Monday, January 12, 2026
E-PAPER
Homeసోపతివిశ్వాసం

విశ్వాసం

- Advertisement -

అనగనగా వెల్టూరు అనే గ్రామంలో రంగన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడు కూలీ పని చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు. ఆ గ్రామం పక్కనే చిన్న అడవి ఉండేది. అప్పుడప్పుడు వేటకి కూడా వెళ్ళేవాడు. అతనికి తోడుగా ఒక కుక్క ఉండేది. తాను తయారు చేసుకున్న బాణంతో పావురాలను, పిట్టలను వేటాడి చంపి ఇంటికి తెచ్చుకొని తినేవాడు. అందులో కొంత తన కుక్కకి కూడా పెట్టేవాడు. ఒక్కోసారి అవసరం లేకపోయినా కొన్ని పక్షులను చంపేసి అక్కడే వదిలేసి వచ్చేవాడు. అది చూసి ఎందుకలా చంపుతావు అన్నట్లు అతని పైపైకి అరుస్తూ వెళ్ళేది. దానికి అతను కోప్పడేవాడు. కాసేపు ఊరంతా తిరిగి మళ్ళీ అతని దగ్గరికే వచ్చి పడుకునేది.

ఓసారి ఎప్పటిలాగే రంగన్న వేటకు వెళ్లి పక్షులను చంపి తెస్తుంటాడు. మార్గం మధ్యలో ఒక కుందేలు పరుగెడుతూ కనిపిస్తుంది. అనవసరంగా దాన్ని చంపుతున్నాడని కుక్క అడ్డుపడ్తుంది. రంగన్న కాలికి తగిలి కుక్క కింద పడుతుంది. రంగన్న కూడా కింద పడిపోతాడు. దాంతో రంగన్నకు కోపం వచ్చి కుక్కను తిడుతూ, కట్టెతో కొడతాడు. కుక్క పారిపోతుంది. రంగన్న కుంటుతూ ఇంటికి చేరుకుంటాడు. నొప్పితో ఉన్న రంగన్న అలాగే తినకుండా పడుకుంటాడు. తెల్లారేసరికి జ్వరం కూడా వస్తుంది. లేవడానికి చేతకాక అలాగే పడుకుంటాడు. అంతలో కుక్క అక్కడికి చేరుకుంటుంది. రంగన్న పరిస్థితి అర్థం అవుతుంది. ఊరంతా తిరిగి తినడానికి ఒక రొట్టెముక్క తెచ్చి రంగన్న ముఖం దగ్గర పెడుతుంది. రంగన్న కుక్క అలికిడి విని లేచి చూసి, కుక్క తెచ్చిన రొట్టెముక్క తింటాడు. కాస్త ఊపిరి పీల్చుకొని, నీళ్ళు తాగి కూర్చుంటాడు. అనవసరంగా కుక్కను కోప్పడ్డాను అని తన తప్పు తెలుసుకొని కుక్కను దగ్గరికి తీసుకుంటాడు. కోప్పడినా కుక్క రొట్టెముక్క తెచ్చి తన ఆకలిని తీర్చిన కుక్కను ప్రేమగా చూస్తాడు. తనపై చూపిన విశ్వాసానికి కరిగిపోతాడు. కుక్క కోరినట్లు నిజంగానే అనవసరంగా పక్షులను చంపుతున్నాను కదా అని ఆలోచించి ఇకనుండి అలా చంపొద్దు అని నిర్ణయించుకుంటాడు. కుక్కను వెంటబెట్టుకొని ఆసుపత్రి బయలుదేరుతాడు. మరునాటి నుండి వేటాడటం మానేసి కూలీ పని చేసుకుని బతుకుతాడు రంగయ్య.

ఎస్‌. మహేశ్‌, 10 వ తరగతి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, దేవరకద్ర, మహబూబ్‌ నగర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -