ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్‌ డ్రిల్స్‌

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించారు. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఈనెల 1వ తేదీన సుమారు 200 పాఠశాలలకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఈ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌, ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున ఈ డ్రిల్స్‌ను నిర్వహించారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ కమాండోలు, ఢిల్లీ పోలీసులు డ్రిల్స్‌ నిర్వహించారు. ఇందులో ఎయిర్‌పోర్ట్‌ భద్రతను చూసే సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కూడా చేరింది. ఇక శనివారం తెల్లవారుజామున 1 గంటకు రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో, 1:30 గంటలకు హైదరాబాద్‌ హౌస్‌, తెల్లవారుజామున 3 గంటలకు ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ డ్రిల్స్‌ నిర్వహించారు. అంతకుముందు తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌, ద్వారకలోని యశో భూమి, కశ్మీర్‌ గేట్‌ మెట్రో స్టేషన్‌, సెంట్రల్‌ ఢిల్లీలోని న్యూ పార్లమెంట్‌ భవనంలో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. ఉగ్రదాడి, బాంబు బెదిరింపులు వంటి సమయాల్లో ఎలా స్పందించాలన్న దానిపై అధికారులు డ్రిల్స్‌ చేపట్టారు. ఈ మాక్‌ డ్రిల్స్‌లో అగ్నిమాపక శాఖ, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వంటి ఇతర ఏజెన్సీలు కూడా పాలుపంచుకున్నాయి.

Spread the love