– మినీ టీచర్లను ప్రమోట్ చేసిన రాష్ట్ర సర్కారు
– టీచర్లతో పాటు వారికీ రూ.13,500 వేతనం
– పోరాట ఫలితంగానే జీవో.. ప్రభుత్వానికి ధన్యవాదాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన ఒక్కొక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తున్నది. తాజాగా మినీ అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త తెలిపింది. 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్ల ను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ జీవో నెంబర్ 306ని జారీ చేసింది. ఇక నుంచి మినీ, మెయిన్ అంగన్‌వాడీ అన్న తేడా లేకుండా అందరూ అంగన్‌వాడీ టీచర్లేనని స్పష్టం చేసింది. ఈ నెల నుంచే అది అమల్లోకి రానున్నది. ఇప్పటివరకూ మినీ అంగన్‌వాడీలకు రూ.7800 ఇస్తున్నది. ఇక నుంచి వారికి నెలకు రూ.13,650 ఇవ్వనుంది. సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కుల వల్ల ఇంతకాలం ఆలస్యమైనట్టు ప్రభుత్వం పేర్కొంది. తమను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోట్ చేయడంపై మినీ అంగన్ వాడీ టీచర్లు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వానికి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం)
మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్ప్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ హర్షం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలోనే వారిని అప్‌గ్రేడ్ చేసిందని గుర్తుచేశారు. పెరిగిన వేతనాలు(ఏరియర్స్) చెల్లించకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేశామని తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా అధికారులకు వినతిపత్రాలు అందజేశామనీ, ప్రాజెక్టు, జిల్లా స్థాయిలో అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. చలో హైదరాబాద్, డైరెక్టరేట్ ముట్టడి, ప్రజాభవన్‌లో మూకుమ్మడిగా వినతిపత్రాలు అందజేత, మార్చి 17,18 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట 48 గంటల ధర్నాలు, వంటావార్పులు చేశామని వివరించారు. నిరంతర పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ 306 జీవోను విడుదల చేసిందని పేర్కొన్నారు. పోరాడి విజయం సాధించిన మినీ అంగన్‌వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. 12 నెలల పెండింగ్ వేతనాల (ఎరియర్స్)ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు.
అందరూ అంగన్‌వాడీ టీచర్లే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES