ఎల్‌ఈడీ బల్బు మింగిన బాలుడు..

నవతెలంగాణ – చెన్నై: ఒక బాలుడు ఎల్‌ఈడీ బల్బు మింగాడు. అది ఊపిరితిత్తులో చిక్కుకున్నది. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు. బ్రోంకోస్కోపీ ద్వారా ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఎల్‌ఈడీ బల్బు మింగాడు. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. కాగా, ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆ బాలుడ్ని తొలుత ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. బ్రోంకోస్కోపీ ద్వారా ఎల్‌ఈడీ బల్బును బయటకు తీసేందుకు ప్రయత్నించిన డాక్టర్లు విఫలమయ్యారు. దీంతో ఓపెన్‌ సర్జరీ చేయాలని బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. అయితే ఐదేళ్ల బాలుడికి ఓపెన్‌ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నది కావడంతోపాటు కోలుకునేందుకు ఐసీయూలో ఉంచాల్సి ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బాలుడ్ని చెన్నైలోని శ్రీరామచంద్రా హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు గత శుక్రవారం బాలుడ్ని పరీక్షించిన అక్కడి పిల్లల వైద్యులు సీటీ స్కాన్‌ చేశారు. ఎల్‌ఈడీ బల్బు బాలుడి ఊపిరితిత్తులోని శ్వాసనాళాల వద్ద ఉన్నట్లు గుర్తించారు. బ్రోంకోస్కోపీ ద్వారా తీసేందుకు ప్రయత్నిస్తామని, అది ఫలించకపోతే ఓపెన్‌ సర్జరీ చేయాల్సి ఉంటుందని బాలుడి తల్లిదండ్రులకు డాక్టర్లు తెలిపారు. అయితే బ్రోంకోస్కోపీ ద్వారానే విజయవంతంగా ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు. దీంతో ఓపెన్‌ సర్జరీ చేయాల్సిన అవసరం తప్పింది. అలాగే బాలుడు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

Spread the love