Monday, February 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడ్రోజుల్లో రూ.20 కోట్లు

మూడ్రోజుల్లో రూ.20 కోట్లు

- Advertisement -

మున్సిపల్‌ శాఖకు ‘పన్నుల పంట’
నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అత్యధికంగా రూ. 8 కోట్లు
అత్యల్పంగా కోహీర్‌లో రూ. 32 వేలు
పోటీలో ఉన్న వ్యక్తి తప్పక చెల్లించాలనే నిబంధనతోనే భారీగా చెల్లింపులు
పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యానికి సంకేతం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పురపోరు నేపథ్యంలో మున్సిపల్‌ శాఖకు పన్నుల పంట పండింది. ఏడాదంతా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనతో భారీ స్థాయిలో పెండింగ్‌ పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల ఆస్తి పన్ను చెల్లించి ఔరా అనిపించారు. అంతకు ముందు వారు తమ పరపతిని ఉపయోగించి పన్నులు కట్టడంలో కాలయాపన చేసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అత్యధికంగా రూ. 8 కోట్ల పన్నులు వసూలైతే…కోహీర్‌ మున్సిపాల్టీలో అత్యల్పంగా రూ.32 వేలు మాత్రమే వసూళ్లయ్యాయి. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

‘నో డ్యూ సర్టిఫికెట్‌’ నిబంధన కారణంగా ప్రతి యూఎల్‌బీకి అభ్యర్థుల నుంచి ఆస్తి పన్ను రూపంలో రూ.6 నుంచి 8లక్షల వరకు ఆదాయం వచ్చింది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.89.10 లక్షలు, కొత్తగూడెం కార్పొరేషన్‌ రూ.69.24లక్షలు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ రూ.59.25 లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌ రూ.56.02 లక్షలు, సిద్దిపేట రూ.45.08 లక్షలు, మంచిర్యాల కార్పొరేషన్‌ రూ.37.66 లక్షలు, గడ్డపోతారం రూ.31.39 లక్షలు, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ రూ.29.70 లక్షలు వసూలయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులపై మున్సిపల్‌ శాఖ ఒక్కసారిగా కొరడా ఝలిపించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బకాయిల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు చెప్పినప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఎవరికి టికెట్‌ వస్తుందో వారే చెల్లించాలనే నిబంధన ఉంది. తాము కొన్నేండ్లు చెల్లించకపోయినా ఫర్వాలేదు అనే ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు పన్నుల చెల్లింపునకు పూనుకోలేదు. అభ్యర్థిత్వాలు ఖరారై, పార్టీలు బీఫామ్‌ సమర్పించే క్రమంలో ఆస్తి పన్నులు కూడా పూర్తిగా చెల్లించాలనే నిబంధన ఒక్కసారిగా అభ్యర్థులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపాల్టీలకు ఎలాంటి బకాయిలు లేకుండా ఉండాలనే నిబంధనలను ఆధారంగా చేసుకుని అధికారులు చర్యలు ప్రారంభించారు. నామినేషన్‌ సమయంలో ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర యూజర్‌ చార్జీల బకాయిలుంటే నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పన్నుల ప్రక్రియను పూర్తి చేశారు.

అభ్యర్థుల అసహనం
ఏండ్లుగా పన్నులు వసూళ్లు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన మున్సిపల్‌శాఖ, ఎన్నికల సమయంలోనే అకస్మాత్తుగా కఠినంగా వ్యవహరించడం సరైన విధానం కాదని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి పౌరుడికి మున్సిపల్‌ శాఖతో ఏదో ఒక అవసరం ఉంటుందనీ, ఆ అవసరాన్ని ఆసరాగా చేసుకుని మున్సిపల్‌ అధికారులు పన్నులను వసూలు చేస్తుండటం గమనార్హం. ఏండ్లుగా పన్నులు ఎవరూ అడగలేదు. ఇప్పుడు ఒక్కసారిగా కోట్ల రూపాయలు చెల్లించాలంటే ఎలా? అని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం బకాయిలు చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యతని అంటున్నారు. పన్నుల ప్రభావం అభ్యర్థులపైనే కాక సాధారణ ప్రజలపైనా పడుతోంది. ఎన్నికల సమయానికే ఇలాంటి చర్యలు తీసుకోవడం పరిపాలనా వైఫల్యాన్ని బయటపెడుతోందని భావిస్తున్నారు.

గాడి తప్పుతున్న మున్సిపాల్టీలు
ప్రతియేటా ఆస్తి పన్నులు వసూలు చేయాల్సిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు గాడి తప్పుతున్నాయి. పౌరుడి అవసరాన్ని అవకాశవాదంగా తీసుకుని నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీనికి అనేక కారణాలు కూడా చెబుతున్నాయి. చాలా మున్సిపాలిటీల్లో రెవెన్యూ సిబ్బంది తక్కువగా ఉండటం, పన్నుల అంచనా, వసూళ్ల పనులు సకాలంలో జరగకపోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయి. ఆస్తుల డేటా అప్‌డేట్‌ చేయకపోవడం, పాత అంచనాలే కొనసాగడంతో నిజమైన బకాయిలు గుర్తించడంలో ఆలస్యమవుతున్నది.

రాజకీయ నాయకుల ప్రభావంతో కొందరిపై పన్ను వసూళ్లు నిలిపివేయడం, వారికి మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టకపోవడం, ఫలితంగా ఎన్నికల ముందు ఒక్కసారిగా పెద్ద మొత్తాలు వసూలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులు, రిబేట్లపై సరైన ప్రచారం లేకపోవడం వల్ల చాలా మంది బకాయిలు పెరిగే వరకు పట్టించుకోవటంలేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అస్తవ్యస్త పన్నుల విధానాన్ని మార్చడంతోపాటు క్రమం తప్పకుండా పన్నులు వసూళ్లు చేస్తే ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -