కవిత అరెస్టుకు సంబంధించి పలువురిని విచారణకు పిలిచిన ఈడీ

kavithaనవతెలంగాణ – హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఏడు రోజుల పాటు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో ఆమె పాత్రపై క్షుణ్నంగా విచారణ జరపనుంది. అయితే కవిత అరెస్టుకు సంబంధించి పలువురిని ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. సోమవారం రోజున విచారణకు రావాలని పిలిచినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఇటీవల హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు ఆ సమయంలో ఆమె నివాసంలో 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 2 ఫోన్లు కవితవిగా ఈడీ అధికారులు తెలిపారు. మిగిలిన ఫోన్లు వాడుతున్న వారిలో కవిత వ్యక్తిగత సహాయకులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత సహాయకులను రేపు ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ దిల్లీకి వెళ్లారు.

Spread the love