– నిప్పురవ్వే కదా అనుకుంటే నిలువునా కాల్చేస్తుంది: ఎఫ్ఆర్ఓ మురళి
నవతెలంగాణ – అశ్వారావుపేట
నీళ్ళు, నిప్పు, గాలి మానవాళికి ఎంత నిత్యవసర మో వీటి పట్ల అశ్రద్ద వహించినా,అప్రమత్తత పాటించక పోయినా ప్రాణాపాయ ప్రమాదం అని సీఐ కరుణాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన,అగ్నిమాపక సేవల శాఖ ఆద్వర్యంలో ప్రతీ ఏడాది ఏప్రిల్ 14 నుండి 20 వ తేది వరకు “అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన పెంచుదాం – సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే అగ్ని మాపక వారోత్సవాలను సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారి ఎస్కే సైదులు అద్యక్షతన నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి సీఐ కరుణాకర్ హాజరై ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. అగ్ని మనకు ఎన్నో విధాలుగా ఉపయోగ పడుతుందనే మాట ఎంత నిజమో కాని దానిని ఉపయోగించడంలో మనం ఏమాత్రం పొరపాటు చేసినా అది మనకు అంతకంటే ప్రమాదం కలుగజేస్తుంది అనేది అక్షర సత్యం అటవీ క్షేత్రాధికారి ఎం.మురళి అన్నారు. ఒక అతిచిన్న నిప్పు రవ్వను అలక్ష్యం చేసినా అది మనకు ఘోరాతి ఘోరమైన ప్రమాదం కలిగిస్తుంది.పశువుల కాపరులు,అటవీ వీక్షకులు,ఆహ్లాద వాతావరణ వీక్షకులు చుట్ట,బీడీ,సిగరెట్టు తాగి పడేసే చేసే చిన్నపాటి అశ్రద్ద తో అడవిలో అగ్ని ప్రమాదం సంభవించి తరతరాలుగా ఏపుగా పెరిగిన వృక్షాలు,ఔషధ గుణాలున్న చెట్లు,విలువైన అటవీ ఉత్పత్తులు,కలప కాలి బూడిద అవుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అగ్ని ప్రమాదాలతో ప్రాణనష్టం,ఆస్తినష్టం కలుగుతుందని,దేశ సంపద ధ్వంసం కావచ్చు కాబట్టి అగ్ని విషయములో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు అని ఎక్సైజ్ ఎస్ఐ రాజేశ్వరరావు తెలిపారు.
1944 ఏప్రిల్ 14 వ తేదీన ముంబాయి విక్టోరియా డాక్ యార్డ్ లో సంభవించిన నౌకా అగ్ని ప్రమాదం లో,విధినిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వ తేది వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తాం అని అగ్ని మాపక అధికారి ఎస్కే సైదులు తెలిపారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించడం,వారి ఆత్మ శాంతికి ప్రార్ధించడం.అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేయడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. అగ్నిప్రమాద సమయంలోనే కాకుండా వరదలు,రోడ్డు ప్రమాదాలు,రైలు ప్రమాదాలు,భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ ప్రజలకు సేవ చేయుటకు,ప్రమాదము లో ప్రకృతి వైపరీత్యాల లో ప్రాణనష్టం,జరగకుండా కాపాడుట మా ప్రధాన కర్తవ్యం అని అన్నారు.ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గాబరా పడి మనో ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తతో వ్యవహరించాలి, మీకు దగ్గరలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారము అందించాలని,ఆ సమాచారం లో మీ పేరు, ఫోన్ నెంబరు,ప్రమాదం జరిగిన ప్రదేశం వివరాలు (అడ్రస్ – చిరునామా) వివరాలను మాకు వివరంగా తెలియజేయాలి తెలిపారు. ముందుగా అగ్నిమాపక పతాకాన్ని కిందకు దించి డాక్ యార్డ్ మృత వీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంకటరెడ్డి,రాజా,చెన్నారావు,వెంకటేష్,పి.నరేష్,బీ.వీ.ఎన్ క్రిష్ణ బాబు,సీ హెచ్.నరేష్ ఎఫ్.బీ.ఓ లు నరేష్,సురేష్ లు పాల్గొన్నారు.