– గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారు
– ధరణి సమస్యలకు చెక్ పెట్టేందుకే కొత్త చట్టం
– ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులదే
– గుర్తింపు కోసం భవిష్యత్తులో భూధార్ : భూ భారతి ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
‘ తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూ తిరిగాయి. ‘జల్.. జంగిల్.. జమీన్’ నినాదంతో కొమురంభీమ్ పోరాడితే.. భూమి కోసం, విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేశారు. ‘
– సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మనుషుల గుర్తింపు కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆధార్ కార్డులా భవిష్యత్‌లో ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేసేలా భూమి గుర్తింపు కోసం భూధార్ విధానాన్ని తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో సోమవారం భూ భారతి పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ”గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ‘ధరణి’ ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. వివాదరహిత భూ విధానాలను తీసుకు రావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది. గత పాలకుల్లా రెవెన్యూ అధికారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. అవినీతికి పాల్పడే వ్యక్తులపై కఠినంగా ఉంటామే తప్ప వ్యవస్థపై కాదు. మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం” అని సీఎం అన్నారు. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
అసైన్డ్ కమిటీలను పునరుద్ధరిస్తాం: భట్టి
భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మోఖా మీద సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన పేదవారికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తుందని వెల్లడించారు. గత పాలకులు పదేండ్లలో పేదలకు ఒక్క ఎకరం పంచలేదని విమర్శించారు. దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటాలు జరుగగా, తెలంగాణలో మాత్రం భూమి కోసం పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. దున్నేవాడికే భూమి కావాలని పోరాటం నుంచి వచ్చిందే టెన్‌ఏన్సీ చట్టమని పేర్కొన్నారు.ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు టెన్‌ఏన్సీ చట్టం తీసుకొచ్చారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ప్రజలకు అన్ని హక్కులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి పేర్కొన్నారు
భూ భారతి చట్టంతో నా జన్మధన్యం : పొంగులేటి
రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో జన్మధన్యమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నలుగురు కలిసి రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం- ధరణితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని చెప్పారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం, మహబూబ్‌నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాలను ఎంపిక చేశామని చెప్పారు. మే మొదటివారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తామని తెలిపారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని వెల్లడించారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో అన్నివర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అవసరమైన మార్పులు చేసి జూన్2 నాటికి సమగ్ర చట్టాన్ని అందుబాటులోకి తెస్తామని వివరించారు.
భూ భారతితో భూమికి భరోసా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES