Saturday, July 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మికుల ప్రాణాలకంటే, లాభాలే ముఖ్యమా?

కార్మికుల ప్రాణాలకంటే, లాభాలే ముఖ్యమా?

- Advertisement -

రాష్ట్రంలో జూన్‌ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదం దేశంలోనే దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పరిశ్రమలో జరిగిన పేలుడు మూలంగా భారీ ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ప్రాంతమంతా కూడా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తున్నది. కార్మికుల శవాలు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 39 మంది మతి చెందారు. మరో 34 మంది కార్మికులు వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు మత్యువుతో పోరాడుతున్నారు. నేటీకి మరో తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ఇంకా కొంత మంది శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉన్నది. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శవాలు కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా మాంసం ముద్దలుగా పడి ఉన్నాయి. డిఎన్‌ఏ పరీక్షల ద్వారా శవాలను గుర్తించి కుటుంబాలకు అందించే ప్రక్రియ కొనసాగుతున్నది. వీరంతా బతుకుదెరువు కోసం బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి నుండి వచ్చిన వలస కార్మికులు. శిథిలాల నుండి బయటికితీస్తున్న కొద్దీ ఎము కలు, కాళ్లు, చేతుల శరీర భాగాలు బయటపడుతున్నది. ఈ దశ్యాలు హదయ విదారకంగా కనిపిస్తున్నవి. కార్మికుల కుటుంబాలు మొత్తం దయనీస్థితిలో దుఃఖ సాగరంలో మునిగినవి.


సిగాచి ఘటన జరిగిన ఈ వారంలోనే మేడ్చల్‌ జిల్లాలో కెమికల్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలిన ఘటనలో కార్మి కుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే పనిచేస్తున్న మరో 50 మంది కార్మికులు ప్రమా దం నుండి తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని తిరుపతి రబ్బర్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కార్మికులు విధుల్లో లేరు, కాబట్టి ప్రాణ నష్టం తప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని ముంగి పరిశ్రమలో కార్మికుడి చేయి ప్రమాదవశాత్తు యంత్రంలో పడి నలిగిపోయింది. వైద్యులు చెయ్యి కొంత భాగాన్ని తొలగించారు. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ఎస్‌.బి కెమికల్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది మృతిచెందుతూనే ఉన్నారు. వందలాదిమంది క్షతగ్రాతులు అవుతూనే ఉన్నారు. వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి.


ప్రమాదాల నివారణలో సర్కార్‌ వైఫల్యం
పరిశ్రమల నిర్వహణలో భద్రత, ఆరోగ్యం, పర్యావరణం లాంటి అంశాలను పరిరక్షించడానికి చట్టబద్ధంగా యజమానులు తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్దేశించడానికి ఫ్యాక్టరీల చట్టం 1948 అమల్లో ఉన్నది. ఈ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రులు బాధ్యత వహించాలి. వీరి పర్యవేక్షణలో ఫ్యాక్టరీ డైరెక్టర్లు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు తదితర యంత్రాంగం ఉంటుంది. ఈ యంత్రాంగం వివిధ పరిశ్రమలను, ప్రమాదాలు జరగడానికి గల అవకాశాల రిస్క్‌ను బట్టి కేటగిరీలుగా విభజిస్తారు. కెమికల్‌ పరిశ్రమలు, ఫర్నేసులు, బాయిలర్స్‌, హైరీస్కు క్యాటగిరీలో ఉంటాయి. ఈ పరిశ్రమలను కార్మికుల సంఖ్యను బట్టి వివిధ స్థాయి అధికారులు తరచుగా తనిఖీలు చేయాలి. భద్రతాపరమైన అంశాల పట్ల రెగ్యులర్‌గా ఆడిట్‌ జరిపి ప్రమాదాలను పసిగట్టాలి. కార్మికులను, యాజమాన్యాలను అప్రమత్తం చేయాలి. ప్రమాణాలను పాటించని యాజ మాన్యాలపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. కానీ ఇవేమీ అమలు చేయడం లేదు. సరళీకరణ విధానాలు అమలుల్లోకి వచ్చాక ప్రభుత్వం పూర్తిగా యాజమాన్యాలకు అండగా ఉంటున్నది. ”ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌” పేరుతో కార్మికుల భద్రత, ఆరోగ్యం, వేతనాలు చెల్లింపు, పర్యావరణ పరిరక్షణలాంటి అంశాలు పూర్తిగా యాజమాన్యాలకు వదిలేసింది. చట్ట బద్ధంగా జరగాల్సిన తనిఖీలను నిరోధించడం, నామమాత్రం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జీవోలు విడుదల చేశాయి. కార్మిక శాఖ చట్టాల అమలును పర్యవేక్షించడం పూర్తిగా మానేసింది.ఫలితంగా క్రమపద్ధతిలో ఫ్యాక్టరీలను, యంత్రాల పరిస్థితిని తనిఖీలు చేయడం లేదు.


ప్రభుత్వ నిర్లక్ష్యం, యజమాన్యాల లాభపేక్ష
ముఖ్యంగా కెమికల్‌ పరిశ్రమ ఉత్పత్తిలో కీలకమైన రియాక్టర్స్‌, డ్రైయర్స్‌, సెంటర్‌ ఫ్యూజ్‌ ఆపరేషన్స్‌ లాంటివి ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నావా? లేదా? అనేది ముఖ్యం. ఇవి వ్యాక్యూమ్‌ ప్రెజర్‌తో ఉంటవి. క్రమం తప్పకుండా రీడింగ్‌ మానిటర్‌ చేయాలి.వీటికి ముందస్తుగా మెయింటెనెన్స్‌ చేయాలి.ఈ పనులకు నైపుణ్యం కలిగిన కార్మికులను వినియోగించాలి. యజమానుల లాభపేక్ష, ప్రభుత్వ అండదండలు, యంత్రాంగం ఉదాసీనత మూలంగా ఉత్పత్తిలో విచ్ఛలవిడిగా నైపుణ్యంలేని కాంట్రాక్ట్‌ కార్మికులను, వలస కార్మికులను వినియోగిస్తున్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించడం పేరుతో యజమానులు అత్య ధిక లాభాలు ఆర్జిస్తున్నారు. సిగాచి కెమికల్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి రియాక్టర్‌ పేలుడు కారణమని ఒక అధికారి చెబితే, కాదు డ్రయ్యర్‌ పేలుడని మరొక అధికారి చెప్పాడు. ఈ పేలుళ్లలో కుట్రకోణం ఉందేమో అనే అను మానాన్ని వ్యక్తం చేసి యాజమాన్యం ప్రతినిధి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఘటన ఎలా జరిగిందో విశ్లేషించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. సాంకేతిక కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, యాజమాన్యం నిర్లక్ష్యం ప్రధాన మానవ తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారి బంధువులకు తగిన సమాచారం ఇచ్చేవారు యాజమాన్యం వైపు నుండి ఎవరు కనిపించకపోవడం చాలా దారుణం. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై హత్య నేరం కింద కేసు రిజిష్టర్‌ చేసి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ గుజరాత్‌కు చెందిన ఈ పెట్టుబడిదారుడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


నయా ఉదరవాద విధానాల పటిష్టానికే కార్మిక చట్టాల్లో మార్పులు
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పోరేట్‌ల లాభాలు పెద్దఎత్తున పెంచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో శ్రామికులకున్న కొద్దిపాటి చట్టబద్దమైన హక్కులను కూడా రద్దు చేస్తున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 29 రకాల కార్మిక చట్టాలను పార్లమెంట్‌ ద్వారా రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు రకాల లేబర్‌కోడ్స్‌ తెచ్చింది. ఇవి ఇంకా అధికార యుతంగా అమల్లోకి రానప్పటికీ కార్మిక చట్టాల్లో అనేక మార్పులు చేస్తూ జీవోలు విడుదల చేస్తున్నది. కార్మికులకు భద్రత లేకుండా వారి ఆరోగ్యానికి రక్షణ లేకుండా చేస్తున్నది. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్స్‌ తనిఖీ చేసే అధికారిగా ఉండకూడదు. కేవలం ఫెసిలిటేటర్స్‌ ఉండాలని నిర్ణయం చేసింది. వీరి పాత్ర యజమానులకు అలాగే మారిపోయింది. కార్మికుడు భద్రతా ప్రమాణాలపై, ఆన్‌ సేఫ్‌ వర్కింగ్‌ కండీషన్స్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నది. ప్రత్యేకించి కేంద్రం కార్మిక రంగంలో డిజిటలైజేషన్‌, ర్యాండమైజేషన్‌, సెంట్రలైజేషన్‌ ఆఫ్‌ లేబర్‌ పేరుతో ఫ్యాక్టరీల తనిఖీలకు ”శ్రమ సువిధా సమాధాన్‌” పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై కేంద్ర, రాష్ట్ర ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్స్‌ నేరుగా ఇన్‌స్పెక్షన్‌ చేయలేరు. ఆ ఫిర్యాదు సెంట్రలైజేషన్‌, ర్యాండమైజేషన్‌లో నమోదైందా? లేదా? అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు కార్మిక చట్టాలను తాము సక్రమంగానే పాటిస్తున్నామని యజమాని ”సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌” ఇస్తే సరిపోతుంది. పారిశ్రామిక ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ ”జనసురక్షా చట్టం 2023” తీసుకువచ్చింది. దీని ప్రకారం పారిశ్రామిక ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు. బాయిలర్‌ పేలుడు, గ్యాస్‌ లీకేజి, రియాక్టర్స్‌ పేలుడులాంటివి పారిశ్రామిక ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నవి. ఇలాంటి సందర్భాల్లో కూడా పైన పేర్కొన్న చట్టం ప్రకారం యాజమానులపై క్రమినల్‌ చర్యలు చేపట్టకూడదు. దీని కొనసాగింపుగా 2025-26 బడ్జెట్‌ సందర్భంగా పార్లమెంట్‌లో ”జనసురక్షా బిల్లు 2.0” ప్రవేశపెట్టి యజమానులపై నేరపూరిత చర్యలు తీసుకోకుండా మరింత రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.


ఈ నేపథ్యంలో ప్రమాదాల్లో మృతిచెందిన వారికి, తీవ్రంగా గాయపడిన వారికి చట్టబద్దంగా నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వాలు తగిన మొత్తంలో ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుం బాలను ఆదుకోవాలి. ప్రమాదాల నివా రణకు యజమానులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నవి. బాయిలర్స్‌ చట్టానికి చేసిన సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నవి. కార్మికుల భద్రతను పట్టించుకోని యాజమాన్యాల వైఖరిని నేరపూరిత చర్యలుగా భావించి క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్షించాలి. ప్రస్తుతం అమలవుతున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే లేబర్‌ కోడ్స్‌ను ఉపసంహరించడం ద్వారా మాత్రమే కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం, పర్యా వరణ అంశాలకు రక్షణ ఉంటుంది. ఈ లక్ష్యసాధనకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలి.

చుక్కరాములు
9490098700

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -