ కింగ్స్‌
క్వాలిఫయర్‌2లో ఐదు సార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌పై అదిరే విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. పేసర్లకు అదనపు బౌన్స్‌ లభించిన ముల్లాన్‌పూర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బౌలర్లకు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు దాసోహం అయ్యారు. కానీ అహ్మదాబాద్‌ ఎర్రమట్టి పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లను నిలువరించటం బెంగళూర్‌ బౌలర్లకు అంత సులువు కాబోదు. ఐపీఎల్‌లో సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్‌ అయిన జట్టు పంజాబ్‌ కింగ్స్‌. ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో (టాప్‌-7) నలుగురు అన్‌క్యాప్‌డ్‌ భారత బ్యాటర్లు కావటం విశేషం. మరే జట్టు ఈ స్థాయిలో దేశవాళీ క్రికెటర్లపై నమ్మకం పెట్టలేదు. ప్రియాన్షు ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, శశాంక్‌ సింగ్‌, నేహల్‌ వధేరా సీజన్‌లో నిలకడగా రాణించారు. నేడు ఫైనల్లోనూ పంజాబ్‌ కింగ్స్‌కు ఈ నలుగురు దేశవాళీ బ్యాటర్లు కీలకం కానున్నారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ షాట్‌ సెలక్షన్‌పై విమర్శలు రాగా.. క్వాలిఫయర్‌2లో ప్రపంచ శ్రేణి పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌లపై అతడు ఎదురుదాడి చేసిన తీరు విమర్శకులను సైతం అబ్బురపరిచింది. 11 బంతుల్లో 12 పరుగులతో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆ తర్వాత ఊచకోత కోశాడు. జోశ్‌ ఇంగ్లిశ్‌, మార్కస్‌ స్టోయినిస్‌ సైతం శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడుకు జత కలిస్తే నేడు బెంగళూర్‌కు బ్యాండ్‌ తప్పదనే చెప్పవచ్చు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ విభాగం సైతం బలంగా ఉంది. మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌, యార్కర్ల హీరో అర్ష్‌దీప్‌ సింగ్‌లు స్పిన్‌, పేస్‌తో చెలరేగుతున్నారు. కైల్‌ జెమీసన్‌, హర్‌ప్రీత్‌ బరార్‌ సహా అజ్మతుల్లా ఓమర్‌జారులు చాహల్‌, సింగ్‌లకు చక్కటి సహకారం అందిస్తున్నారు. పవర్‌ప్లేలో, స్లాగ్‌ ఓవర్లలో ఎంతటి బ్యాటర్లను అయినా కట్టడి చేయగల సత్తా పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్ల సొంతం. ఫైనల్లోనూ బ్యాట్‌తో, బంతితో పంజాబ్‌ కింగ్స్‌ అంచనాలను అందుకుంటే కప్పు ఆ జట్టు సొంతమవటం లాంఛనమే.
కల నెరవేరేనా?
ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌ను టైటిల్‌ ఫేవరేట్‌గా మొదలెట్టిన జట్లలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఒకటి. ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరినా.. ఆ జట్టుకు నిరాశే మిగిలింది. పట్టువదలని విక్రమార్కుని తరహాలో నాల్గోసారి ఫైనల్‌కు చేరిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. 18వ సీజన్‌లో ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నేడు టైటిల్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్లో సొంతగడ్డ బయట జరిగిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్‌సీబీ.. అహ్మదాబాద్‌లో అదే రికార్డు కొనసాగించాలని చూస్తుంది. క్వాలిఫయర్‌1లో ఆర్‌సీబీ బ్యాట్‌తో, బంతితో ఏకపక్ష విజయం సాధించింది. పేసర్‌ జోశ్‌ హేజిల్‌వుడ్‌ నిప్పులు చెరుగగా.. స్నిన్నర్‌ సుయాశ్‌ శర్మ మాయజాలం ప్రదర్శించాడు. స్వల్ప లక్ష్యాన్ని బ్యాటర్లు సగం ఓవర్లలోనే ఛేదించారు. నేడు ఫైనల్లో ఆర్‌సీబికి స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కీలకం కానున్నాడు. ఫిల్‌ సాల్ట్‌తో కలిసి పవర్‌ప్లేలో విరాట్‌ కోహ్లి మ్యాజిక్‌ మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనుంది. మయాంక్‌ అగర్వాల్‌, రజత్‌ పాటిదార్‌లు ఫామ్‌లో ఉన్నారు. లియాం లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, రోమారియో షెఫర్డ్‌లు విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. కృనాల్‌ పాండ్య ఆల్‌రౌండర్‌గా గొప్పగా రాణిస్తున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ కొత్త బంతితో వికెట్ల వేటతో మెప్పిస్తుండగా.. యశ్‌ దయాల్‌ ఆఖరు ఓవర్లలో మ్యాజిక్‌ చూపిస్తున్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో కోహ్లి, సాల్ట్‌, జితేశ్‌ శర్మ.. బౌలింగ్‌ లైనప్‌లో హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సుయాశ్‌ శర్మలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు కీలక ఆటగాళ్లు.
పిచ్‌, వాతావరణం
అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌కు ఎర్ర మట్టి పిచ్‌ను సిద్ధం చేశారు!. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్ల శైలికి ఈ పిచ్‌ అనుకూలించనుంది. పేస్‌కు సహకారం లభించినా.. బ్యాటర్ల పరుగుల వేటకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. పెద్ద బౌండరీలు సహజంగానే మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్ల పాత్రను కీలకం చేయనున్నాయి. క్వాలిఫయర్‌2 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షంతో రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. నేడూ అహ్మదాబాద్‌లో వర్షం సూచనలు ఉన్నాయి. కానీ మ్యాచ్‌ సమయంలో వాతావరణం అనుకూలించనుందని సమాచారం. వర్షం కురిసినా అదనంగా రెండు గంటల సమయంతో పాటు టైటిల్‌ పోరుకు రిజర్వ్‌ డే షెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే.

తుది జట్లు (అంచనా)
పంజాబ్‌ కింగ్స్‌ : ప్రియాన్షు ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నెహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అజ్మతుల్లా ఓమర్‌జారు, కైల్‌ జెమీసన్‌, హర్‌ప్రీత్‌ బరార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యుజ్వెంద్ర చాహల్‌.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌, మయాంక్‌ అగర్వాల్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, లియాం లివింగ్‌స్టోన్‌, రోమారియో షెఫర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -