Monday, March 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మాన్యువల్‌కు చెక్‌..

మాన్యువల్‌కు చెక్‌..

- Advertisement -

– ఇక ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లు!
– గ్రేటర్‌లో 5, రాష్ట్రంలో మరో 10 చోట్ల ఏర్పాటుకు కసరత్తు
– వాహన ఫిట్‌నెస్‌ పరీక్షల్లో పారదర్శకతకు పెద్దపీట
– అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రవాణా శాఖ చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

వాహన ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న మాన్యువల్‌ తనిఖీ విధానానికి స్వస్తి పలికి, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రయివేట్‌ ‘ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్ల’ను (ఏటీఎస్‌) దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ప్రస్తుత విధానంలో లోపాలు
ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయాల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐలు) వాహనాలను మాన్యువల్‌ పద్ధతిలో తనిఖీ చేస్తున్నారు. కంటి చూపుతో అంచనా వేయడం, చిన్నపాటి టెస్ట్‌ డ్రైవ్‌లతో బ్రేకులు, లైట్లు సరిగా ఉన్నాయో లేదో చూడటం వంటివి జరుగుతున్నాయి.
ఈ విధానంలో శాస్త్రీయత, పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫిట్‌నెస్‌ లేని వాహనాలకు కూడా దళారుల ప్రమేయంతో యథేచ్ఛగా ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఆ వాహనాలు ప్రమాదాలకు, కాలుష్యానికి కారణమవుతున్నాయి.

త్వరలో టెండర్లు ప్రక్రియ
ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా రవాణాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేంద్రాల నిర్మాణానికి సుమారు ఎకరన్నర నుంచి ఆపైనే స్థలం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక యంత్రాలు, నిర్మాణ వ్యయానికి సంబంధించి ఒక్కో స్టేషన్‌కి సుమారు 8 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరనున్నాయి. ఈ నిధులు ఏరియా, అవసరాలను బట్టి మారుతుంటాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ప్రభుత్వానికి పంపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సంబంధిత ప్రాంతాల్లో వసతులు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే రోడ్డు భద్రత మెరుగుపడటంతో పాటు, అనర్హమైన వాహనాలు రోడ్లపై తిరగకుండా కట్టడి చేయవచ్చని రవాణా శాఖ భావిస్తోంది.

ఎక్కడెక్కడ ఏర్పాటు?
రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖకు చెందిన 54 కార్యాలయాల పరిధిలో ఈ ఏటీఎస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలుత రవాణా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ముఖ్య ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు. తొలి దశలో దుండిగల్‌, కొండాపూర్‌, ఉప్పల్‌, నాగోల్‌, పటాన్‌చెరువు ప్రాంతాల్లో ఈ ఆటోమేటెడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల్లోనూ దశలవారీగా విస్తరించనున్నారు.

ఆటోమేటెడ్‌ సెంటర్లతో పక్కాగా తనిఖీలు
ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలను నివారించేందుకు ప్రయివేట్‌ ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మానవ ప్రమేయం లేకుండా యంత్రాల ద్వారానే పరీక్షలు జరుగుతాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ బస్సులు, మోటార్‌ క్యాబ్స్‌, ఆటోరిక్షాలు సహా అన్ని వాణిజ్య వాహనాలు ఫిట్‌నెస్‌ కోసం ఈ టెస్టింగ్‌ సెంటర్‌కు వస్తాయి. ఈ సెంటర్‌లోని యంత్రాలన్నీ కంప్యూటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. సర్టిఫికెట్ల జారీ కూడా కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది. వాహనాల ఫిట్‌నెస్‌ సమయంలో ఇంజిన్‌ కండీషన్‌, బ్రేక్‌ టెస్ట్‌, హెడ్‌లైట్‌ బీమ్‌ అడ్జస్ట్‌మెంట్‌, సస్పెన్షన్‌, వీల్‌ అలైన్‌మెంట్‌, పొల్యూషన్‌ స్థాయిలను కంప్యూటరైజ్డ్‌ మిషన్లు కచ్చితంగా లెక్కిస్తాయి. వాహనం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే కంప్యూటర్‌ ద్వారా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -