నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఉద్రిక్తత నెలకొంది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఆర్జీకార్ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆందోళనకారులు శనివారం కోల్‌కతాలో నబన్నా అభియాన్ పేరుతో మార్చ్ నిర్వహించారు. బెంగాల్ సచివాలయం నబన్నా వరకూ ర్యాలీ తీశారు. అయితే, ఈ ర్యాలీ ఘర్షణకు దారి తీసింది. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి ఆంక్షల వలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
ఈ ర్యాలీలో బాధితురాలి తల్లిదండ్రులు, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందుకు అధికారి సహా పలువురు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే, పోలీసుల దాడిలో బాధితురాలి తల్లి కూడా గాయపడ్డారు. పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు గాయపడినట్లు సువేందు అధికారి తెలిపారు.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవితఖైదు విధించింది. అయితే, దోషికి ఉరిశిక్ష విధించాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.