పచ్చిమాంసం తినొద్దన్నందుకు … యువకుడి హత్య

నవతెలంగాణ హైదరాబాద్: పచ్చి మాంసం తినొద్దని చెప్పినందుకు.. ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన నగరంలో చోటుచేసుకొంది. తుకారాంగేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై స్థానిక సీఐ ఆంజనేయులు, మృతుడి బంధువుల వివరాల మేరకు.. తుకారాంగేట్‌ మరాఠా బస్తీకి చెందిన అజయ్‌ కాంబ్లే(22) వృత్తిరీత్యా వివాహాది శుభకార్యాలకు బ్యాండ్‌ కొడతాడు. ఏడాదిన్నర కిందట బంధువుల అమ్మాయి ప్రియాంకను ప్రేమ పెళ్లి చేసుకొన్నాడు. వీరికి 8 నెలల పాప ఉంది. కొన్నేళ్లుగా మరాఠా బస్తీలో వీరు నివాసమున్న ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో ఖాళీ చేసి గోల్‌బావి సమీప బస్తీలో ఏడాదిగా అద్దెకుంటున్నారు. అజయ్‌ ఇంటి పక్కనే అతని సోదరుడు లకన్‌ కాంబ్లే, అతని బావ రవి కుటుంబం.. మూడు ఇళ్లలో అద్దెకుంటున్నారు. ఇళ్ల యాజమాని మహేందర్‌ ప్రతీనెలా వీరి నుంచి అద్దె వసూలు చేయడానికి శ్రీనివాసాచారి(42)ని పక్కనే మరో ఇంట్లో ఉంచాడు. ఇతడు కొన్నెండ్లగా ఒంటరిగా ఉంటున్నాడు. తరచూ కల్లు తాగడం, ఆ మత్తులో పక్కనున్న ఇళ్లవారితో గొడవలు పడటం చేసేవాడు. సంక్రాంతి రోజు ఉదయం సుమారు పదిన్నర గంటలకు శ్రీనివాసాచారి తన ఇంట్లో కూరగాయల కత్తితో కోస్తూ పచ్చి మాంసం తింటున్నాడు. సమీపంలో ఉన్న అజయ్‌, అతని భార్య ప్రియాంక గమనించి, పచ్చిమాసం ఎందుకు తింటున్నావ్‌.. వండుకొని తినొచ్చు కదా అని అడిగారు. మాటామాటా పెరిగి ఇరువురి మధ్య వివాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాసాచారి పక్కనే ఉన్న కత్తితో ప్రియాంకపై దాడి చేశాడు. ఆమె చేతివేళ్లకు గాయమైంది. అజయ్‌పైనా దాడిచేసి పొట్టలో పొడవడంతో తీవ్ర గాయమైంది. బంధువులు వెంటనే అజయ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఘటనా స్థలిని మహంకాళి ఏసీపీ రవీందర్‌, క్లూస్‌టీం పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. అజయ్‌ను హత్య చేసిన శ్రీనివాసాచారిని తమకు అప్పగించాలంటూ మరాఠా బస్తీ వాసులు, అజయ్‌ బంధువులు తుకారాంగేట్‌ ఠాణాకు సోమవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. నిందితుడిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో వారంతా వెళ్లిపోయారు.

Spread the love