Monday, May 5, 2025
Homeసోపతిభద్రాద్రిలో మెరిసిన 'నవీన' కథకురాలు

భద్రాద్రిలో మెరిసిన ‘నవీన’ కథకురాలు

- Advertisement -

ఇవాళ్ళ మనం మాట్లాడుకుంటున్నది ఉమ్మడి ఖమ్మం గుమ్మం మీద కొత్తగా ఎగురుతున్న బాలల కథల జండా చిరంజీవి ఏసూరి సాయి నవీన గురించి. నవీన పుట్టింది నాగులపల్లి పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో, పదవ తరగతి వరకు నాగుల పల్లి గ్రామంలోనే చదివింది. తెలంగాణలోని అన్ని బడుల్లానే ఈ నాగులపల్లి పెద్ద బడి కూడా! అయితే మనమెందుకు మాట్లాడుకుంటున్నాం…! కారణం ఇక్కడి తెలుగు ఉపాధ్యాయిని శ్రీమతి వురిమళ్ళ సునంద. పాఠాలతో పాటు, పాటలు, కథలు, రచనలు, రచయితలను పరిచయం చేసిందీమె. ఆ స్ఫూర్తి ఎందరో బాల బాలికలను రచయితలుగా మలిచింది. అందులో కథల పూదోటగా వెలిసిన బాల కథా రచయిత్రి ఏసూరి సాయి నవీన ఒకరు.
చిరంజీవి నవీన నాగులపల్లిలో సెప్టెంబర్‌ 29, 2007న పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి ఏసూరి నిర్మల – శ్రీ ఏసూరి కాటయ్య. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నవీన కవిత్వం, కథలు, గేయాలతో పాటు పలు సమీక్షలు రాసింది. ఈ చిన్నారి రచనలు ‘నాగులపల్లి కథా మువ్వలు’, ‘నాగులపల్లి కవితా దివ్వెలు’, ‘నాగులపల్లి కథా కదంబం’, ‘చిరు స్వరాలు’ వంటి కథా, గేయ, కవితా సంకలనాల్లో అచ్చయ్యాయి. ఇవేకాక ‘సమీక్షల సమాహారం’ సంకలనంలో సమీక్ష అచ్చయ్యింది. అంతేకాదు ‘నల్లహంస’ గొలుసుకట్టు నవలలో నవీన కొంత భాగాన్ని రాసింది కూడా. పాఠశాలలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఈమె తెలంగాణ సారస్వత పరిషత్‌ నిర్వహించిన పిల్లల పండుగలో ‘ముల్లును ముల్లతోనే’ అనే కథ ‘ఉత్తమ బాల కథా రచయిత్రి’గా బహుమతి గెలుచుకుంది. అక్షరయాన్‌ సంస్థ ఉత్తమ బాల కవయిత్రిగా సత్కారం పొందింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఈ బాల రచయిత్రి పేరు నమోదయ్యింది. పై సంస్థల కార్యక్రమాల్లోనే కాక కొత్తగూడెం బాలోత్సవ్‌, తెలంగాణ సారస్వత పరిషత్‌ బాలల కార్యశాలతో పాటు మరికొన్ని కథా రచనా కార్యశాలలు, ఇతర శిల్పశాలల్లోనూ పొల్గొంది.
నవీన అన్ని ప్రక్రియలు, రూపాల్లో రచనలు చేసినప్పటికీ పదవ తరగతిలోనే ఇరవై కథలు రాసింది. ఈ ఇరవై కథలను ‘నవీన క(థా)వనం’ బాల సాహిత్యం కథలు పేరుతో ఖమ్మంకు చెందిన సాహిత్య, బాల వికాస సంస్థ వురిమళ్ళ ఫౌండేషన్‌ ప్రచురించింది. పదవ తరగతిలోనే తన దృష్టికోణం లోంచి అనేక విషయాలు, అంశాలపై రచనలు చేసింది నవీన. తాను చూసిన లేదా విన్న అంశాలను బహుశా నవీన కథలుగా మలిచిందేమో. ఈమె కథా సంపుటిలోని తొలి కథ ‘అమ్మాయి జీవితం’ రచయిత్రిగా నవీన ఆలోచనలకు అద్దంపడుతుంది. అర్జున్‌, అనూష కవల పిల్లలు. అనూష చదువులో ముందుండి అన్నింట్లోనూ ఉచిత సీట్లను పొంది చదువు పూర్తిచేస్తుంది. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుందని, ఆమె కోసం ఖర్చు పెట్టడం వృధా అని భావిస్తాడు ఆమె తండ్రి. చదువులో అంతంత మాత్రమే వున్న కొడుకు అర్జున్‌ కోసం అస్తులను అమ్మి చదివించినా చివరకు ఎటుకాకుండా పోతాడు. ఆడపిల్ల ఆనుకున్న అనూషనే తల్లితండ్రులను చూసుకుంటుంది. ఆడపిల్లల చదువుపట్ల, వారి ఎదుగుదల పట్ల నవీనకున్న అభిప్రాయానికి చక్కని ఉదాహరణ ఈ కథ. ‘డబ్బు ఫలితం’ మరో కథ. ఇందులోని రాఘవ డబ్బు బాగా సంపాదించడంతో తనంత వారు లేరని అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటాడు. చివరిదశలో తనను చూసేవారు లేక పోవడంతో డబ్బు ఒక్కటే శాశ్వతం కాదని, మానవ సంబంధాలు, అనుబంధాలు ముఖ్యమని తెలుసుకుంటాడు. ఇంకా ‘మెకానిక్‌ అరవింద్‌’ కథ వ్యక్తులు తాము చేస్తున్న పనిలో లేదా తమకు యిష్టమైన వృత్తిలో దృష్టిపెట్టి ముందుకు కదిలితే అద్భుతాలు సాధించొచ్చని చెప్పే కథ ఇది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సాయినవీన తన కథలకు ఎంచుకున్న పాత్రలు, విషయాలు, వ్యక్తులందరూ తన చుట్టూ ఉన్నవాళ్ళే. ఖమ్మం జిల్లాలోనో, కొత్త గూడెంలోనో, నాగులపల్లిలోనో కనిపించే వాళ్లే. నవీన రాసిన ‘ప్రకాష్‌ తెలివి’, ‘ఆనందాకాష్‌’, ‘మానవత్వం’, ‘నిజాయితీ’ చక్కగా చదివించే కథలు. ‘సక్సెస్‌ కేర్‌ ఆఫ్‌ కల్పన…’ కష్టాలకు ఎదురీది, విజయ శిఖరాలపై నిలిచిన ఆడపిల్ల కథ. ఇందులోని నాయిక కల్పనకు చదువంటే చాలా యిష్టం. చిన్నతనంలోనే పెళ్లైనా చదువుకుంటుంది, అత్తింటివాళ్ళు వద్దన్నా ఎదురించి చదివి, తెలుగు ఉపాధ్యాయినిగా ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలుచుని, స్త్రీ సాధికారతను తన చిన్నారి ఆలోచనలతో టీచర్‌గా ఎదిగినట్టు చూపిస్తుంది నవీన. ‘మతిమరుపు మంగయ్య మొదటిసారి చేసినపని’ గమ్మత్తైన కథ. హాస్యంతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చిందీ బాల రచయిత్రి. ఉచితంగా, తేరగా డబ్బులు వస్తాయంటే నమ్మొద్దని, అందులో మోసం ఉంటుందన్న విషయం చక్కగా చెప్పింది. ‘ఫలించిన పోరాటం’ కోతుల అస్తిత్వానికి ముప్పు సంభవించినప్పుడు అవి ఏం చేశాయో తెలిపే కథ. ‘పిసినారి పాపయ్య’. కథలో తండ్రి పట్ల కొడుకు బాధ్యతను, పాపయ్య పిసినారితనాన్ని తెలుపుతుంది. అక్షరాలు నేర్చుకునే దశలోనే రచయిత్రిగా తనకంటూ చక్కని స్థానాన్ని తెలుగు బాల సాహిత్య లోకంలో ఏర్పరచుకున్న ఏసూరి సాయి నవీనకు ఆశీరభినందనలు. తెలుగునేలమీద వేలాదిమంది బాల రచయితలను తీర్చిదిద్దుతున్న ‘గురుబ్రహ్మ’లు.. ‘బాల సాహితీ వికాసవేత్తల’కు అలాయి బలాయి! సునందక్క మీకు… పుస్తకాన్ని ప్రచురించిన వురిమళ్ళ ఫౌండేషన్‌కు అభినందనలు! జయహో! బాల సాహిత్యం!

  • డా|| పత్తిపాక మోహన్‌
    9966229548
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -