ఐసీఐసీఐ కస్టమర్లకు భారీ షాక్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే లో సాంకేతిక లోపం/భద్రతా లోపం తలెత్తింది. ఈ మేరకు పలువురు ఐసీఐసీఐ కస్టమర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (ట్విట్టర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పోస్టులు చేస్తున్నారు. ఐమొబైల్ పే యాప్‌లో ఇతరుల వివరాల్ని కూడా పొందగలుగుతున్నట్లు.. వీటిల్లో క్రెడిట్ కార్డులు వంటివి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ వ్యక్తులెవరో కూడా తెలియట్లేదని.. దీని వల్ల తమ సమాచారం కూడా దుర్వినియోగం ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఐమొబైల్ పే యాప్‌లో క్రెడిట్ కార్డు వివరాల్లో క్రెడిట్ కార్డు పూర్తి నంబర్, ఎక్స్‌పైరీ డేట్ సహా సీవీవీ కూడా కనిపిస్తుంది. దీనిని ఇప్పుడు ఇతరులు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా ఉందని సోషల్ మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇంకా సెట్టింగ్స్‌ల్లో ఫారెన్ ట్రాన్సాక్షన్స్‌కు అడ్జస్ట్ చేసుకొని.. క్రెడిట్ కార్డుల్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భయపడుతున్నారు యూజర్లు. మీరు కూడా ఇతరుల వివరాలు చూసినట్లయితే.. ఎలాంటి దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు కంప్లైంట్ చేయాలని కోరుతున్నారు. ఐమొబైల్ పే యాప్‌లో చాలా మంది .. తాము ఇతరుల వివరాల్ని చూస్తున్నట్లు.. ఇది తీవ్రమైన భద్రతా లోపం అంటూ ఐసీఐసీఐ బ్యాంకుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సెట్టింగ్స్ ద్వారా చిన్న మార్పు చేసి.. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ఇది దుర్వినియోగానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందో సమీక్షించాలని కూడా ఈ సందర్భంగా కోరుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఐమొబైల్ పే లో క్రెడిట్ కార్డులకు సంబంధించిన సెక్షన్ ఓపెన్ కావట్లేదు. ఇంకొందరు ఇదే సమస్య నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకుకు మెయిల్ చేసినా.. కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా, మెయిల్ చేసినా స్పందించట్లేదని చెప్పారు. ఇలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక యూజర్ చేసిన పోస్టుకు స్పందించిన మరో యూజర్.. తాను ఇప్పటివరకు 10 క్రెడిట్ కార్డుల డీటెయిల్స్ చూసినట్లు చెప్పడం గమనార్హం.

Spread the love